బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ.. | Sreemukhi Dress Designer Keerthana Special Story | Sakshi
Sakshi News home page

తళుక్‌.. న్యూ లుక్‌!

Published Fri, Oct 11 2019 11:00 AM | Last Updated on Fri, Oct 11 2019 11:03 AM

Sreemukhi Dress Designer Keerthana Special Story - Sakshi

శ్రీముఖితో డిజైనర్‌ కీర్తన

బంజారాహిల్స్‌: బిగ్‌బాస్‌– 3లో టీవీ యాంకర్‌ శ్రీముఖి తళుక్కున మెరుస్తోంది. ఆమె ధరిస్తున్న దుస్తులు సరికొత్త అందాలకు చిరునామాగా మారాయి. రోజుకో అరుదైన డిజైన్‌తో అదరగొడుతోంది. నగర యువతులు ఆమె వస్త్రధారణనే అనుకరిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పటి సినీనటి వాణిశ్రీ కట్టిందంటే అవి మార్కెట్‌లో ఆవిడ పేరుతోనే పిలుచుకునే వారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో శ్రీముఖి డ్రెస్‌లు అదే స్థాయిలో హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇంతకూ శ్రీముఖికి డ్రెస్‌లు, జ్యువెలరీ డిజైన్‌ చేస్తున్నది ఎవరో తెలుసా?. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10 నివసిస్తూ.. ‘రేఖాస్‌’ బొటిక్‌ పేరుతో డిజైనర్‌ షోరూమ్‌ను నడిపిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ కీర్తన సునీల్‌. శ్రీముఖికి దుస్తులను సరికొత్త తీరులో, కలర్‌ఫుల్‌ కాంబినేషన్‌లో ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ తెరపై ఆమెకు కొత్త లుక్‌ను తీసుకొస్తున్నారు. పదకొండు వారాలుగా బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగుతున్న శ్రీముఖికి ఇప్పటి వరకు రోజుకొకటి చొప్పున 76 డ్రెస్‌లను ధరించింది. ఈ 76 డ్రెస్‌లను డిజైన్‌ చేసింది కీర్తన కావడం విశేషం.  

తెలుగుదనం ఉట్టిపడేలా..   
ఫ్యామిలీ ఆడియన్స్‌కు రీచ్‌ అయ్యేలా తన డ్రెస్‌ ఉండాలని శ్రీముఖి కోరుకుంటుందని, ఒకవేళ ఆధునికంగా కనిపించాలనుకుంటే కాలేజీ విద్యార్థినిని దృష్టిలో పెట్టుకొని డ్రెస్‌లు తయారు చేయాల్సిందిగా సూచిస్తుంటారని కీర్తన తెలిపారు. బిగ్‌బాస్‌లో ప్రత్యేకంగా డిజైనర్‌ ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా శ్రీముఖికే దక్కుతుంది. స్లీవ్‌లెస్, నెక్‌లైన్‌ డీప్‌గా ఉండే డ్రెస్సులను శ్రీముఖి ఎంతమాత్రం ఇష్టపడదని, భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ఉండాలని కోరుకుంటుందని ఆమె తెలిపారు. ఒక్కో డ్రెస్‌ డిజైన్‌చేయడానికి వారం పడుతుందని వెల్లడించారు.

15 ఏళ్ల నుంచి..  
ప్రస్తుతం శ్రీముఖి వార్డ్‌రోబ్‌లో ఉన్న డ్రెస్‌లన్నీ తాను డిజైన్‌ చేసినవేనని కీర్తన వెల్లడించారు. హ్యామ్స్‌టెక్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కళాశాలలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసిన కీర్తన.. 15 ఏళ్ల నుంచి డిజైనర్‌గా, నాలుగేళ్లుగా సెలబ్రిటీలకు డిజైనర్‌గా పేరుతెచ్చుకున్నారు. పటాస్‌తో పాటు భలే చాన్సులే.. జూలకటక, సరిగమపా, సరిగమప లిటిల్‌ చాంప్స్, డ్రామా జూనియర్స్, గోల్డ్‌రష్, కామెడీ నైట్స్, సూపర్‌ సీరియల్‌ చాంపియన్‌షిప్‌లకు సైతం దుస్తులు డిజైన్‌ చేస్తుంటానని కీర్తన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement