ఒక్క సినిమాతో  వంద సినిమాలు పుట్టించిన బాషా | special story to rajinikanth basha | Sakshi
Sakshi News home page

ఒక్క సినిమాతో  వంద సినిమాలు పుట్టించిన బాషా

Published Wed, Mar 14 2018 12:48 AM | Last Updated on Wed, Mar 14 2018 12:48 AM

special story to rajinikanth basha - Sakshi

బాషాలో మంచి సీన్‌ ఉంటుంది.రజనీకాంత్‌ చెల్లెలికి మెడిసిన్‌లో సీట్‌ కావాల్సి వస్తుంది. ఫ్రీ సీట్లు అయిపోయి ఉంటాయి. కాలేజీ ఓనరు ‘ఇక మిగిలింది నా చేతిలో ఉన్న ప్రయివేటు సీట్లే’ అంటాడు.‘ఆ సీటు కావాలంటే నువ్వు కాలేజీతో పాటు అప్పుడప్పుడు గెస్ట్‌హౌస్‌కు వచ్చిపోతుండాలి’ అని అంటాడు.ఈ మాటతో హతాశురాలైన రజనీకాంత్‌ చెల్లెలు క్యాంటీన్‌లో కూచుని కన్నీరు పెట్టుకుంటూ రజనీకాంత్‌తో అంటుంది– ‘కాలేజీకెళ్లి చదువుకోవచ్చు, హాస్టల్‌లో ఉండి చదువుకోవచ్చు, కాని గెస్ట్‌హౌస్‌కు వెళ్లి ఎలా చదవమంటావ్‌ అన్నయ్యా’. రజనీకాంత్‌ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని కాలేజీ ఓనర్‌ దగ్గరకు వెళతాడు.‘ఏరా బెదిరించడానికి వచ్చావా నేనే పెద్ద రౌడీని’ అంటాడు ఓనర్‌.అప్పుడు రజనీకాంత్‌ అందరినీ బయటకు పంపించేసి ‘అయ్యా... నా పేరు మాణిక్యం’ అని టేబుల్‌ మీద చేతులు పెట్టి ముందుకు వొంగుతాడు.‘నాకు ఇంకో పేరు కూడా ఉంది’ అంటాడు.అంతే. ఆర్‌.ఆర్‌ మొదలవుతుంది.

లోపల ఏం మాట్లాడుతున్నాడో మనకు వినిపించదు.అద్దాల గదిలో కాలేజీ ఓనరు సీట్లో నుంచి లేచి నిలుచోవడం, చెమటలు కక్కడం, రజనీకాంత్‌ ముందు చేతులు కట్టుకుని వణకడం... ప్రేక్షకులకు చాలా సంతృప్తిని, అహం తృప్తిని కలిగిస్తుంది.‘మా హీరో అంటే ఏమనుకుంటున్నావురా’.. అని వాళ్లు అనుకుంటారు. అతడు ఫ్లాష్‌బ్యాక్‌లో చాలా పెద్ద డాన్‌. తుపాకులతో, బుల్లెట్లతో ఆడుకున్నవాడు. అలాంటివాడు అజ్ఞాతంలో ఒక ఆటోవాడిలాగా బతుకుతుండొచ్చు. కాని పులి బోనులో ఉన్నంత మాత్రాన పులి కాకుండా పోతుందా?ఘనమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉండి కూడా అతి సామాన్యంగా బతుకుతున్న హీరో మళ్లీ జమ్మి చెట్టు మీద నుంచి అస్త్రాలు దించే తీరుతాడు అని ఎదురు చూసేలా చేసే ఫార్ములా ఇది.భారతం నుంచి బాషా వరకు ఆ ఫార్ములా సక్సెస్‌ అవుతూనే ఉంది.
 

బాషాలో రజనీకాంత్‌ ఒక సరదా అయిన సగటు మనిషిలా మొదట కనిపిస్తాడు. కాని అతడిది అది అసలు రూపం కాదని ప్రేక్షకులకు తెలుస్తూనే ఉంటుంది. ఒక గొప్ప వీరుడు మారువేషంలో అజ్ఞాతంలో ఉన్నాడని దర్శకుడు హింట్స్‌ ఇస్తూ ఉంటాడు. ఆ పాత్రను ప్రేక్షకులే కాదు సాటి పాత్రలు కూడా తలెత్తి చూసేలా ఒక సన్నివేశం పెడతాడు. రజనీకాంత్‌ తమ్ముడికి పోలీస్‌ ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కమిషనర్‌కు డౌట్‌ వస్తుంది. ‘మీ అన్నను రమ్మను’ అంటాడు. అప్పటికే ముంబై రికార్డ్స్‌లో బాషా మరణించాడని ఉంటుంది. ముంబైలో పని చేసి వచ్చిన ఆ కమిషనర్‌కు బాషా తెలుసు. ఇక్కడ ఉన్నది ఆ బాషాయేనా తెలుసుకోవడానికి రమ్మంటాడు. పెద్ద ఆఫీస్‌ రూమ్‌ అది.రజనీకాంత్‌ ఆటోవాలాలా ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా కమిషనర్‌ లేచి నిలబడతాడు. పక్క పాత్రలూ ప్రేక్షకులు కూడా. మారువేషంలో ఉన్నది భీముడు అని కీచకుడు కనిపెట్టి అదిరిపడితే ఎలాంటి మజా వస్తుందో ఇక్కడ కూడా అలాంటి మజాయే ప్రేక్షకులకు వస్తుంది.
 

రజనీకాంత్, చరణ్‌రాజ్‌ ముంబైలో స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కాని ఆ ప్రాంతంలో డాన్‌ అయిన రఘువరన్‌ మురికివాడను ఖాళీ చేయిస్తుంటే రజనీకాంత్, చరణ్‌రాజ్‌ అడ్డు పడతారు. చావు ఎదురైనా ఇద్దరం కలిసే ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం అనుకుంటారు. కాని రఘవరన్‌ చాలా దుర్మార్గుడు. తన దగ్గర పని చేసే మేనేజర్‌ విజయకుమార్‌ కొడుకు కాబట్టి రజనీకాంత్‌ని వదిలిపెట్టి చరణ్‌రాజ్‌ను దారుణంగా హత్య చేయిస్తాడు. చరణ్‌రాజ్‌ పేరు అన్వర్‌ బాషా. చరణ్‌ రాజ్‌ మృతదేహం ఖననం అయ్యేలోపు రజనీకాంత్‌ అతణ్ణి చంపిన ప్రతి ఒక్కరినీ నరుకుతాడు. బస్తీ వాసులంతా ఈ దుష్ట శిక్షణకు జేజేలు పలుకుతారు. ఆ రోజు నుంచి రజనీకాంత్‌ తన పేరును మాణిక్‌ బాషాగా మార్చుకొని ముంబైలో పెద్ద డాన్‌గా మారుతాడు. కాని రఘువరన్‌కు, రజనీకాంత్‌కు మధ్య గొడవలు పెరిగిపోయి ఆ గొడవల్లో తండ్రి ప్రాణమే పోయే పరిస్థితి వచ్చేసరికి తండ్రి చివరి కోరిక మేరకు నేర జీవితం వదిలేసి చెన్నై చేరుకుని మామూలు జీవితం గడుపుతుంటాడు రజనీకాంత్‌. కాని తిరిగి పాత రూపం చూపించే పరిస్థితి వస్తుంది. ఒక లోకల్‌ రౌడీ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే మాణిక్యం అవతారం చాలించి తిరిగి బాషా అవతారంలోకి వెళతాడు రజనీకాంత్‌.ఆ సన్నివేశం సినిమాలో ముఖ్యమైనది.

అంతకు ముందు సన్నివేశాలలో ఆ రౌడీని చూసి రజనీకాంత్‌ భయపడినట్టుగా కనిపిస్తాడు. మనకెందుకు గొడవ అన్నట్టు పక్కకు తప్పుకుంటుంటాడు. చివరకు ఆ రౌడీ తనను స్తంభానికి కట్టేసి చితక బాదినా సహిస్తాడు. కాని ఎప్పుడైతే చెల్లెలి మీద ఆ రౌడీ చేయి వేస్తాడో... ఒకే గుద్దు... రౌడీ ఎగిరి కరెంట్‌ పోల్‌ను ఢీకొని కిందపడతాడు.రజనీకాంత్‌ మాణిక్యం అవతారాన్ని చాలించి తిరిగి బాషాగా మారాడన్న సంగతి తెలియగానే తల్లి అక్కడి నుంచి అందరినీ తీసుకెళ్లిపోతుంది. ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకుంటాయి. కేరెక్టర్‌ ఇమేజ్‌ ఆకాశానికి అంటుతుంది. ఇంతకుముందు సినిమాల్లో ఇలాంటి అనుభూతి లేదు.ఇది బాషా ఫార్ములా అనుభూతి.

పాండవులు మారువేషంలో బతకడం సామాన్య జనులకు ఎంత అబ్బురమో హీరోలు మారువేషంలో బతకడం కూడా అంతే అబ్బురం. ఇచ్చిన మాటకు, విలువకు కట్టుబడి కుటుంబం కోసం సాధారణ జీవితం గడపడానికి వచ్చిన బాషా తిరిగి పాత రూపంలోకి వెళ్లి శత్రుశేషం ఎలా నిర్మూలించుకున్నాడన్నది క్లయిమాక్స్‌.సాధారణంగా సినిమాలు ముగిశాక శుభం కార్డు పడుతుంది. కాని బాషా ముగిశాక కూడా శుభం కార్డు పడలేదు. ఆ సినిమా కథ ముగియలేదు. ఇప్పటికీ అనేక కథలను పుట్టిస్తూనే ఉంది. ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ అనేది ఇందులో పంచ్‌ డైలాగ్‌. ఒక్కసారి రిలీజైనా వంద విధాలుగా రీరిలీజ్‌ అవుతున్నదే– బాషా.

‘హమ్‌’ నుంచి స్ఫూర్తి పొంది...
సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో 1995లో విడుదలైన ‘బాషా’ చాలా పెద్ద విజయం సాధించింది. ఒక రకంగా రజనీకాంత్‌ కెరీర్‌ని ఇంకో ఇరవై ఏళ్లు పొడిగించిన సినిమా ఇది. రజనీకాంత్‌ ఇమేజ్‌ భారీగా పెరడగానికి ఈ సినిమా ముఖ్యకారణం. దీని తర్వాత రజనీకాంత్‌ మల్టీ స్టారర్‌ హిందీ సినిమాలు మానుకొని సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయడం మానుకొని ఒక్కసారికి ఒక్క సినిమా పద్ధతిలోకి వెళ్లి తన మార్కెట్‌ బాగా పెంచుకోగలిగాడు. 1991లో వచ్చిన ‘హమ్‌’ సినిమాలో నటించడం రజనీకాంత్‌కు లాభించింది. ఆ సినిమాలో అమితాబ్‌ ఇలాగే పెద్ద డాన్‌గా ఉండి అన్నీ మానేసి కుటుంబం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. ఆ పాయింట్‌ను ‘బాషా’ కోసం కొత్తగా డెవలప్‌ చేసుకున్నాడు రజనీకాంత్‌. మంచి వయసు, ఆరోగ్యం ఉన్న రోజులలో వచ్చిన సినిమా కాబట్టి ఇందులో రజనీ పూర్తి ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ‘ప్రేమికుడు’తో తెర మీదకు వచ్చిన నగ్మా ఈ సినిమాతో రజనీ పక్కన నటించే చాన్స్‌ కొట్టేసింది. దేవా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ప్లస్‌ అయ్యాయి. ఇక ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్‌ ఎన్ని సినిమాలలో ఎన్ని స్పూఫులుగా వచ్చిందో తెలుసు. ‘బాషా ఫార్ములా’ ధోరణి ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ సినిమాల్లో మనం చూస్తాం. బాషా డిజిటల్లీ ఇంప్రూవ్డ్‌ ప్రింట్‌ను 2017లో విడుదల చేశారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమా రీరిలీజ్‌ అయ్యిందంటే అది బాషాకు మాత్రమే దక్కిన ఘనత. 
- సురేశ్‌ కృష్ణ, దర్శకుడు 
– కె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement