సినిమాల్లో హంతకుణ్ణి అయితే నిజంగానే హత్యలు చేస్తానా?
‘‘నటుడిగా నాలోని భిన్న కోణాలు చూపించుకోవాలని తాపత్రయపడతాను. అందుకే ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేస్తున్నాను’’ అని అవసరాల శ్రీనివాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన హిందీ ‘హంటర్’ రీమేక్ ‘బాబు బాగా బిజీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించారు. అవసరాల చెప్పిన విశేషాలు..
‘అష్టా చమ్మా’లో నేను చేసిన పాత్ర అందరికీ నచ్చింది. ఆ తర్వాత అలాంటి పాత్రలు దాదాపు 30 వరకూ వచ్చాయి. అవి చేసి ఉంటే, ‘అవసరాల ఇలాంటి పాత్రలకే పనికొస్తాడు’ అని నాకో ఇమేజ్ ఫిక్స్ చేసేసేవారు. నేను కూడా అందులోంచి బయటకు రావడానికి ఇష్టపడకుండా రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తే, నాకే బోర్ కొట్టి ఉండేది. అందుకే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా. ఎవరైనా సరే సినిమాని సినిమాగా చూడాలి. అలాగే, తెర మీద నటించే ఆర్టిస్ట్‌ని కాకుండా పాత్రను చూడాలి. సినిమాలో హంతకుడి పాత్ర చేస్తే నిజజీవితంలో నేను హత్యలు చేస్తానని కాదు కదా? సినిమా వరకే హంతకుణ్ణి.
∙‘క్లీన్’ ఇమేజ్ ఉన్న నేను ‘బాబు బాగా బిజీ’లాంటి అడల్డ్ సినిమా సెలక్ట్ చేసుకోవడం కొంతమందిని ఆశ్చర్యపరచి ఉండొచ్చు. ‘వర్క్ ఈజ్ వర్క్’. నా వ్యక్తిత్వానికి సినిమాల్లో చేసే పాత్రలకూ సంబంధం ఉండదు. వాస్తవానికి ‘హంటర్’ సినిమా చూసి, చేయాలా? వద్దా అనుకున్నాను. చివర్లో ఇచ్చిన మెసేజ్ చూసి, చేయాలని నిర్ణయించుకున్నాను. నేనే పని చేసినా ఇతరుల సలహాల మీద ఆధారపడను. నా సొంత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తాను. ఆ తర్వాత వాటి గురించి ఆలోచించను.
∙నేను డైరెక్షన్ చేస్తానన్నప్పుడు నటుడిగా చేస్తున్నావ్. డైరెక్షన్ ఎందుకని చాలామంది అన్నారు. ఒకవేళ డైరెక్షన్ చేస్తే, కమర్షియల్ స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోమని సలహా కూడా ఇచ్చారు. మనల్ని ఏది ఎగై్జట్ చేస్తుందో అది చేయడమే మంచిదని నా ఫీలింగ్. అందుకని నా ఇష్టానికి తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నా. ∙ధనార్జనే ధ్యేయం అనుకుని ఉంటే ఈ సినిమాని ఇంకా వల్గర్‌గా తీయొచ్చు. కానీ, దర్శక–నిర్మాతల ప్రధానోద్దేశం అది కాదు. అందుకే కథకు ఏం కావాలో అదే చూపించాలనుకున్నారు. అభిషేక్ నామాకి ఇది మొదటి సినిమా అయినా రాజీపడకుండా నిర్మించారు.
నా మొదటి సినిమా ‘అష్టా చమ్మా’ నిర్మాత రామ్మోహన్‌కు మొదటి సినిమా. ఆ సినిమా సక్సెస్. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్‌కి ఇది మొదటి సినిమా. సెంటిమెంట్‌గా ఆలోచిస్తే.. ఇది కూడా హిట్టే. ∙దర్శకుడిగా నా మూడో సినిమా మంచి థ్రిల్లర్. కొత్త జానర్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ చెప్పాను. చేద్దామన్నారు. నటుడిగా ‘అల్లరి’ నరేశ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నా. అందులో నాది సీబీఐ ఆఫీసర్ పాత్ర. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నా. ‘అమీ తుమీ’ రీలీజ్‌కు సిద్ధమవుతోంది.