టిక్‌టాక్‌ హీరో.. సినీ స్టార్స్‌ ఫాలోయింగ్‌ | Social Media Star Mehaboob Shaik Special Story | Sakshi
Sakshi News home page

‘మెహబూబ్‌’ టిక్‌టాక్‌ హీరో

Published Fri, Oct 11 2019 11:37 AM | Last Updated on Fri, Oct 11 2019 1:18 PM

Social Media Star Mehaboob Shaik Special Story - Sakshi

సెలబ్రిటీస్‌కి ఒక రేంజ్‌ ఉంటుంది. వాళ్లు టీవీలో, పేపర్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కి పండగే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌ వంటి వాటిలో ప్రత్యక్షమవుతూ.. ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటన్నింటిలోనూ ‘టిక్‌టాక్‌’ హావానే నడుస్తోంది. పిల్లలు నుంచి పెద్దల వరకు తమక నచ్చిన వీడియోలు చేస్తూ ఈ యాప్‌లో తమ ప్రతిభతో సందడి చేస్తున్నారు. పైగా ఈ టిక్‌టాక్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న వారిని ఫాలో అవుతున్నారు మన టాలీవుడ్‌ స్టార్స్‌. వారివారి సినిమా ప్రమోషన్స్‌ని టిక్‌టాక్‌ స్టార్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు. ఇదే కోవలో సిటీకి చెందిన ‘మెహబూబ్‌’ సినీ సెలబ్రిటీలు మెచ్చిన సెలబ్రిటీ అయిపోయాడు.

సాక్షి, సిటీబ్యూరో: మణికొండకు చెందిన మెహబూబ్‌ షేక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే మహాపిచ్చి. ఫ్రెండ్స్‌తో కలసి సరదగా డ్యాన్స్‌ చేస్తుండేవాడు. ఇదే సమయంలో ‘టిక్‌టాక్‌’ యాప్‌ సోషల్‌ మీడియాలోకి వచ్చింది. ఆ యాప్‌ సాయంతో ఇతడు చిన్న చిన్న డైలాగ్‌లు చేస్తూ వాటిని పోస్ట్‌ చేయడంతో నెటిజన్లు హిట్స్‌ కొట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుందని ఇప్పుడు పూర్తిగా ఇందులోనే మునిగిపోయాడు. ఇప్పుడు మహబూబ్‌ను టిక్‌టాక్‌లో 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అంతేకాదు.. యూట్యూబ్‌లో 2.90 లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 2.28 లక్షల మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు.

సినీ స్టార్స్‌ ట్రెండీ ప్రమోషన్‌
టాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్‌ కోసం టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ సైట్లలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న వారిని ఆశ్రయిస్తున్నారు. సిటీలో మెహబూబ్‌కు టిక్‌టాక్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉండడంతో సినిమా ప్రొడ్యూసర్లు మెహబూబ్‌ని తమ సెలబ్రిటీగా ఎంచుకుంటున్నారు. అతడి ద్వారా వీడియోస్‌ చేసి ‘సోషల్‌’ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తూ.. నెటిజన్లును మెప్పిస్తున్నారు. ఓ పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీని సినిమా ప్రొడ్యూసర్లు సొంతం చేసుకుంటుండగా.. మరోపక్క సినీసార్టు సోషల్‌ మీడియా సెలబ్రిటీస్‌తో కలసి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టడం విశేషం.  

యూట్యూబ్‌లోనూ రారాజే
ఇప్పటి వరకు 20కి పైగా షార్ట్‌ ఫిల్మ్‌స్‌లో హీరోగా చేసిన మెహబూబ్‌.. యూట్యూబ్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ఇతడు చేసిన ‘మారీ–2’ సినిమాలోని ‘రౌడీబేబీ’ పాటకు యూట్యూబ్‌లో 1.60 కోట్ల మంది(16ఎం) వీక్షించడం విశేషం. ఇతడు చేసే ప్రతి వీడియో పది లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో కామెంట్స్, లక్షల్లో హిట్స్‌ని సొంతం చేసుకోవడం మెహబూబ్‌కే సాధ్యమైంది. సినిమా, కార్పొరేట్, ఫ్యాషన్, వైద్యం ఇలా ప్రతి రంగం మెహబూబ్‌ స్టార్‌డమ్‌ని కోరుకుంటున్నారు. అతని ద్వారా వారి వారి ఉత్పత్తులకు ప్రచారకర్తగా వాడుకుంటున్నారు. మహబూబ్‌ సరదాగా టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసిన చిన్న వీడియోలు ఇప్పుడు అతడిని స్టార్‌ను చేశాయంటే విశేషమే మరి. 


నాని.. కాజల్‌.. నిధి.. నభా..
అగ్ర సినీ తారలు సైతం తమ చిత్ర ప్రమోషన్‌కు ఈ మార్గం ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అగ్రహీరో నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా ప్రమోషన్‌ని మెహబూబ్‌తో కలిసి చేశాడు. ఆ సినిమాలో బాగా పాపులర్‌ అయిన ‘హోయిన హోయినా’ అనే సాంగ్‌ని టిక్‌టాక్‌ యాప్‌తో మెహబూబ్‌ చేస్తుండగా.. మధ్యలో నాని వచ్చి అతడితో కలిసి స్టెప్పులేశాడు. శర్వానంద్, కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మెహబూబ్‌.. కాజల్‌కు ఐలవ్యూ చెప్పి ప్రొపోజ్‌ చేస్తాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో నభా నటేష్‌తో కలసి డ్యాన్స్‌ చేశాడు. నిధి అగర్వాల్‌తో కలసి కాన్సెప్ట్‌ వీడియో చేశాడు.

ఇతడో బ్రాండ్‌ అంబాసిడర్‌
కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ప్రపంచ టాప్‌ దుస్తుల షోరూంలు సైతం మెహబూబ్‌ స్టార్‌డమ్‌ని వాడుకుంటున్నాయి. ఇటీవల ‘ఫ్లైయింగ్‌ మిషన్‌’ సంస్థ ఆఫర్లు, డిస్కౌంట్స్‌ ఉన్నాయంటూ మెహబూబ్‌తో ఓ వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతేకాదు సిటీలోని టాప్‌ మోస్ట్‌ డిజైనర్స్‌ తమ దుస్తులకు మెహబూబ్‌నే మోడల్‌గా పెట్టుకున్నారు. ఇతడే తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.  

‘పక్కా లోకల్‌’.. హుషార్‌
రోడ్డుపై సడన్‌గా వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తి సడన్‌గా ఆపి మైక్‌ పెడతాడు. ‘మీ ఫస్ట్‌ కిస్‌’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తాడు. ఏం అడుగుతున్నాడో అని మనం ఆలోచించే లోపే మరో ప్రశ్న వేస్తాడు. చెప్పాలనుకునేవారు సమాధానం ఇస్తారు.. లేదంటే  లేదు.. ఇలాంటి అంశాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిటీకి రిలేటెడ్‌గా ఉన్న ‘పక్కా లోకల్‌ టీం’ యూట్యూబ్‌ చానెల్‌ రోజుకో కొత్త రకమైన థీమ్‌తో ప్రజల్లోకి వస్తోంది. ఆ థీమ్‌ ఆధారంగా పార్కు, రెస్టారెంట్స్, ట్యాంక్‌బండ్, చార్మినర్‌ వంటి ప్రాంతాల్లోయుతను టార్గెట్‌ చేస్తుంది. చానెల్‌కి చెందిన యాంకర్‌ అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రశ్నలు వేస్తాడు. ఆ క్వశ్చన్‌కి పగలబడీ మరీ నవ్వుతూ సమాధానం చెప్పడం విశేషం. ఒక్కోసారి ఆ క్వశ్చన్స్‌ డబల్‌ మీనింగ్‌ను తలపిస్తాయి. ఫైనల్‌గా ఆన్సర్‌ మాత్రం ఆదర్శంగా, తెలివిగా ఉంటుంది. యూట్యూబ్‌లో వీరు చేస్తున్న డిఫ్‌రెంట్‌ ప్రొగ్రామ్స్‌కు నెటిజన్లు లక్షల్లో హిట్స్, లైక్‌లు ఇవ్వడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement