న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో గొప్పగా ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ప్రశంసలు కురిపించారు. భారత ఎయిర్‌పోర్టు అధికారులు కరోనాను అరికట్టేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నారని... అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సోనం కపూర్.. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి మంగళవారం లండన్ నుంచి ఢిల్లీకి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని స్వదేశంలో అడుగుపెట్టిన సోనం దంపతులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటుగా... గత 25 రోజులుగా వారు చేస్తున్న ప్రయాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.(భారత్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు!)
ఈ క్రమంలో తన అనుభవాలను సోనం తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘‘మేం లండన్ నుంచి బయల్దేరుతున్నప్పుడు స్క్రీనింగ్ చేయలేదు. ఈ విషయం తెలిసి షాకయ్యాం. అయితే భారత్‌కు చేరుకోగానే... మా ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ఎయిర్‌పోర్టు అధికారులు ఫారమ్‌లో నింపమన్నారు. అయితే అంతటితో ఆగిపోకుండా మరోసారి మా పాసుపోర్టులు పరిశీలించి మేం చెప్పింది నిజమా కాదా అని చెక్ చేశారు. అక్కడ ప్రతీ ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. (‘కరోనా’ పై కొత్త చాలెంజ్.. భారీ స్పందన )
అదే విధంగా కరోనాను ఎదుర్కొనేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని... స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంద్వారా దీని వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. తమలో వైరస్ లక్షణాలు లేకపోయినప్పటికీ తాము హోం క్వారంటైన్‌లో ఉంటున్నామని వెల్లడించారు. వైద్యులు, అధికారులు చెప్పిన మాటలు వినాలని.. వైద్య పరీక్షల నిమిత్తం వారికి సహకరించాలని సోనం విజ్ఞప్తి చేశారు. కాగా చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 8000 మంది మరణించారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 147కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్, జిమ్ సెంటర్లు, పార్కులు తదితర జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే చోట్లను మూసివేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment