
చెరిసగం అన్నారు పెద్దలు.నువ్వో సగం నేనో సగం అన్నాడు ఆత్రేయ.ఫిఫ్టీ పర్సెంట్ అడగడం న్యాయం.కాని పూర్తిగా కావాల్సిందే అని పట్టుబడితే భర్త తనకు తాను ఏం మిగులుతాడు... గుండు సున్నా.భర్త ఆఫీసరై ఉంటాడు. భార్యకు ఇన్‌సెక్యూరిటీ. అందంగా ఉంటాడు. భార్యకు ఇన్‌సెక్యూరిటీ. మంచి మాటకారి. ఇన్‌సెక్యూరిటీ. ఫేమ్ ఉంది. ఇన్‌సెక్యూరిటీ. హోదా.. అంతస్తు...అన్నింటికీ ఇన్‌సెక్యూరిటే.కాని భర్తలందరికీ ఇదే పనా? వేరొక స్త్రీ కోసం వేచి చూడటమే వాళ్ల పనా. వేరొక స్త్రీని వెతకడమే వారి పనా? ఆఫీసుకెళ్లి పని చేసుకోవాలనుకునేవారు, ఎంచుకున్న రంగంలోరాణించాలని కష్టపడేవాళ్లు, ఎంత ఎత్తుకు ఎదిగినా భార్యా పిల్లలు కుటుంబమూ ముఖ్యం అనుకునేవారు ఉండరా?ఉంటారు... కాని వాళ్లను వల్లో వేసుకునేవారు కూడా ఉంటారు అంటుంది ఈ సినిమాలో గీత.ఆమె మంచి అందగత్తె. డబ్బున్నవాళ్ల అమ్మాయి. ఫేమస్ సినీ గాయకుడైన రహెమాన్ భార్య. ఆమెకు భర్త అంటే ఇష్టం. చాలా ప్రేమ. ఎంత ప్రేమంటే అతడి ప్యాంటూ షర్టులా అతణ్ణి ఇరవైనాలుగ్గంటలూ అంటి పెట్టుకోవాలనుకునేంత. ఎక్కడికీ వెళ్లనివ్వదు. ఎవ్వరితో మాట్లాడనివ్వదు. ఎవరినీ కలవనివ్వదు. ముఖ్యంగా ఆడవాళ్ల పక్కన కూర్చున్నా నచ్చదు.తను హ్యాండిల్ చేయలేని పెన్నిధి ఏదో తన దగ్గర ఉంది అని సతమతమైపోతూ ఉంటుంది ఆమె.రహెమాన్‌కు భార్య అంటే అభిమానమే. ఆమె ప్రవర్తన విసుగ్గా ఉన్నా అతడికి మరో స్త్రీ పట్ల ఆసక్తి లేదు. పాటలు, ఇల్లు ఇవే అతని ప్రపంచం. కాని భార్య అతణ్ణి నమ్మదు. కాదు కాదు.. లోకాన్ని నమ్మదు. వల వేసే ఎర వేసే లోకం అంటే ఆమెకు భయం.
అంత మాత్రం చేత ఊపిరి ఆడనివ్వకుండా చేయొచ్చా?ఈ వ్యవస్థలో కొన్ని సెటిల్ అయి ఉన్నాయి. మగాడు సాయంత్రం షికార్లు కొట్టాలి. ఫ్రెండ్స్‌తో తిరగాలి. అడపా దడపా పార్టీలు చేసుకోవాలి. రిలాక్స్‌కావాలి. ఆ మేరకు భార్య అతడిని వదిలిపెట్టాలి. ఆడది తీరిక ఉన్నప్పుడు పక్కింటి పిన్ని దగ్గరకు వెళ్లాలి. ఏవో వ్రతాలు నోములు చేసుకోవాలి. నలుగురితో కలిసి షాపింగ్‌కు వెళ్లాలి. బ్యూటీ పార్లల్‌కు వెళ్లాలి.పుట్టింటివాళ్లతో ఫోన్లు మాట్లాడుకోవాలి. ఇల్లు బోరు కొడుతుందని ఉద్యోగం చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. ఆ మేరకు భర్త ఆమెను వదిలిపెట్టాలి.భార్య అలా వదిలిపెట్టకపోయినా భర్త ఇలా విడువకపోయినా గొడవలు వస్తాయి.ఈ సినిమాలో కూడా గొడవ అదే.నా స్పేస్‌ను నాకు వదిలిపెట్టు అంటాడు భర్త. భార్య వినదు. అతడి కచేరీలకి, పార్టీలకి, ఆఖరకు ఫ్రెండ్స్ ఇళ్లకు వెళితే అక్కడకూ తయారవుతూ ఉంటుంది. చివరకు ఒక దశలో ‘నువ్వు నలుగురి కళ్లల్లో పడటం నాకు ఇష్టం లేదు పాడటం మానెయ్’ అని అల్టిమేటం జారీ చేస్తుంది.అతడు పుట్టిందే పాడటానికి.పాడటం మానేయమంటే?ఇక విసిగిపోతాడు. చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోతాడు.గతంలో ఇలాంటి మగవాళ్లు సన్యాసుల్లో కలిసేవాళ్లని అంటారు.రహెమాన్ మాత్రం గోవా బస్సెక్కుతాడు. విముక్తి కోరుకునేవారు, స్వేచ్ఛను ఆశించేవారు వెళ్లేది అక్కడికే కదా.
ఒక తోడు వదిలిపెడితే ఇంకో జోడి ఉండనే ఉంటుంది లోకంలో.అదే బస్‌లో ఇంటి నుంచి పారిపోయిన సితార ఎక్కుతుంది. ఆమెది రెగ్యులర్ కథే. దుర్మార్గుడైన మొగుడు. డబ్బు కోసం ఆమెను ఎవరి దగ్గరికైనా పంపడానికి వెనుకాడని వెధవ. ఇలాంటి వాడు వద్దు అని పారిపోయింది. ఇద్దరూ ఈ బస్‌లో పరిచయమయ్యారు. గోవాలో షికార్లు చేశారు. ఆకర్షణ చాలా సులభం. స్త్రీ, పురుషుడు ఒక చోట ఉంటే దప్పికా వెంటనే వెక్కిళ్లూ వచ్చేస్తాయి.కాని ఇద్దరూ కంట్రోల్‌లో ఉంటారు.కోరికను దాటగలిగిన బంధం కోసం చూస్తారు.అయితే వారికి అదే గోవాలో ఒక వృద్ధ దంపతుల జంట పరిచయం అవుతుంది. వారు దాంపత్య జీవితానికి అసలు సిసలు ఉదాహరణ. ఇద్దరూ పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ఒకరి చేయి ఒకరు విడవకుండా... వివాహబంధంలో భార్యాభర్తలు ఇలా ఉండాలి. కాని వీరిద్దరూ? వివాహానికి న్యాయం చేస్తున్నారా?చివరకు వీళ్ల వ్యవహారం తెలియాల్సినవాళ్లకు తెలుస్తుంది. గోవా నుంచి సిటీకి చేరుకుంటారు. గీత రహెమాన్‌కు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకుంటుంది. విడాకులు అయిపోతాయి కూడా. రోషంతో ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. కాని ఆ పెళ్లి జరగదు. అసలు ఆ పెళ్లి జరగాలని ఆమెకు ఉంటే కదా. ఆమె మనసు తన భర్త దగ్గరే ఉంది. అతడు దూరమయ్యాక తాను కోల్పోయిందేమిటో అర్థమైంది. దుఃఖం, వేదన, కలత... మెల్లగా గీత పిచ్చిదైపోతుంది.ఒక ప్రాణాన్ని క్షోభకు గురి చేసి తాము బావుకున్నది ఏముంది అనుకుంటారు రహెమాన్, సితారలు.సితార రహెమాన్‌ను వదిలి పశ్చాత్తాపంతో తన కోసం ఎదురు చూస్తున్న భర్త దగ్గరకు వెళ్లిపోతుంది.రహెమాన్ గీతను తిరిగి స్వీకరించడంతో కథ ముగుస్తుంది.అర్ధనారీశ్వరంలో పార్వతి సగం, శివుడు సగం.దైవం కూడా నిర్ణయించిన పర్సెంటేజీ అది.మనలో సగం మన జీవిత భాగస్వామికి. మిగిలిన సగం మనకు. ఇది అర్థం కాని దంపతులూ జాగ్రత్త!
పుదు పుదు అర్థంగళ్
1998లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా ‘పుదు పుదు అర్థంగళ్’. అంటే ‘కొత్తకొత్త అర్థాలు’ అని అర్థం. మనిషి మానసిక బంధాలను, వివాహం ద్వారా నియమబద్ధం చేసే భౌతిక బంధాలను పరిపరి విధాలుగా అర్థం చేసుకోవాలని చెప్పే సినిమా ఇది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రహెమాన్, గీత, సితార... ఈ సినిమాలో పోటీ పడి నటించారు. అప్పటికి సినిమాల్లో ఒక హీరోయిన్ ‘నంబర్ టూ’ వస్తుందని బస్సు దిగడం, అది అయ్యాక నీళ్లలో చేయి కడుక్కుంటూ కనిపించడం లేదు. ఈ సినిమాలో అదో మామూలు విషయంగా బాలచందర్ చేయించగలిగాడు. ఉప కథలు ఉండటం వల్ల కొన్ని కథల కథ చూస్తున్న భావన కలుగుతుంది. ఆ తర్వాతి కాలంలో పెద్ద కమెడియన్ అయిన వివేక్‌కు ఇది గుర్తింపు తెచ్చిన తొలి సినిమా. ఇళయరాజా, బాలచందర్ కలిసి పని చేసిన చివరి సినిమా ఇది. ఇందులో పాటలు పెద్ద హిట్ అయ్యాయి– తెలుగులో కూడా. ఇందులో పనివాడు ‘నేను కాబోయే ముఖ్యమంత్రిని’ అంటుంటాడు. ప్రతివాడూ రాజకీయాల్లో దిగి ముఖ్యమంత్రి కావాలనుకునే తమిళుల ధోరణి మీద బాలచందర్ పంచ్ కావచ్చు అది. కాని ఆశ్చర్యమేమంటే ఇవాళ ఆయన ఇద్దరు శిష్యులు– రజనీ, కమల్ ముఖ్యమంత్రులు కావడానికి పెద్ద మంత్రాంగం చేస్తున్నారు.
– కె
Comments
Please login to add a commentAdd a comment