చెన్నై: హోమ్లీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహ సీమంతం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ విషయాన్ని స్నేహ భర్త, నటుడు ప్రసన్న ట్విట్టర్లో తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి సినీ పరిశ్రమ పెద్దలు హాజరై ఆమెకు ఆశీస్సులు అందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. కాంజీవరం చీరలో స్నేహ వెలిగిపోయింది. బంగారు నగలతో ఆమె మొహం కాంతులీనింది.
'చాలా తక్కువ సమయంలో ఉండటం వల్ల ఈ ఫంక్షన్కు అందర్నీ ఆహ్వానించలేకపోయాను, క్షమించాలి... మీ అందరి ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. అది నాకు తెలుసు' అంటూ స్నేహ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెలుగు , తమిళం భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన నటి స్నేహ. పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో శ్రీరామదాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. స్నేహి తెలుగులో నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి.
కాగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా చలామణి అవుతున్న రోజుల్లో తమిళ హీరో ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2012 మే 11న వీరి వివాహం జరిగింది. అంటే సంసార జీవితంలోకి అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ తొలిసారి అమ్మకాబోతుంది.