లండన్: ఇంటర్నెట్ ఆగమనంతో యావత్ ప్రపంచం సమూలంగా మారిపోయింది. ఇక సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీ సినీ స్టార్లు నేరుగా అభిమానులతో ముచ్చటించుకునే అవకాశం ఏర్పడింది. అయినా సోషల్ మీడియా అంటే తనకు చాలా భయమని చెప్తోంది ప్రముఖ హాలీవుడ్ నటి పెనెలోప్ క్రూజ్. 'జూలాండర్ 2' వంటి ప్రముఖ సినిమాల్లో నటించిన ఈ 41 ఏళ్ల అమ్మడు సోషల్ మీడియా అనేది ఒక అసహజమైన వేదిక అని తెలిపింది. క్రూజ్‌కు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది. ఫేస్‌బుక్‌లోగానీ, ట్విట్టర్‌లోగానీ ఆమె చేరలేదు.
దీనిపై ఆమె స్పందిస్తూ 'ఇంటర్నెట్ రాకతో ప్రపంచం మారిపోయింది. నాలాంటి వాళ్ల అలవాట్లు కూడా మారాయి. నేను ఇప్పుడు లేఖలు రాయడం మానేసి టెక్స్ట్ మెసేజీలు మాత్రమే పంపుతున్నా. కానీ భవిష్యత్తులో ఇవి రెండు కలిసి మనుగడ సాగిస్తాయని అనుకుంటున్నా' అని తెలిపింది. 'నేనెప్పుడూ సోషల్ మీడియాకు దూరంగానే ఉన్నా. నాకు ట్విట్టర్‌లోగానీ, ఫేస్‌బుక్‌లోగానీ ఖాతాలు లేవు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉన్నా దానిని ప్రత్యేక విషయాలకే వాడుతున్నా. పొద్దున్న లేచింది మొదలు బ్రేక్ ఫాస్ట్ నుంచి నేను తినే ప్రతిదీ ఫొటో తీసి నేను పంచుకోను. అలా కుటుంబ విషయాలు పంచుకోవడం నాకు అసహజంగా తోస్తుంది' అని క్రూజ్ చెప్పింది.
సోషల్ మీడియా అంటే చాలా భయం!
Published Mon, Feb 15 2016 10:04 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement