భార్య రూపం కన్నా హృదయం ముఖ్యమని చెప్పే | special story to mukku pudaka movie | Sakshi
Sakshi News home page

భార్య రూపం కన్నా హృదయం ముఖ్యమని చెప్పే

Published Fri, Apr 21 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

భార్య రూపం కన్నా హృదయం ముఖ్యమని చెప్పే

భార్య రూపం కన్నా హృదయం ముఖ్యమని చెప్పే

నాటి సినిమా

సినిమాలు చాలా వస్తుంటాయి. కొన్ని సినిమాలే కొంగు బిగిస్తాయి. కాలం నాసికపై చెమక్కున మెరిసిస సినిమా ‘ముక్కుపుడక’. స్త్రీ సహనానికి, ధిక్కారానికి గుర్తు ఈ సినిమా. భార్య ఆత్మిక సౌందర్యాన్ని చూడలేని గుడ్డి భర్తలకు చెంపదెబ్బ.

మంగతాయారు (సుహాసిని) జడ కుక్కతోకలా ఉంటుంది. ఎంత దువ్వినా, రిబ్బన్‌తో కట్టినా, ఆఖరుకు రాళ్లు కట్టి వేలాడగట్టినా దాని వంకర వంకరే. సరి కాదు. అందుకే మంగతాయారును చూడటానికి వచ్చినవాళ్లంతా వచ్చింది వచ్చినట్టుగా పరార్‌ అవుతుంటారు. మళ్లీ ఇటువైపు చూడటానికి భయపడుతుంటారు. పైగా అమ్మాయి నలుపు. దిష్టి చుక్క పెడితే కనపడకుండా పోయేంత రంగు. ఎవరు చేసుకుంటారు? కాని పొరుగూర్లో పెంటా పరబ్రహ్మం (గొల్లపూడి మారుతీరావు) అనే పల్లెటూరి పెద్దమనిషి ఉంటాడు. అతడు మంగతాయారు తండ్రి (పి.ఎల్‌.నారాయణ)కి చిన్నప్పటి స్నేహితుడు. ఇలా పెళ్లికెదిగిన కూతురు ఉందని ఇంకా పెళ్లి కావడం లేదని స్నేహితుడు బాధ పడటం చూసి తన కడుపున ప్రసాద్‌ (భానుచందర్‌) అనే ఒక కొడుకు పుట్టాడనీ వాడికిచ్చి చేస్తానని అప్పటికప్పుడు మాట ఇస్తాడు. కండువా ఇచ్చి పుచ్చుకుంటాడు.

కాని అసలైన కుక్కతోక ఇక్కడే ఈ ప్రసాద్‌ దగ్గరే ఉంది. అతడు ఊహల్లో ఉండే మనిషి. భార్యంటే అందంగా ఉండాలని అప్సరసలా వెలిగిపోతుండాలని భావిస్తుంటాడు. తాను చేసుకోబోయే అమ్మాయి కోసం ఒక అందమైన ముక్కుపుడక చేయించి జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. అతడు ఊహించేది ఒకటి. జరిగేది మరొకటి. అంత అప్సరసను ఊహించుకుంటే భార్యగా మంగతాయారు వచ్చింది. వచ్చిన మంగతాయారును అతడు పురుగులా చూశాడు. చీదరించాడు. ఆమె హృదయం, మంచితనం, తన పట్ల ప్రదర్శించే అనురాగం, తన తల్లిదండ్రుల పట్ల చూపిస్తున్న భక్తి... ఇవన్నీ అతడికి పట్టలేదు. ఆమెకు రంగు లేదు. కనుక ఆమె తనకు అక్కర్లేదు.

అందుకని అతడు ట్రాన్స్‌ఫర్‌ అనే మిషతో మద్రాసు చెక్కేశాడు. అక్కడే రీనా (విజయశాంతి) అనే కొలీగ్‌కి తనకు పెళ్లి కాలేదని, ఎవరూ లేరని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని కాపురం పెడతాడు. ఏ ఇంట్లో అయితే భర్త కాపురం ఉన్నాడో అదే ఇంట్లో భర్తను వెతుక్కుంటూ వచ్చిన మంగతాయారు పని మనిషిలా చేరుతుంది. తాళి కట్టిన వాడు మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడని తెలిసినా ఆవేశపడదు. అభిరుచికి తగిన అమ్మాయిని వెతుక్కుని సంతోషంగా ఉన్నాడని సంతృప్తి పడుతుంది. కట్టుకున్న భార్య తన ఎదుటే పని మనిషిలా మారి ఇంత అవస్థ పడుతున్నా సహనం ప్రదర్శిస్తున్నా కుక్కతోక కుక్కతోకలానే ఉంటుంది. మారదు.

కాని నిజం ఏదో ఒకనాడు  బయటపడుతుంది. బయటపడిననాడు ప్రళయం వస్తుంది. ఎవర్నైతే మోసం చేసి చేసుకున్నాడో ఆ అమ్మాయి– రీనా–  ఉగ్రరూపం దాలుస్తుంది. అతణ్ణి చంపడానికి సిద్ధపడుతుంది. అప్పుడు అతణ్ణి కాపాడేది ఎవరు? ఇంకెవరు మంగతాయారే. భర్త ప్రాణాల కోసం ఎప్పుడూ యముడి పాశానికి అడ్డం నిలిచేది స్త్రీయే. కాని భార్య ప్రాణం కోసం ప్రాణాలు అడ్డు వేసిన భర్త పురాణాల్లో కనిపించడు. అదీ భారతీయత. మృగ లక్షణాలు పూర్తిగా వదులుకోలేని పురుషుణ్ణి భారతీయ స్త్రీ ఇలాగే మార్చుకుంటూ వస్తోంది. చాలాసార్లు నయాన. ఎప్పుడైనా భయానా. రిజల్ట్‌ మాత్రం గ్యారంటీ.

కథ క్లయిమాక్స్‌కు వచ్చింది. తన దగ్గర ఉన్న ముక్కుపుడక పెట్టుకోదగ్గ స్త్రీ మంగతాయారే అనీ, భర్తగా తాను మసలుకోవాల్సిన స్త్రీ కూడా మంగతాయారే అని ప్రసాద్‌ గ్రహిస్తాడు. రీనా త్యాగం చేసి వాళ్ల జీవితాల నుంచి తప్పుకుంటుంది. ప్రసాద్, మంగతాయారు ట్రైన్‌ ఎక్కి స్వగ్రామం బయలుదేరడంతో కథ ముగుస్తుంది.1982లో వచ్చిన ‘ముక్కుపుడక’ పెద్ద హిట్‌. కాని ఇది నేరుగా తెలుగు సినిమా కాదు. మణివణ్ణన్‌ తమిళంలో ‘గోపురంగళ్‌ సైవతిలై’ అనే ఈ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి అక్కడ పెద్ద హిట్‌ చేస్తే భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై  కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మాత ఎస్‌.గోపాల్‌ రెడ్డి రీమేక్‌ చేశారు. తమిళాన్ని మక్కికి మక్కి ఫాలో కాకుండా తెలుగుదనంతో రీమేక్‌ చేయడంతో ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. అప్పటికి తెలుగుతెరకు కొత్త అయిన సుహాసిని, అప్పుడప్పుడే రైజింగ్‌లోకి వస్తున్న గొల్లపూడి మారుతీరావు విజృంభించి నటించడం వల్ల కూడా ఈ సినిమా బాగా ఆడింది.

‘సెప్పుచ్చుకుని కొట్టానంటే’... అనే మేనరిజంతో గొల్లపూడి ఈ సినిమాలో చెలరేగిపోతారు. అలాంటి క్యారెక్టర్లు ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయనేది ప్రశ్న. ఈ సినిమాలో పని మనిషిగా పడి ఉన్న భార్యకు పూలు తెచ్చి బయటకు కనపడకుండా పెట్టుకో అంటాడు భర్త. అప్పుడామె ‘ఎలా? ఇదేమైనా ఏడుపా... లోపల్లోపల ఏడవడానికి?’ అంటుంది. గణేశ్‌ పాత్రో సంభాషణల పదును అలాంటిది.
ఇందులో పాటలు జె.వి.రాఘవులు చేసిన ‘చినుకు చినుకుగా చిగురు మెత్తగా’ పాట పెద్ద హిట్‌. అలాగే ‘మగువ మనసుకే గుర్తు మగువ ముక్కుపుడక’ పాటను ఆ రోజుల్లో ఆడవాళ్లందరూ కూనిరాగం తీసేవారంటే అబద్ధం కాదు. భారతీయ సినిమాల్లో భర్తను గెలుచుకోవడం అనేది ఎప్పుడూ హిట్‌ సబ్జెక్టే. అది యముడి నుంచి కానివ్వండి, ఉగ్రవాదుల నుంచి కానివ్వండి, దుర్వ్యసనాల నుంచి కానివ్వండి, పరాయి స్త్రీ నుంచి కానివ్వండి భర్తను కాపాడుకుంటే అది హిట్‌. ఎందుకంటే ఈ దేశంలో స్త్రీ జీవితం అంటే ఆమె వైవాహిక జీవితం మాత్రమే కాబట్టి. ఆ జీవితానికి ఆధారమైన భర్తను తీర్చిదిద్దుకోవడంలో ఆమె ఒకోసారి భూదేవిగా మరోసారి కాళికాదేవిగా మారుతుంటుంది. ఈ సత్యం గ్రహించినవాడు జాగ్రత్తగా ఉంటాడు. తెలుసుకోనివాడు చెప్పుదెబ్బలు తిని దారికొస్తుంటాడు. అన్నట్టు భర్తలూ... మీ భార్యకు మంచి ముక్కపుడక కొనిచ్చి ఎంత కాలమైంది?

మణివణ్ణన్‌
‘ముక్కుపుడక’ తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన మణివణ్ణన్‌ ఆ రోజుల్లో కొత్తరకం సినిమాలతో, కథలతో తమిళంలో సంచలం సృష్టించాడు. ముఖ్యంగా సత్యరాజ్‌ను సూపర్‌స్టార్‌ చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. సెట్‌లో సీన్‌పేపర్‌ లేకుండా సీన్‌లు షూట్‌ చేసే దర్శకుడిగా ఇతడికి పేరు. మణివణ్ణన్‌ భారతీరాజా శిష్యుడు. చివరి రోజుల్లో భారతీరాజాకూ ఇతనికి స్పర్థలు వచ్చాయి. భారతీరాజా మణివణ్ణన్‌ గురించి కొన్ని పరుషమైన వ్యాఖ్యలు మీడియాలో చేయగా ఆ వెంటనే కొద్దిరోజులకు మణివణ్ణన్‌ మృతి చెందడంతో మృతికి భారతీరాజా వ్యాఖ్యలు కూడా కారణం అని కొందరు విమర్శలు చేశారు.

అది రాఘవగారి మేనరిజమ్‌..
‘ముక్కుపుడక’ సినిమాలో నాది చాలా మంచి పాత్ర. అందులో ‘సెప్పుచ్చుకు కొట్టానంటే’.. అనే మేనరిజం ఉంటుంది. అది నిర్మాత రాఘవ(ప్రతాప్‌ ఆర్ట్స్‌)గారిది. దానిని గమనించి కొంచెం ఎగ్జాగరేట్‌ చేసి కోడి రామకృష్ణగారి సలహా మేరకు మెప్పించగలిగాను. తెలుగు సినిమాల్లో నటుడుగా నేను మరింత స్థిరపడటానికి ఆ క్యారెక్టర్‌ ఉపయోగపడింది. భార్యను పనిమనిషిగా మార్చి మరో స్త్రీని పెళ్లాడిన కొడుకును గమనించి తండ్రిగా నేను రగిలిపోతాను. ‘ఆ నా కొడుకును ఈ చేతులతో సంపేద్దును. కాని ఏం చేయను. ఒక ఆడకూతురి తాళి వాడి చేతుల్లో ఉండిపోయింది’ అనే డైలాగ్‌ చెప్తాను. చాలా మంచి డైలాగ్‌.
– గొల్లపూడి మారుతీరావు

ఎన్నో సినిమాలకు మాతృక
భార్య కురూపి అయి భర్త నక్క వేషాలు వేసే సినిమాలకు ‘ముక్కుపుడక’ మాతృక. దీని స్ఫూర్తితోనే కె.భాగ్యరాజ మరో మూడేళ్లకు అంటే 1985లో ‘చిన్నవీడు’ సినిమా తీశాడు. ఇందులో భార్య లావుగా ఉంటే భర్తకు నచ్చక చిన్నిల్లు పెడతాడు. తమిళంలో డబ్‌ అయ్యాక తెలుగులో పెద్ద హిట్‌. దీని స్ఫూర్తితోనే బాలూ మహేంద్ర ‘సతీ లీలావతి’ (1995) తీశాడు. దీని స్ఫూర్తితోనే ఇ.వి.వి. సత్యనారాయణ ‘కితకితలు’ (2006) తీశాడు. ఈ రెండు సినిమాల్లో కూడా భార్య లావుగా ఉంటే భర్త రెండో పెళ్లి ప్రయత్నాలు చేసి చివరకు బుద్ధి తెచ్చుకుంటాడు.

పాటలు హిట్‌
ఈ సినిమాలోని ‘చినుకు చినుకుగా చిగురు మెత్తగా’ పాట హిట్‌. అలాగే ‘మగని మనసుకే గురుతు మగువ ముక్కుపుడక’ పాటను ఆ రోజుల్లో పాడుకోని ఆడవారు లేరు.
– కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement