షాహిద్‌.. ఏంటిది?! | Sona Mohapatra Slams Shahid Kapoor Kabir Singh Movie | Sakshi
Sakshi News home page

‘కబీర్‌ సింగ్‌’పై మండిపడ్డ సింగర్‌!

Published Sun, Jun 23 2019 3:15 PM | Last Updated on Sun, Jun 23 2019 5:10 PM

Sona Mohapatra Slams Shahid Kapoor Kabir Singh Movie - Sakshi

షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్‌ మూవీ ‘కబీర్‌ సింగ్‌’పై గాయని సోనా మహాపాత్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి క్యారెక్టర్లు చేయడం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ షాహిద్‌పై మండిపడ్డారు. బాధ్యతరాహిత్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు. టీవీ యాక్టర్‌ నకుల్‌ మెహతా కబీర్‌ సింగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..‘ 99 సమస్యలు ఉండనీ. షాహిద్‌ కపూర్‌ మాత్రం అందులో ఒకడు కాదు. కాసేపు రాజకీయాలను పక్కనపెడితే కబీర్‌ సింగ్‌ ఓ అద్భుత వర్ణన. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌లో ప్రతీ ఒక్కరు తమను తాము చూసుకుంటున్నారు అంటూ ట్వీట్‌ చేశాడు. అదే విధంగా జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ కూడా సోషల్‌ మీడియా వేదికగా ‘కబీర్‌ సింగ్‌’  సినిమాలో షాహిద్‌ నటనను ప్రశంసించారు.

ఈ నేపథ్యంలో వీరివురి ట్వీట్లపై స్పందించిన సోనా...‘ మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, పితృస్వామ్య వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్న ఈ సినిమాను మీరు పూర్తిగా గమనించలేదా. కేవలం నటనను మాత్రమే చూస్తారా? మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్‌లో మహిళలకు ఉన్న స్థానం గురించి పునరాలోచించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సినిమాల ద్వారా ఏం చెప్పదలచుకున్నారు’ అని ప్రశ్నించారు. అయితే సోనా ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు ‘కబీర్‌ సింగ్‌’ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement