
కాలు విరిగి.. యాక్షన్ సీన్లు ఆలస్యం: సోనూ సూద్
విలన్ పాత్రలకు పెట్టింది పేరైన సోనూ సూద్కు కాలు విరిగిందట. తాజాగా శుక్రవారం విడుదలైన 'ఆర్.. రాజ్కుమార్' చిత్రంలో నటించిన సోనూ, ఈ ప్రమాదం వల్ల తనకు యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైందని బాధపడిపోయాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయని, కానీ షూటింగ్ మొదలు కావడానికి ముందే తన కాలు విరిగిందని, అది కూడా ఒకచోట కాదు.. ఏకంగా ఆరేడు చోట్ల ఫ్రాక్చర్లు ఉన్నాయని సోనూ సూద్ తెలిపాడు.
అందువల్ల తాను యాక్షన్ సన్నివేశాలు చేయడానికి చాలా ఇబ్బంది అయ్యిందన్నాడు. తన కాలు బాగుపడేవరకు ఈ సన్నివేశాలు షూట్ చేయడానికి కుదరలేదు కాబట్టి, కొన్ని నెలల పాటు ఈ సన్నివేశాల షూటింగును వాయిదా వేశారని గురువారం నాడు ఓ ఇంటర్వ్యూలో సోనూ సూద్ వివరించాడు. అందుకే షూటింగ్ కూడా ఆలస్యమైందన్నాడు. ప్రభుదేవా తీసిన 'ఆర్.. రాజ్కుమార్' చిత్రంలో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులోని క్లైమాక్సులో వచ్చే యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని, వాటిని చూసినప్పుడు మిగిలిన మంచి యాక్షన్ సినిమాలను మర్చిపోతారని సోనూ సూద్ అన్నాడు.