
బాహుబలి టీం కారణంగానే స్పైడర్ వాయిదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముందుగా జూన్ 23నే రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఆగస్టుకు వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ ఆగస్టులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ లేదట. దసరా కానుకగా అక్టోబర్లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే స్పైడర్ ఆలస్యం వెనుక బాహుబలి టీం ఉందన్న టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాహుబలి 2 సంచలనాలు నమోదు చేస్తుండటంతో స్పైడర్ సినిమా విషయంలో కూడా గ్రాఫిక్స్ మీద ఎక్కువ సమయం, బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు యూనిట్. అందుకే కమల్ కణ్నన్ ఆధ్వర్యంలో మకుటతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మకుట, ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావటంలేదు. ఎంత సమయమైనా కేటాయించి క్వాలిటీ గ్రాఫిక్స్ను రెడీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని స్పైడర్ టీంకు కూడా చెప్పడంతో చేసేదేమి లేక సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.