బీజేపీ షార్ట్ లిస్ట్‌లో ఈ ఇద్దరి పేర్లు!
ఒకట్రెండు రోజుల్లో కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటన
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. గత రెండు పర్యాయాలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేశ్ అకస్మాత్తుగా కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా మారడంతో బీజేపీ అగ్ర నేతలు షాక్‌కు గురయ్యారు. ఈసారి అభ్యర్థి ఎంపికలో గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. పాతిక మందికిపైగా ఆశావహులు పోటీ పడుతుండటంతో, వారిలో బలమైనవారిని అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
ముఖ్యంగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఏకాభిప్రాయం కుదురడం లేదని తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత, వర్గపోరు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వడపోత పోసి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాజీమంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ టీఎన్ వంశీతిలక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీమంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత, వర్రి తులసీ విజయ్‌కుమార్, జైనపల్లి శ్రీకాంత్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.
ఇద్దరూ ఇద్దరే...
డాక్టర్ వంశీతిలక్ తల్లిదండ్రులు సదాలక్షి్మ, టీవీ నారాయణ కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారం ప్రాంతానికి చెందినవారు. సదాలక్ష్మి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో సంచలనంగా నిలిచారు. ఆమె భర్త టీవీ నారాయణకు 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరి వారసుడిగా డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న వంశీతిలక్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం పెద్దల ఆశీస్సులతో తనకు టికెట్ దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కొప్పు భాషా పాతికేళ్ల క్రితమే ఏబీవీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ‘నా రక్తం నా తెలంగాణ’పేరిట తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం ఉప సర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఎంపీపీగా పనిచేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పారీ్టలో కీలక వ్యక్తిగా ఎదిగారు. నగరంలోని ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈయన పేరును సైతం బీజేపీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment