ముద్దబంతి పువ్వులు..మూగకళ్ల ఊసులు..ఎనక జనమ బాసలు.. | Special Focus On Mooga Manasulu (ANR) Movie 50 Years Completed | Sakshi
Sakshi News home page

ముద్దబంతి పువ్వులు..మూగకళ్ల ఊసులు..ఎనక జనమ బాసలు..

Published Thu, Jan 30 2014 11:19 PM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

ముద్దబంతి పువ్వులు..మూగకళ్ల ఊసులు..ఎనక జనమ బాసలు.. - Sakshi

ముద్దబంతి పువ్వులు..మూగకళ్ల ఊసులు..ఎనక జనమ బాసలు..

గత జన్మలో మనం ఏంటి? తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. 10, 20 ఏళ్ల క్రితం కాలేజ్ ఏజ్‌లో గాఢాతి గాఢంగా, ప్రాణాతిప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మళ్లీ తారసపడితే ఆ ఫీలింగే వేరు. అలాంటిది గతజన్మలో వలచిన అమ్మాయి తారసపడితే... నిజంగా షాకింగే కదూ! అసలు గత జన్మ బంధాలుంటాయా? ఏమో... కొంతమందిని చూస్తే వాళ్లు మనకు ముందే తెలిసినట్టుగా, బాగా దగ్గరైనట్టుగా... ఒక్క మాటలో చెప్పాలంటే ‘సోల్‌మేట్’లాగా అనిపిస్తుంది. పూర్వజన్మ అనేది ఒకటుంటుందని చాలామంది నమ్ముతారు. దాన్ని బేస్ చేసుకుని ఓ ప్రేమకథ అల్లితే... అదే ‘మూగ మనసులు’. ఇది ముగ్గురు మనుషుల కథ. మూడు జన్మల కథ. ఈ సినిమాతో మనకు ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్టుంది. అందుకే 50 ఏళ్లయినా ఈ సినిమాని మరచిపోలేక పోతున్నాం.
 
 సేలంలో ఓ తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆదుర్తి సుబ్బారావు డెరైక్టర్. మనవాడే. మద్రాసు నుంచి రైటర్ ముళ్లపూడి వెంకట రమణని పిలిపించారు. నా దగ్గరో కథ ఉంది. ఆత్రేయకు రాయమని ఇస్తే ఆరు నెలలు పెట్టుకుని సినిమాకు పనికిరాదని తేల్చేశారు. దీని సంగతొకసారి చూస్తారా?’’ అన్నారు ఆదుర్తి. ఓ పడవవాడు... చదువుకుంటున్న డబ్బున్న యువతి... వీరిద్దరి మధ్యనా ప్రేమ ఉందనే సంగతి వాళ్లకే తెలియదు. సూక్ష్మంగా ఆదుర్తి చెప్పిన ఈ కథ రమణకు నచ్చేసింది. హోటల్‌లో మూడ్రోజులు కూర్చొని కథ, మాటలు, పాటలకు పల్లవులు రెడీ చేశారు. ఫైనల్‌గా మెరుగు పెట్టమని ఆత్రేయకు స్క్రిప్టు ఇచ్చారు ఆదుర్తి. 
 
 ‘‘సుబ్బారావ్... ఇదో గొప్ప కథ. ఈ రమణెవడో బాగా రాశాడు. దాన్ని మార్చి అంతకన్నా బాగా రాయాలనుకుని ఈ నాలుగు రోజులూ తంటాలు పడ్డాను. అందరూ ఆత్రేయ రాసిన డైలాగులు ఫెయిర్ కాపీ చేస్తారు. నేనేమో ఈ రమణ డైలాగుల్ని కాపీ చేశాను’’ అన్నారు ఆత్రేయ చాలా నిజాయతీగా. ఆదుర్తికి ధైర్యం వచ్చేసింది. ఈ కథంటే ఎందుకో తెలీదుగానీ ఆయనకు విపరీతమైన మమకారం. ఎప్పుడో ఎక్కడో చదివిన చిన్న కథ - నిజ జీవితంలో విన్న కొన్ని పునర్జన్మ సంఘటనలు - హిందీ సినిమా ‘మధుమతి’... ఇవన్నీ మిళాయించి ఈ స్టోరీలైన్ అనుకున్నారు. అది ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చింది.
 
 హైదరాబాద్ తాజ్‌మహల్ హోటల్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్. కేవీ మహదేవన్ మ్యూజిక్. ఆత్రేయ 7 పాటలు రాశారు. ‘గోదారి గట్టుంది’ పాటను దాశరథి, ‘గౌరమ్మా... నీ మొగుడెవరమ్మా’ పాటను కొసరాజు రాశారు. అప్పట్లో ఏ షూటింగైనా స్టూడియోల్లో, సెట్స్‌లో జరగాల్సిందే.  ఇదేమో అంతా గోదావరితో ముడిపడిన కథ. గోదావరి సెట్ వేయలేరు కదా! మద్రాసులో సముద్రమే తప్ప, నది లేదు. గోదావరి జిల్లాలకు వెళ్లి తీరాల్సిందే. దాంతో స్టూడియోను దాటి కెమెరా సఖినేటిపల్లి బయలుదేరింది.తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో షూటింగ్. ఏయన్నారూ, సావిత్రి, జమునలాంటి స్టార్లు... ఇంకేముంది... పొలోమంటూ ఒకటే జనం. 
 
 ఆ ఊళ్లో రుద్రరాజువారి కుటుంబం ఫేమస్. మొత్తం ఎనమండుగురు అన్నదమ్ములు. ఒక్కో తారకు ఒక్కో ఇంట్లో బస. ఆతిథ్యం అదుర్స్. టైమ్‌పాస్ కోసం ఖాళీ ప్లేస్‌లో షటిల్ కోర్టు ఏర్పాటు. గోదావరి ఒడ్డున ఓ జమిందారు బంగ్లా కావాలి. ఎక్కడా దొరకలేదు. దాంతో ఆర్ట్ డెరైక్టర్‌తో ముక్తేశ్వరం రేవులో సెట్ వేయించేశారు. ఆ రోజుల్లో 80 శాతం సినిమా అవుడ్డోర్‌లోనే తీయడమంటే మామూలు విషయం కాదు. మిగతా 20 శాతం హైదరాబాద్ సారథీ స్టూడియో, మద్రాసు వాహినీ స్టూడియోలో పూర్తి చేశారు. ధవళేశ్వరంలో ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాట తీశారు. మోటార్ బోట్‌లో ఏయన్నార్, సావిత్రిపై వస్తుందీ పాట. బాగా ఎండ. చెమట వల్ల జారిందో ఏమో కానీ సావిత్రి టపీమని గోదాట్లో పడిపోయింది. యూనిట్ గుండె జారిపోయింది. గజ ఈతగాళ్లు కూడా గజగజ వణుకుతూ సావిత్రిని కాపాడ్డం కోసం దూకేశారు. సావిత్రికి మాత్రం కంగారు లేదు. బ్రహ్మాండమైన స్విమ్మర్ ఆమె. కానీ కట్టుకున్నది చీర కదా, కాళ్లు కదపడం కష్టమైపోయింది. ఈలోగా ఈతగాళ్లు వచ్చి కాపాడేశారు.
 
 ఇక జమునదొక ఎపిసోడ్. ఆమె చేసేది మేకలు తోలుకునే గౌరి పాత్ర. గోదావరి యాసలో మాట్లాడాలి. ఆమెకు అస్సలు అలవాటు లేదు. దాంతో ఆమెకు ఆ యాస నేర్పే బాధ్యతను కె.విశ్వనాథ్‌కి అప్పగించారు. రెండ్రోజులు అదే పని. చిన్నపిల్లలతో ఓనమాలు దిద్దించినట్టుగా నేర్పించారు. మాంచి ఎండలో... రాళ్లూ, రప్పల మధ్య ‘ముక్కుమీద కోపం’ పాట తీస్తున్నారు. ఈ పాటలో జమున, ఏయన్నార్‌కి కాలు అడ్డంపెట్టి కొట్టాలి. ఆ ఎగరడంలో పొరపాటున జమున కాలికి రాయి గుచ్చుకుపోయింది. ఒకటే రక్తం. అయినా బాధ ఓర్చుకునే పాట పూర్తి చేశారు జమున. ‘గోదారి గట్టుంది’ పాటకు కూడా అంతే. జమున సోలో సాంగ్. హీరాలాల్ డాన్స్ డెరైక్టర్. యమా స్ట్రిక్ట్. అనుకున్నట్టు రాకపోతే వంద టేక్‌లైనా తీసుకుంటాడు. గోదావరి ఒడ్డున ఎండల్లో ఇసుకలో ఈ పాట. అదీ చెప్పుల్లేకుండా చేయాలి. 30 టేక్‌లు. ఇసుకలో పరిగెత్తి పరిగెత్తి జమున అరికాళ్లు బొబ్బలెక్కిపోయాయి. ఒకటే ఏడుపు. చివరకు 31వ టేక్ ఓకే అయ్యింది. కె.విశ్వనాథ్ ఈ సినిమాకు సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా కూడా పనిచేశారు.
 
 ఏ ఏ ఏ
  1964 జనవరి 31. మార్నింగ్ షోకే ఫలితం తేలిపోయింది. ‘మూగ మనసులు’ సూపర్‌డూపర్ హిట్. ఈ సినిమాకొచ్చిన ప్రశంసలు, పురస్కారాలకు లెక్కేలేదు. రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఓ కిరీటం. గోపీ పాత్రలో ఏయన్నార్ అదరగొట్టారు. అంత పెద్ద హీరోని పట్టుకుని, సావిత్రి ‘ఏరా... ఏరా’ అంటుంది. ఇప్పుడైతే అలా పిలిపించుకోవడానికి ఏ హీరోనూ ఒప్పుకోరేమో! ఇంకో సీన్‌లో ఏయన్నార్ గుండె మీద జమున కాలుపెట్టి నిలుచుంటే, ఆయనేమో ఆవిడ పాదాలకు పారాణి దిద్దుతుంటాడు. ఎక్కడా ఇగోల్లేవు. అందుకే ఆ సీన్స్ ఇన్నేళ్లయినా బతికే ఉన్నాయి. 
 
 ఇక కళ్లతోనే యాక్ట్ చేయడం సావిత్రికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదేమో. గౌరి పాత్ర జమున కోసమే పుట్టిందా అన్నట్టుగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ‘గౌరమ్మా’ పాటలో ఏయన్నార్‌ని కాసేపు శివుడిగా చూడొచ్చు. ఆయన మళ్లీ ఎప్పుడూ ఈ వేషం వెయ్యనే లేదు. టైటిల్స్‌కి ముందు పూర్వ జన్మస్మృతి గురించి పరిచయ వాక్యాలు చెప్పింది ఎవరో తెలుసా? ఆచార్య ఆత్రేయ. ఆయన వాయిస్ ఓవర్ చెప్పిన ఏకైక సినిమా ఇదే!డెరైక్టర్‌గా ఆదుర్తి గ్రేట్‌నెస్ చెప్పడానికి ఈ ఒక్క సినిమా చాలు. ఎక్కడా ఒక్క వేస్టు సీన్ కనబడదు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇదో భయంకరమైన ట్రాజెడీ సినిమా. దానిని చాలా నేర్పుగా ‘సుఖాంతం’ అనిపించేలా రూపకల్పన చేశారు.
 
 ఏ ఏ ఏ
 ఈ సినిమా ఇన్నేళ్లు బతికిందంటే ప్రధాన కారణం పాటలే. పాటలు లేకుండా ‘మూగ మనసులు’ని కలలో కూడా ఊహించలేం. పాలల్లో పంచదార కలిసిపోయినట్టుగా సంగీత సాహిత్యాలు కలగలసిపోయి మధురాతి మధురంగా అనిపిస్తాయి. మామ సంగీతం మనల్ని అమృతంలో మునకలేయిస్తుంది. పాటల్లో ఎక్కడా డాంబికం కనబడదు.  అర్థం కాని పదమే వినబడదు. మ్యూట్‌లో పెట్టి పాటలు చూస్తున్నా మనం అలా అలా పాడేసుకుంటాం. అంతలా మనలో లీనమై పోయాయా పాటలు. ఆ సాహిత్యం వెనుక సారాన్ని విశ్లేషిస్తే ఓ ఉద్గ్రంథమే తయారవుతుంది!
 ఏ ఏ ఏ 
 ఈ చిత్రాన్ని హిందీలో ‘మిలన్’గా రీమేక్ చేస్తే సెన్సేషనల్ హిట్టయ్యింది. తమిళంలో సావిత్రి సొంతంగా ‘ప్రాప్తం’ పేరుతో రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
 
 
 ‘‘అప్పట్లో నేను వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా పనిచేస్తుండేవాణ్ణి. ఆ సమయంలోనే ఆదుర్తిగారితో సాన్నిహిత్యం ఏర్పడింది. తన దగ్గరకు వచ్చేయమన్నారు. దాంతో నా ఉద్యోగానికి సెలవు పెట్టి చేరాను. మొదట ఈ కథను వేరే నిర్మాతకు చెబితే ఖర్చు ఎక్కువవుతుందని వదిలేశారు. దాంతో ఈయన సి.సుందరంతో కలిసి ఈ సినిమా తీశారు. ఒక ఆర్టిస్టుతో సీన్లు తీస్తున్నపుడు, మరో ఆర్టిస్టుని ఖాళీగా ఉంచడం ఎందుకు అని నన్ను సెకండ్ యూనిట్ డెరైక్టర్‌ని చేసి, కొన్ని సీన్లు తీయించారు. అప్పట్లో ఆదుర్తిగారు వరుసగా ‘మనసులు’ వచ్చే విధంగా టైటిల్స్ పెట్టేవారు. అందుకే దీనికి ‘మూగ మనసులు’ అని ముందే పెట్టేసుకున్నారు. ఏ తరం వాళ్లకైనా ఈ సినిమా నచ్చుతుంది’’.
 - కె.విశ్వనాథ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement