
ఆ కల నెరవేరుతుందా?
జీవితంలో ఏదేదో సాధించాలనే కల అందరికీ ఉంటుంది. కొంతమందే ఆ కలను నెరవేర్చుకోగలుగుతారు. మరి.. సోనాక్షీ సిన్హా తన కలను నెరవేర్చుకుంటారో లేదో చెప్పలేం కానీ.. ఆమె కల ఏంటో మాత్రం తెలుసుకుందాం. బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కథానాయికల్లో ఒకరైన సోనాక్షీ ఇటీవల హాలీవుడ్ చిత్రం ‘రియో 2’లోని ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.. అది మంచి అనుభూతినిచ్చిందని సోనాక్షీ తెలిపారు. అలాగే తన కల గురించి చెబుతూ - ‘‘ప్రస్తుతం బాలీవుడ్‌లో నా కెరీర్ చాలా బాగుంది.
ఇతర భాషల నుంచి అవకాశాలు వచ్చినా అంగీకరించేంత తీరిక లేదు. కానీ, హాలీవుడ్ స్టార్స్ జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ సరసన అవకాశం వస్తే మాత్రం సద్వినియోగం చేసేసుకుంటా. ఎందుకంటే, నాకు ఈ ముగ్గురూ అంటే చాలా ఇష్టం. వాళ్లు నటించిన సినిమాలను ఇష్టపడి చూస్తుంటాను. ఆ సినిమాల్లో మనం నటించి ఉంటే ఎంత బాగుండేది? అని కూడా అనుకుంటాను. వెండితెరపై వారి సరసన నటిస్తున్న కథానాయికల స్థానంలో సరదాగా నన్ను నేను ఊహించుకుని చూసుకుంటాను. అంత అభిమానం’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె హిందీలో ‘హాలిడే’, ‘తేవర్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.