పోలీస్ గెటప్లో రీఎంట్రీ
సౌత్లో టాప్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సిమ్రాన్, కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయాత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆమె వెండితెరకు కాస్త దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవల జివి ప్రకాష్ హీరోగా నటించిన 'త్రిష లేదా నయనతార' సినిమాలో అతిథి పాత్రలో నటించిన సిమ్రాన్ మళ్లీ తన రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది.
గతంలో చేసినట్టుగా గ్లామర్ రోల్స్లో కాకుండా, ఈ సారి ఓ లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతుంది సిమ్రాన్. సొంత నిర్మాణ సంస్థ ద్వారా తన భర్త దీపక్ నిర్మిస్తున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన మర్థాని తరహా కథా కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌరీ శంకర్ అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభించనున్నారు.