
21 ఏళ్లకు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌమ్యా సేథ్ పలు హిందీ సీరియళ్లలో నటించి ప్రతిభ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నవ్య, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన భావోద్వేగ పోస్ట్ ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నటిగా పరిచయమైన నాటి నుంచి ఈరోజు వరకు తానెంతో పరిణతి సాధించానని రాసుకొచ్చిన సౌమ్య.. ఈరోజుల్లో నిజాయితీగా ఉంటే ఎవరూ లెక్కచేయడం లేదని వాపోయారు. అమ్మాయిలు తమ సొంత కాళ్లపై నిలబడాలని.. అబ్బాయిల్లో తమ సంతోషం వెదుక్కోవడానికి ప్రయత్నిస్తే నిరాశే మిగులుతుందని నిర్వేదానికి లోనయ్యారు.
‘ఎనిమిదేళ్ల క్రితం నవ్య క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఈ ప్రపంచంలో ప్రేమతో మార్చలేనిది ఏదీ లేదని భావించాను. ప్రతీ ఒక్కరిని ప్రేమగా పలకరించాలని, మంచి మనసుతో జీవించాలని అనుకున్నాను. దుష్ట శక్తుల నుంచి నన్ను కాపాడే నా తల్లిదండ్రుల నీడలో హాయిగా జీవించాను. కానీ ఎప్పుడైతే నాకు నేనుగా నిర్ణయాలు తీసుకోవాలని భావించానో అప్పటి నుంచి ద్వేషం, అసూయ, శారీరక హింస, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్, డ్రగ్స్‌తో పాటు.. అందమైన ముఖాలు కలిగి ఉండి కఠిన హృదయం గల వ్యక్తులను చూశాను. నవ్యగా ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత ప్రిన్స్ చార్మ్ గురించి కలలు కనడం వంటి కాన్సెప్టులు ట్రాష్ అని అర్థమైంది. ప్రతీ అమ్మాయి తన మనసు చెప్పిన మాటను వినాలి. అమ్మాయిల సంతోషం ఏ అబ్బాయిపైనో ఆధారపడి ఉండకూడదు. ఈరోజుల్లో నిజాయితీ అనేది చాలా ఖరీదైన వస్తువుగా మారిపోయింది. అయినా నవ్యగా ప్రయాణం జీవితకాలపు అనుభవాన్ని పంచింది. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ధైర్యం ఉన్న ఒక ఆడపిల్ల కథ’ అంటూ సౌమ్యా సేథ్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
కాగా రెండేళ్ల క్రితం సహనటుడు అరుణ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న సౌమ్యకు ఐడెన్ అనే కుమారుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా తనతో పాటు కుమారుడి ఫొటోలను పోస్ట్ చేస్తున్న సౌమ్య.. భర్త గురించి మాత్రం ఎటువంటి సమాచారాన్ని షేర్ చేయడం లేదు. అయితే శుక్రవారం నాటి పోస్టులో నవ్య క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చిన సౌమ్య భర్తతో విడిపోతున్న కారణంగానే ఇలా భావోద్వేగానికి లోనయ్యారేమోనని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘నిన్ను బాధ పెట్టిన వారి ముందు సంతోషంగా ఉండటంలోనే నీ విజయం దాగుంటుంది గనుక ధైర్యంగా ఉండాలి’ అని సౌమ్యకు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment