జున్నూవాళ్ల డాడీ | Special story on Hero nani | Sakshi
Sakshi News home page

జున్నూవాళ్ల డాడీ

Published Sun, Feb 24 2019 12:44 AM | Last Updated on Sun, Feb 24 2019 5:36 AM

Special story on Hero nani  - Sakshi

సన్నాఫ్‌ సెలబ్రిటీ అయితేనే అడ్రస్‌ ఉండే సొసౌటీ ఇది! పోలీస్‌ ఆపితే.. 'మా డాడీ ఎవరో తెలుసా' అని అడిగే జనరేషన్‌ ఇది!  కాని..'జున్నూ' అలా కకూడదని  నానీ ప్రేమ పోలీసింగ్‌ చేస్తున్నాడు. వేలు చూపి 'ఇది చెయ్యొద్దు' అనడు. రేప్పొద్దున ఎవరు తన కొడుకు వైపు వేలెత్తి చూపకుండా ఇప్పుడే అన్నీ నేర్పిస్తున్నాడు. పిల్లలకు తండ్రి హీరో అవ్వాలంటే మురపాలే సరిపోవు మరి.

మీ బర్త్‌డే 24న. రీసెంట్‌గా 24వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అది కూడా ‘24’ అనే సినిమా తీసిన డైరెక్టర్‌ విక్రమ్‌ కె. కుమార్‌తో. 24 అంకెకు మీ జీవితంలో ఏదైనా స్పెషాలిటీ ఉందా?
ఉందనుకుంటాను. కానీ దానికి లాజికల్‌ వివరణ ఇవ్వలేను. చిన్నప్పటి నుంచి 24తో చాలా కనెక్షన్‌ ఉంది. ట్రైన్‌ టికెట్, ఫ్లైట్‌ టికెట్‌ అనుకోకుండా 24వ సీట్‌ రావడం, ఇల్లు కొనుక్కుంటే అది ఫ్లాట్‌ నం. 24 అవ్వడం... ఇలా అనుకోకుండా కుదురుతుంటాయి. ఇక నేను పని చేస్తున్నది 24 శాఖలున్న ఇండస్ట్రీలో. సెకన్‌కు 24 ఫ్రేమ్‌లు ఉంటాయి. నా బర్త్‌డే 24. హీరోగా నా కెరీర్‌ స్టార్ట్‌ అయింది 24ఏళ్లకు. విచిత్రంగా అనిపిస్తుంటుంది. అది యాదృచ్ఛికమో దానికేమైనా కనెక్షన్‌ ఉందో నాకు తెలియదు. సరే ఇన్ని కనెక్షన్‌లు ఉన్నాయి కదా అని నా కారు నెంబర్లు కూడా 24 అని పెట్టించుకున్నాను (నవ్వుతూ). లక్కీ అని కాదు. 24తో ఓ చిన్న ఎమోషన్‌ ఏర్పడింది. 

ఈ బర్త్‌డే విశేషాలు ఏమైనా?
బేసిక్‌గా బర్త్‌డే అంటే భయం. ఆ ఒక్క రోజు మాత్రం మన క్యాలెండర్‌ నుంచి స్కిప్‌ అయిపోతే బావుండు అనిపిస్తుంటుంది. ఒకలాంటి ప్రెషర్‌ ఫీల్‌ అవుతుంటాను. చిన్నప్పుడు బర్త్‌డే అంటే స్కూల్‌లో మనం చాలా స్పెషల్‌. క్లాస్‌లో ఎక్కువగా మాట్లాడని క్లాస్‌మేట్స్‌ కూడా వచ్చి మనకు విషెస్‌ చెబుతారు. యాక్టర్‌ అయ్యాక మనం వద్దనుకున్నా అటెన్షన్‌ ఉంటుంది. దాంతో ప్రైవేట్‌ టైమ్‌ కోసం వెతుకుతూ ఉంటాం. బర్త్‌డే రోజు లెక్కపెట్టలేనంత మంది విష్‌ చేస్తుంటారు. వాళ్లందరికీ రిప్లయ్‌ ఇవ్వాలనుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా కుదరదు. అదో ప్రెషర్‌. అంత టైమ్‌ కూడా ఉండదు. ఫ్రెండ్స్‌ కలవాలనుకుంటారు, ఫ్యామిలీ మనతో టైమ్‌ స్పెండ్‌ చేయాలనుకుంటారు. సినిమా షూటింగ్‌ ఉంటే వెళ్లిపోవాలి. అందుకే బర్త్‌డే డేట్‌ వరకు స్కిప్‌ అయి నెక్ట్స్‌ డేట్‌కి వెళ్లిపోతే బావుండు (నవ్వుతూ).

 గుర్తుండిపోయిన బర్త్‌డే ఏదైనా ఉందా?
చిన్నప్పటి బర్త్‌డేల్లో ఓ అమాయకత్వం ఉండేది. ఏం చాక్లెట్‌లు కొనాలి? మన క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు రెండు మూడు ఇచ్చి మిగతావాళ్లను ఒకటే తీసుకోమనడం... ఆ క్యూట్‌నెస్, ఇన్నోసెన్స్‌ ఇప్పుడు ఉండవు కదా. చిన్నప్పుడు సెలబ్రేట్‌ చేసుకున్న బర్త్‌డేలన్నీ గుర్తుండిపోయినవే. నా చిన్నప్పటి ఫొటోలన్నీ నా పుట్టినరోజుకు దిగినవే. అది కూడా సరోజ్‌ అనే ఫోటో స్టూడియోలో. నా ఆల్బమ్‌ తీస్తే ఫస్ట్‌ వచ్చే పది ఫొటోలు పది సంవత్సరాల బర్త్‌డేలవే. ప్రతి ఫొటో వెనుక ‘సరోజ్‌ ఫొటో స్టూడియో ఫిబ్రవరి 24’ అని కామన్‌గా ఉంటుంది. నా ఫొటోలన్నింటికీ ఒకటే బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటుంది. వెనకాల కర్టెన్‌ అలానే ఉంటుంది. ఫ్లవర్‌వాజ్‌ బొమ్మ సైజ్‌ అలానే ఉంటుంది. నా సైజ్‌ మారుతుంది. నేను పెద్దగా అవుతూ వచ్చాను. ఇప్పుడు అలా ఫొటోలు దిగడం మిస్‌ అవుతున్నాను. అమ్మ పొద్దునే లేపి నలుగు పెట్టి, తల స్నానం చేయించి ఫొటో తీయించడానికి రైల్వే ట్రాక్‌ దాటించి తీసుకెళ్లేది. అదో స్పెషల్‌ మెమొరీ.

 ఇంతకీ ఈ బర్త్‌డేకు ఇంట్లోనే ఉంటున్నారా?
ఉంటున్నాను. ఉండకపోతే అదో ప్రాబ్లమ్‌. నాకు ఏదైనా పని ఉండి ఊరెళ్తే పని అయ్యాక తిరిగొస్తా. కానీ బర్త్‌డే ఉంటే పనిమధ్యలో తిరిగి రావాలి.  ఇంట్లో లేకపోతే బాగోదు కదా. 

 మీ భార్య అంజన ఏమైనా గొడవ చేస్తారా?
అలాంటిదేం లేదు.. బర్త్‌డే వస్తుంది. స్కిప్‌ అయిపోతే బావుండు అని తనతో అంటుంటా. అయితే ఇంట్లోవాళ్లతో ఉండాలని వాళ్లు కోరుకుంటారు... నాకూ ఉండాలని ఉంటుంది కదా.

 మీ జున్ను (నాని తనయుడి ముద్దు పేరు) మీ జీవితంలోకి వచ్చాక మీకిది రెండో బర్త్‌డే. మీ అబ్బాయి ఫస్ట్‌ బర్త్‌డే ఎలా సెలబ్రేట్‌ చేశారు?
లాస్ట్‌ ఇయర్‌ మార్చిలో జున్నూది ఫస్ట్‌ బర్త్‌డే. ఫస్ట్‌ బర్త్‌డే గ్రాండ్‌గా చేస్తున్నారా? అని కొంతమంది అడిగారు. వాడికి అర్థం కాని వయసులో వాడి ఫంక్షన్‌ చేసి ఉపయోగమేంటి? అనుకున్నాను. మా ఇంట్లోనే స్పెండ్‌ చేశాం. ఈ ఇయర్‌ కూడా అలానే  జరుపుకుంటాం. బర్త్‌డేఫంక్షన్స్‌ అన్నీ మన ఫ్రెండ్స్‌ని కలుసుకోవడానికి సెలబ్రేట్‌ చేసుకుంటాం. మన ఆనందం, గొప్ప చూపించుకోవడం కోసం బర్త్‌డేలు సెలబ్రేట్‌ చేసుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే బర్త్‌డే అంటే మనవాళ్లతో టైమ్‌ స్పెండ్‌ చేయడమే. 


 ఈ బర్త్‌డేకి కొత్త బట్టలు కొనుక్కున్నారా? 
చిన్నప్పుడు మోస్ట్‌ ఎగై్జటింగ్‌ వాటిలో కొత్త బట్టలు కొనుక్కోవడం. ఇప్పుడు కొత్త బట్టలు సందర్భానికి సంబంధం లేకుండా కొనుక్కుంటున్నాం, కొన్న వెంటనే వేసుకుంటున్నాం.  నటులకు షూటింగ్‌లో రోజూ కొత్త బట్టలే కదా (నవ్వుతూ). ఆ ఎగై్జటింగ్‌ విషయం ఇప్పుడు నార్మల్‌ అయిపోయింది. 

కెరీర్‌వైజ్‌గా గతేడాది స్పీడ్‌ కొంచెం తగ్గించారు... 
కృష్ణార్జున యుద్ధం, దేవదాస్‌... రెండు సినిమాలే చేశాను. ‘బిగ్‌ బాస్‌’ షో వల్ల ఇంకోటి మిస్‌ అయింది. ఈ ఏడాది మూడు సినిమాలు వస్తాయి. 

మీ మొదటి సినిమా (అష్టా చెమ్మా) ఇంద్రగంటి మోహనకృష్ణతో చేశారు. 25వ సినిమా కూడా ఆయనతోనే చేయబోతున్నారు. ఇందులో విలన్‌గా కనిపిస్తారట?
డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నాను. ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయని పాత్ర అది. ఇది మల్టీస్టారర్‌ కాదు. మోహనకృష్ణగారు ఓ హీరో (సుధీర్‌బాబు)తో సినిమా చేస్తున్నారు. అందులో నేనో చిన్న పాత్ర పోషిస్తున్నాను. అంతే. కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు నేనేం చెప్పినా లాజికల్‌గా ఉండదు. త్వరలోనే అనౌన్స్‌ చేస్తాం. 

సబ్జెక్ట్‌లు ఎంచుకోవడంలో నాని రూట్‌ మార్చాడని కొందరు అంటున్నారు.. 
లేదు. అయితే నేను రూట్‌ మార్చానని చాలామంది అనుకుంటున్నారు. రెండు రొటీన్‌ ఫిల్మ్స్‌ చేసి నాని కొత్త రూట్‌ వెతుకుంటున్నాడు, కొత్త రోల్స్‌ చేయబోతున్నాడు అని. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అవన్నీ బయటివాళ్ల అనాలసిస్‌లు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, పైసా, జెండా పై కపిరాజు, జెంటిల్‌మేన్‌’ లాంటి ఇంట్రెస్టింగ్‌ ఐడియాలు చేశాం కదా .. మనం కమర్షియల్‌ మీటర్‌కు సెట్‌ అవుతామా? లేదా? అని ‘నేను లోకల్, యంసీఏ’ సినిమాలు చేశాను. రొటీన్‌ సినిమాలు అన్నారు. అన్నవాళ్లకు రొటీన్‌ కానీ నాకు కాదు. అవి చేశాను కదా అని మళ్లీ ఇటు సైడ్‌ వస్తున్నాను. యాక్టర్‌గా అన్నీ చేయాలి. అదే చేస్తూ వస్తున్నాను. చూసే విధానం బట్టి ఎవరికి వారు ఒక ఒపీనియన్‌ ఏర్పరుచుకుంటారు. నాని ఇటు వెళ్లాడు, అటు వచ్చాడు అని. ఇది సైకిల్‌. భవిష్యతుల్లో ‘ఎంసీఏ, నేను లోకల్‌’ లాంటివి చేయనని చెప్పడం లేదు. మళ్లీ వేరే రూట్‌లోకి వచ్చి చేస్తా.

నాని ఏ పాత్ర అయినా బాగా చేయగలడు అనే కాంప్లిమెంట్‌ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది?
చాలా మంది అనుకుంటారు.. నాని బాగా చేశాడు అని. కాదు.. స్క్రిప్ట్‌లో విషయం ఉండాలి.  బాగా చేయడం, చేయకపోవడం ఉండదు. స్క్రిప్ట్‌లో స్కోప్‌ ఉండటం, ఉండకపోవడమే తేడా. 

హిట్, ఫ్లాప్‌ మీతో ఎన్నిరోజులు ట్రావెల్‌ అవుతాయి? 
అవి నాకు పెద్ద విషయం కాదు. నేను ఇంపార్టెంట్‌గా ఫీల్‌ అయ్యేది ఏంటంటే టీమ్‌ అంతా కష్టపడి సినిమా చేస్తుంటాం. దానికి తగ్గ క్రెడిట్‌ రాకపోతే కొంచెం బాధగా ఉంటుంది. వాళ్లంతా బాధపడతారు అనే బాధ తప్పితే నా కెరీర్‌ ఏమైపోతుంది... అనే ఆలోచన ఉండదు. సక్సెస్, ఫ్లాప్‌ బాధపెట్టవు. ఇది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అనుకోవచ్చు. జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకులతో నాకు ఓ కనెక్షన్‌ వచ్చేసింది అనే నమ్మకం ఏర్పడింది. 

‘నా కెరీర్‌ ఏమైపోతుంది’ అనే ఆలోచన లేదన్నారు.. ఆ మాటల్లోనే ఏమీ కాదనే మీ ఆత్మవిశ్వాసం కనపడుతోంది. ఇది ఎప్పుడు డెవలప్‌ అయింది? 
ఎప్పుడు కుదిరిందో తెలియదు కానీ కుదిరింది. కొన్ని నెలలు కలసి టీమ్‌ అందరం కష్టపడతాం. పని చేసినవాళ్లు ఎప్పుడు తలుచుకున్నా వాళ్లకు ఆ సినిమా ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోకూడదు. ఎవరూ నష్టపోకూడదని కోరుకుంటాను. అందుకోసం సక్సెస్‌ అవసరం అయితే ఆ సక్సెస్‌ నాకు కావాలి. అయితే నేను ఏరోజూ సినిమా సక్సెస్‌ అవ్వాలి అని చేయలేదు. ఎంజాయ్‌ చేస్తూ చేశాను. నా పనిని ఎంజాయ్‌ చేస్తున్నంత వరకూ నాకు పని ఉంటుంది. జెన్యూన్‌గా కష్టపడితే వర్క్‌ మనల్ని ఫాలో అవుతుంటుందని నమ్ముతాను. సక్సెస్‌ అవ్వాలి, సెటిల్‌ అవ్వాలి అని మొక్కుబడిగా చేస్తే అది కూడా మనల్ని వదిలేస్తుంది. దానివెనకాల మనం పరిగెత్తనప్పుడు అది మనపక్కనే బుద్ధిగా కూర్చుని ఉంటుందని నా ఫీలింగ్‌.

మీ వయసుకన్నా ఎక్కువ వయసున్న పాత్రలు కూడా చేస్తున్నారు?
‘జెర్సీ’లో నా వయసుకు మించిన పాత్ర చేశాను. ఇది నేను గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఇప్పటి వరకూ ఏ సినిమాకీ ఈ స్టేట్‌మెంట్‌ వాడలేదు. ‘జెర్సీ’ నా కెరీర్‌లో బెస్ట్‌ అవుతుంది. 

ఇంత పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు? అంత కాన్ఫిడెన్స్‌ ఏంటి?
రిజల్ట్‌ గురించి చెబుతున్న స్టేట్‌మెంట్‌ కాదిది. యాక్టర్‌గా పూర్తి సంతృప్తి ఇచ్చింది. నటుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత ‘ఇంకా ఏదో చేస్తే బావుండు’ అనే ఓ ఫీలింగ్‌ ఉంటుంది కదా.. అది లేదు ఈ సినిమా చూసిన తర్వాత. అందుకే నా బెస్ట్‌ వర్క్‌ అంటాను. ఈరోజు వరకూ ఇది బెస్ట్‌ అన్నాను. దాని అర్థం దీన్ని మించే సినిమాలు రావని కాదు. ఇప్పటివరకూ నా కెరీర్‌లో ఇది బెస్ట్‌. ఇదివరకూ మంచి సినిమాలు చేశా. అవి చేసినప్పుడు హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. అయితే ఆ సినిమాల్లో ఆ పాత్రగా మారిపోయినప్పటికీ ఎక్కడో చోట నాని అనేవాడు కనపడి ఉంటాడు. ఆర్టిస్ట్‌గా పూర్తి స్థాయి పాత్రగా మారిపోయే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా చేసినప్పుడు అనిపించలేదు కానీ చూసుకున్నప్పుడు ‘నేను’ అనే ఫీలింగ్‌ నాకు రాలేదు. అర్జున్‌ అనే వ్యక్తి కథను చూస్తారు. వాడితోపాటూ ఏడ్చాను, నవ్వాను. రేపు థియేటర్స్‌లోకి వచ్చినప్పుడు అది ఎంతవరకూ నిజం అన్నది మాత్రం మీరే చెప్పాలి. యాక్టర్‌గా నాకు లభించిన సంతృప్తి వర్ణించలేనిది. 

 అర్జున్‌ అంటే మీ అబ్బాయి పేరు. కావాలనే సినిమాలో పెట్టారా? 
అవును. సినిమాలో నా పేరు అర్జున్‌. మా అబ్బాయి పేరు నాని. రివర్స్‌ చేశాను (నవ్వుతూ). 

ఇంతకుముందు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో మీ భార్య అంజన ఇంటి పేరు వాడారు. కావాలని మీరు చెబుతుంటారా? 
ఆ సినిమాలో హీరోయిన్‌ సమంత పేరు నిత్యా. ఆ పాత్రకు ఓ ఇంటిపేరు కావాలని గౌతమ్‌ మీనన్‌ అడిగారు. అప్పుడు నేను అంజనతో రిలేషన్‌లో ఉన్నాను. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అయ్యాం. తన ఇంటిపేరు (యలవర్తి)ని హీరోయిన్‌ ఇంటిపేరుగా సజెస్ట్‌ చేస్తే, గౌతమ్‌ బాగుందన్నారు. ఆ తర్వాత ‘మజ్ను’లో ‘రాంబాబు గారి అబ్బాయా మజాకా’ అని ఓ డైలాగ్‌ చెప్పాను. నిజానికి ఆ సీన్‌లో ఆ డైలాగ్‌ లేదు, నేనే కావాలని సరదాగా చెప్పాను. బాగుందని ఉంచేశారు. అది మా నాన్నగారి పేరు. ఏదో సరదాకి ఇలాంటివి చేస్తుంటాను కానీ ఇవే ఉండాలని ఒత్తిడి చేయను.

ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా మీ స్థానం మీదే. అదెలా వీలవుతుంది? 
ఎందుకంటే నేను రేస్‌లో లేను కాబట్టి. అందరూ పరిగెడుతున్న డైరెక్షన్‌లో నేను పరిగెడితే నేను రేస్‌లో ఉన్నట్టు. నా స్థానానికి డేంజర్‌. అందరూ వెళ్తున్న గమ్యం వైపు నేను వెళ్లడం లేదు. సో.. నన్ను దాటేస్తారు, నన్ను గెలిచేస్తారు అని భయపడను. నాకు డేంజర్‌ ఉందని అనుకోను. అందరూ సూపర్‌ స్టార్‌లు అవుదాం అని వెళ్తున్నారు కానీ నేను వెళ్తున్న మార్గంలో ఎవ్వరూ రావడం లేదని నేను అనుకుంటున్నాను. వాళ్లను డిస్ట్రబ్‌ చేసి నా దారిలో కూడా వచ్చేలా చేసుకోవడం లేదు (నవ్వుతూ).

అంటే మీరు సూపర్‌స్టార్‌ అవ్వాలనుకోవడం లేదా? 
నేనెప్పుడూ యాక్టర్‌గానే ఉండాలి అనుకున్నాను. మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోండి. న్యాచురల్‌ స్టార్‌ అదీ ఇదీ అనుకోవచ్చు. ప్రేమతో పిలుస్తున్నారు అని అనుకుంటాను. ఇందాక యాక్టర్‌గా బాగా సంతృప్తి చెందాను అని చెప్పాను కదా. దాని ముందు ఏ సూపర్‌స్టార్‌ ఫీలింగ్‌లూ దగ్గరకు రాలేవు. యాక్టర్‌ అనేవాళ్లకు దాన్ని మించిన సంతృప్తి ఉండదు. అదే ఉంటున్నప్పుడు ఇక దేనికోసం పరిగెత్తాలి. 

గేమ్‌ ఆడేటప్పుడు పోటీ లేకపోతే కిక్‌ ఉండదు కదా?
నేను గేమ్‌  ఆడటం లేదు. ఒకరి మీద గెలవడానికి పోటీ అయితే అప్పుడు పోటీ కావాలి. నేనెవరి మీదా గెలవాలనుకోవడం లేదు. నాకు పిచ్చిగా నచ్చే ఓ పని చేస్తున్నాను. పొద్దున లేస్తే ఫుడ్‌ ఫర్‌ సోల్‌ అంటాం కదా.. ఆత్మసంతృప్తి కోసం పని చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌ని ఆస్వాదించాలి అనుకుంటున్నాను. చేసిన ప్రతి షాట్‌  బావుంటే నాకు కిక్‌ వస్తుంది. అందులో కిక్‌ వెతుక్కుంటున్నాను కానీ పోటీలోకాదు. 

నటుడిగా సంతృప్తి ఇచ్చిన సినిమా బాగా ఆడలేదనుకోండి.. ఆ ఫ్లాప్‌ ఎఫెక్ట్‌ మీ కెరీర్‌ మీద ఎంత ఉంటుంది?
బాక్సాఫీస్‌ నంబర్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ఓ భారీకథ మన దగ్గరకు వచ్చిందనుకోండి. దానికి పెద్ద బడ్జెట్‌ కావాలి. అంత బడ్జెట్‌ పెట్టాలంటే నా అంతకుముందు సినిమా బాక్సాఫీస్‌ నంబర్‌ బాగుండాలి. అప్పుడు ఆ భారీ కథను అడ్జెస్ట్‌ కాకుండా తీయొచ్చు. లేకపోతే రాజీపడిపోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాక్సాఫీస్‌ నంబర్‌ని పట్టించుకోవాలి. డబ్బులు వస్తే బాగా ఆనందపడతాను. మా నిర్మాత, టీమ్‌ హ్యాపీగా ఉంటారు. వాళ్లంతా హ్యాపీ అయితే నేను హ్యాపీ. 

నాని నిర్మాతల హీరో అంటారు. ఒకవేళ చేసిన నిర్మాతకే మళ్లీ డేట్స్‌ ఇవ్వకపోతే ‘నానీకి బిల్డప్‌’ అంటారు. రెంటినీ ఎలా తీసుకుంటారు?
కరెక్టే. నేను డేట్స్‌ ఇచ్చినప్పుడు నాని మనోడే అనుకునే చాన్స్‌ ఎక్కువ. అయితే నాని మనోడే కదా.. సినిమా చేస్తాడు అని ప్రతిసారీ అనుకుంటే కుదరకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. నాకు కథ ముఖ్యం. మంచి కథ కుదిరితేనే సినిమా. రెండు హిట్స్‌ కొట్టాం అని అదే కాంబినేషన్‌లో మూడోసారి సినిమా చేసేయాలి అనుకోను. మూడో సినిమా కథ కూడా కుదరాలి. బావుండాలి. ఇలా ఆలోచించడం నటుడిగా నాకు చాలా అవసరం. కెరీర్‌ స్టార్టింగ్‌లో మొహమాటానికి కొన్ని చేశాను. ఇప్పుడు నచ్చిందే చేస్తున్నాను. 

ఒకవేళ మీకు బాగా అనిపించని కథ సక్సెస్‌ అయ్యే అవకాశం ఉంది కదా?
అది కాదనడంలేదు. అయితే నాకు డౌట్‌ ఉన్న కథతో సినిమాకి ఓకే చెబితే షూటింగ్‌ జరిగే నెక్ట్స్‌ ఆరు నెలలు డౌట్‌తో పడుకోవాలి, డౌట్‌తో నిద్రలేవాలి. నమ్మకంగా ఉన్న స్క్రిప్ట్‌తో చేస్తే ఏదో కొత్త ఉత్సాహంతో పని చేస్తాను. ఎగై్జటింగ్‌గా నిద్రలేస్తాను. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేదు. డౌట్‌ ఉన్న సినిమాలు కూడా హిట్‌ అవుతుంటాయి. నమ్మకంగా ఉన్న సినిమాలు పోతాయి. రిజల్ట్‌ రెండే రోజులు, అయితే షూటింగ్‌ ప్రాసెస్‌ మాత్రం దాదాపు 9 నెలలు. తొమ్మిదినెలలు ఇంపార్టెంటా? రెండు రోజులు ఇంపార్టెంటా?  

ఓకే.. పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పు? పెళ్లయ్యాక జీవితం నా చేతుల్లో లేదు, నా భార్య చేతుల్లో ఉందని చాలామంది అంటుంటారు... 
జీవితం వాళ్ల చేతుల్లోకి వెళ్లదు, మనమే పెడతాం. మనమే సరెండర్‌ అవుతాం. వాళ్లు లాక్కోవడం ఉండదు. అందరూ ఎలా మాట్లాడతారంటే నాకు స్వాతంత్య్రం లేదు అని జోకులేస్తారు. కానీ స్వేచ్ఛ కోల్పోయే విషయంలో ఒక్క శాతం కూడా వాళ్లు కారణం అవ్వరు.  పని అయిపోయిందా? ఇంటికొస్తున్నావా? అని వాళ్లు ఫోన్‌ చేసినా చేయకపోయినా మనకే వెళ్లాలనిపిస్తుంది. అది రెస్పాన్సిబుల్‌గా ఫీల్‌ అవుతాం. నిజం చెప్పాలంటే పెళ్లి పెద్దగా ఏం మార్చలేదు నన్ను. పిల్లోడు మార్చాడు. చాలా మార్చాడు. పెళ్లి ఓవర్‌ రేటెడ్‌. కంట్రోల్‌ అదీ ఇదీ అంటాం కానీ.  కంట్రోల్‌లో ఉండేది మాత్రం పిల్లల తర్వాతే. పెళ్లయ్యాక మూడేళ్లకు మా జున్ను పుట్టాడు. వీడొచ్చాక లైఫ్‌ని చూసే కోణమే మారిపోయింది. పొరపాటున ఏపని చేసినా ఒక ఎగ్జాంపుల్‌ అవుతాం. పొరపాటున పేపర్‌ పక్కన విసిరేసినా, వాడూ అదే నేర్చుకుంటాడని భయం. డస్ట్‌బిన్‌లో వేస్తున్నాను. నోట్లోంచి వచ్చే మాటలన్నీ మంచివే అయ్యుండాలి. ఆ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లోడికి రాంగ్‌ ఎగ్జాంపుల్‌ ఇవ్వకూడదు. ప్రపంచం దృష్టిలో హీరో అవడంకన్నా కొడుకు దృష్టిలో హీరో అవడానికి మించింది మరోటి లేదనుకుంటాను. సినిమా హీరో కాదు మా నాన్న రియల్‌ లైఫ్‌ హీరో అని పిల్లలు అనుకుంటే అది ప్రతి తండ్రికి పెద్ద సంతృప్తి. ‘జెర్సీ’ సినిమా ఆ పాయింట్‌ మాట్లాడుతుంది. 

 మీ జున్నూ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు?
నాన్న అంటాడు. ఇప్పుడు అదొక్క మాటే వచ్చు. పొద్దున్నుంచి నాన్న నాన్న అంటాడు. అమ్మ కూడా రాదు. నాన్నకూచి. నేను షూటింగ్‌లో ఉండి వీడియో కాల్‌ చేస్తే దిండు చూపిస్తాడు. నేను పక్కనే ఉండాలని అర్థం అన్నమాట. మేమిద్దరం ఉంటే అల్లరి మామూలుగా ఉండదు. మామూలుగా కొందరు పిల్లలు పదిమంది వస్తే ముడుచుకుపోతారు. జున్నుగాడు మాత్రం ఎంతమంది వస్తే అంత యాక్టివ్‌ అవుతాడు. ఎంటర్‌టైనర్‌. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్తాడు. నేనైనా డబ్బులు తీసుకొని ఎంటర్‌టైన్‌ చేస్తానేమో, వాడు ఫ్రీగా ఎంటర్‌టైన్‌ చేస్తాడు (నవ్వుతూ). 

24 గంటలే ఎందుకు.. ఇంకొన్ని గంటలుంటే బావుండే అని ఎప్పుడైనా అనుకున్నారా? 
అలా ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒకడినే ఉన్నానే నాలా ఇంకొకడుంటే బావుండే అనుకుంటాను. ఒక్కసారి కాదు చాలాసార్లు అనిపించింది. ఒకచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇంకోచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండూ మిస్సవ్వలేం. ఫ్యామిలీ అందరూ కలసి ఏదో స్పెషల్‌ ప్లాన్‌ ఫిక్స్‌ చేసుకొని ఉంటాం. వర్క్‌ కూడా మిస్‌ అవలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నాలోనే ఇద్దరుంటే నువ్వు ఈ పని చూసుకో, నేను ఇంకో పని చూసుకుంటాను అని సర్దుకోవచ్చు కదా. ఇలా ఊహించుకుని నవ్వుకుంటాను.

ఒకప్పుడు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేశారు కదా... యాక్టింగ్‌ టు డైరెక్షన్‌ ఎప్పుడు?
డైరెక్షన్‌ ఏమో కానీ ప్రొడక్షన్‌ సైడ్‌ ఉంటాను. ఓన్లీ కొత్త రకం సినిమాలే నిర్మించాలనుకుంటున్నాను. ‘అ!’ తర్వాత చాలా కథలు విన్నాను. సూపర్‌ హిట్‌ ప్రాజెక్ట్స్‌. నిర్మిస్తే డబ్బులొచ్చేస్తాయి. కానీ చేయలేదు. ఎందుకంటే నా బ్యానర్‌ మీద యూనిక్‌ సినిమాలు మాత్రమే చేయాలని.

‘అ!’ కమర్షియల్‌గా వర్కౌట్‌ అయిందా?
అయింది. అలాగే పాత్‌ బ్రేకింగ్‌గా నిలిచింది. వాల్‌పోస్టర్‌ సినిమా నుంచి ఏ సినిమా వచ్చినా అలా యూనిక్‌గా ఉండాలన్నది నా ఆలోచన.

24 సినిమాల అనుభవం ఉంది మీకిప్పుడు. మీ పదేళ్ల కెరీర్‌ని ఎప్పటికప్పుడు యాక్టర్‌గా మనం ఏంటి అని సమీక్షించుకుంటారా?  
సమీక్షించుకోవడం అన్నట్టుగా కాదు కాని పాతజ్ఞాపకాల్ని విజిట్‌ చేస్తుంటాను. పాత సినిమాలు చూసినప్పుడు ‘అరే.. అప్పుడు మన పర్ఫార్మెన్స్‌ ఏంటి, ఇలా ఉంది?’ అనే యాంగిల్‌లో మాత్రమే ఆలోచిస్తా. నటుడిగా ఇంత పరణితి చెందా అది ఇదీ అని ఆలోచించుకోను.   

 ఫైనల్లీ.. యాక్టర్‌గా ఇన్ని సినిమాలు చేయాలి అని టార్గెట్‌ ఏమైనా?
నెక్స్‌ సినిమా గురించే ఆలోచించను. ఇంకా యాక్టర్‌గా ఎన్ని చేస్తాను అంటే ఇందాక ‘నచ్చిన కథలే చేస్తాను’ అని మాట్లాడిన ఐడియాలజీకి విరుద్ధం అయిపోతుంది.
– డి.జి.భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement