
ముంబై : పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజా జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. వీరి వివాహం మంగళవారం జరగనుండగా.. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను ఘనంగా నిర్వహించారు. సోనం ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నేడు సంగీత్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతోపాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొననున్నారు.
మరోవైపు సోనం పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వివాహమనేది సంతోషంగా చేసుకునే వేడుక. అందులో సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒకటవుతున్న వేళ.. అందరు ఒక దగ్గర చేరి చేసుకునే పార్టీ లాంటిది. పెళ్లి అనేది సీరియస్ అంశమే. కానీ పెళ్లితో ఏదో జరిగిపోతోంది.. కొత్తగా మొదలవుతుంది అంటూ ఉండదు. కాబట్టి ఆ తర్వాత ఏమిటన్నది సీరియస్‌గా తీసుకోకూడదు. ఇప్పటివరకు నటించాను.. పెళ్లి తర్వాత కూడా నటిస్తాను’ అని సోనమ్ పేర్కొన్నారు.





