keerthana
-
Hyderabad: ధూమ్ ధామ్ దోస్తాన్..!
సాక్షి, సిటీబ్యూరో: మల్లారెడ్డి మహిళా కళాశాల వేదికగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లు సందడి చేశారు. ఈ నెల ఫ్రెండ్షిప్ డే నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో యువగాయకులు తమ స్వరాలతో అలరించారు. ధూమ్ ధామ్ దోస్తాన్ విత్ యువర్ ఐడల్స్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్లు అనిరుధ్, కేశవ్, కీర్తన–కీర్తి, నజీర్ పాటలతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ కన్సర్ట్ను తలపించిన ఈ కార్యక్రమం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లతో సెల్ఫీలతో ఆహ్లాదంగా సాగింది. -
నిరుపేద.. ఆపై పెద్ద బాధ.. నేనున్నానంటూ ఎమ్మెల్యే రాచమల్లు భరోసా
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామానికి చెందిన బత్తల మల్లికార్జున, మునిలక్ష్మి దంపతులు నిరుపేదలు. మల్లికార్జున కూలీ పనికి వెళ్తుంటాడు. వారికి ముగ్గురు కుమార్తెలు. కీర్తన చివరి సంతానం. స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 10 ఏళ్ల కీర్తనకు పెద్ద కష్టం వచ్చింది. కొన్ని నెలల క్రితం ముఖంలో గడ్డలు ఏర్పడి వాపు వచ్చింది. తగ్గుతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ వాపు కాస్త ముఖమంతా ఎక్కువగా వ్యాపించింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ వచ్చారు. చాలా ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఆదుకున్న ఎమ్మెల్యే ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాలిక తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నెల్లూరులోని మెడికోవర్ ఆస్పత్రికి పంపించారు. అన్ని రకాల పరీక్షలు చేసి దవడ ఎముక లోపలి భాగంలో క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆపరేషన్ చేయిస్తే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.10 లక్షలు మేర ఖర్చు అవుతుందని తెలపడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంత డబ్బు భరాయించే స్థోమత తమకు లేదని రోదించసాగారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో ఆపరేషన్ చిన్నారి కీర్తన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మీడియాకు వెల్లడించారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పారన్నారు. ముగ్గురు వైద్యులు కలిసి ఆపరేషన్ చేయనున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం చేయాలని తాను కోరిన మేరకు వైద్యులు రూ.6 లక్షలకు అంగీకరించారన్నారు. కొంత డబ్బు కుటుంబ సభ్యులు పెట్టుకుంటామని చెప్పారని, మిగతా రూ.5 లక్షలు లేదా అంతకు ఎక్కువైనా తానే భరాయిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ నిమిత్తం బుధవారం కీర్తనను ఎమ్మెల్యే నెల్లూరుకు పంపించారు. అడ్మిట్ అయిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారన్నారు. పేదరికంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుకు కీర్తన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు) -
బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..
బంజారాహిల్స్: బిగ్‌బాస్– 3లో టీవీ యాంకర్ శ్రీముఖి తళుక్కున మెరుస్తోంది. ఆమె ధరిస్తున్న దుస్తులు సరికొత్త అందాలకు చిరునామాగా మారాయి. రోజుకో అరుదైన డిజైన్‌తో అదరగొడుతోంది. నగర యువతులు ఆమె వస్త్రధారణనే అనుకరిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పటి సినీనటి వాణిశ్రీ కట్టిందంటే అవి మార్కెట్లో ఆవిడ పేరుతోనే పిలుచుకునే వారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో శ్రీముఖి డ్రెస్‌లు అదే స్థాయిలో హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇంతకూ శ్రీముఖికి డ్రెస్‌లు, జ్యువెలరీ డిజైన్ చేస్తున్నది ఎవరో తెలుసా?. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10 నివసిస్తూ.. ‘రేఖాస్’ బొటిక్ పేరుతో డిజైనర్ షోరూమ్‌ను నడిపిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ కీర్తన సునీల్. శ్రీముఖికి దుస్తులను సరికొత్త తీరులో, కలర్‌ఫుల్ కాంబినేషన్లో ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ తెరపై ఆమెకు కొత్త లుక్‌ను తీసుకొస్తున్నారు. పదకొండు వారాలుగా బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్న శ్రీముఖికి ఇప్పటి వరకు రోజుకొకటి చొప్పున 76 డ్రెస్‌లను ధరించింది. ఈ 76 డ్రెస్‌లను డిజైన్ చేసింది కీర్తన కావడం విశేషం. తెలుగుదనం ఉట్టిపడేలా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా తన డ్రెస్ ఉండాలని శ్రీముఖి కోరుకుంటుందని, ఒకవేళ ఆధునికంగా కనిపించాలనుకుంటే కాలేజీ విద్యార్థినిని దృష్టిలో పెట్టుకొని డ్రెస్‌లు తయారు చేయాల్సిందిగా సూచిస్తుంటారని కీర్తన తెలిపారు. బిగ్‌బాస్‌లో ప్రత్యేకంగా డిజైనర్ ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా శ్రీముఖికే దక్కుతుంది. స్లీవ్‌లెస్, నెక్లైన్ డీప్‌గా ఉండే డ్రెస్సులను శ్రీముఖి ఎంతమాత్రం ఇష్టపడదని, భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ఉండాలని కోరుకుంటుందని ఆమె తెలిపారు. ఒక్కో డ్రెస్ డిజైన్చేయడానికి వారం పడుతుందని వెల్లడించారు. 15 ఏళ్ల నుంచి.. ప్రస్తుతం శ్రీముఖి వార్డ్‌రోబ్‌లో ఉన్న డ్రెస్‌లన్నీ తాను డిజైన్ చేసినవేనని కీర్తన వెల్లడించారు. హ్యామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన కీర్తన.. 15 ఏళ్ల నుంచి డిజైనర్‌గా, నాలుగేళ్లుగా సెలబ్రిటీలకు డిజైనర్‌గా పేరుతెచ్చుకున్నారు. పటాస్‌తో పాటు భలే చాన్సులే.. జూలకటక, సరిగమపా, సరిగమప లిటిల్ చాంప్స్, డ్రామా జూనియర్స్, గోల్డ్‌రష్, కామెడీ నైట్స్, సూపర్ సీరియల్ చాంపియన్‌షిప్‌లకు సైతం దుస్తులు డిజైన్ చేస్తుంటానని కీర్తన తెలిపారు. -
కీర్తన సంచలనం
ముంబై: అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ అండర్–16 స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన కీర్తన పాండియన్ విజేతగా నిలిచింది. కర్ణాటకకు చెందిన కీర్తన ఫైనల్లో 3–1 (53–44, 16–49, 62–42, 72–39) ఫ్రేమ్‌ల తేడాతో అల్బీనా లెస్‌చుక్ (బెలారస్)పై గెలిచింది. అంతకుముందు నాకౌట్ మ్యాచ్‌ల్లో కీర్తన 3–0తో మనస్విని (భారత్)పై, 3–0తో అలీనా ఖైరూలినా (రష్యా)లపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఆమె 3–1తో డిఫెండింగ్ చాంపియన్ అనుపమ (భారత్)పై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. -
నటి సీత కూతురు వివాహ వేడుక
-
వైభవంగా హీరో కూతురి వివాహం
సాక్షి, పేరంబూరు: నటుడు, దర్శకుడు పార్థిబన్, సీత కూతురు కీర్తన వివాహ వేడుక అక్షయ్‌తో గురువారం ఉదయం స్థానిక రాజా అన్నామలైపురంలోని ఒక నక్షత్ర హోటల్లో ఘనంగా జరిగింది. కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్లాల్ చిత్రంలో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న కీర్తన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. అక్షయ్, కీర్తన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇటీవలే వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. గురువారం అక్షయ్, కీర్తనల పెళ్లికి ఈ శుభం కార్డు పడింది. వీరి వివాహ వేడుకను పార్థిబన్, సీత కలిసి ఘనంగా నిర్వహించారు. పార్థిబన్, సీత మనస్పర్థల కారణంగా చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కూతురి పెళ్లి పార్థిబన్, సీతల సమక్షంలో ఒక వేడుకలా జరగడం విశేషం. అక్షయ్, కీర్తన వివాహవేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, దయానిధిమారన్, ఎండీఎంకే నేత వైగోలతో పాటు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వంటి పలువురు రాజకీయనేతలతో పాటు నటుడు రజనీకాంత్, లతారజనీకాంత్, శివకుమార్, సూర్య, విశాల్, అరుణ్‌విజయ్, విజయ్‌కుమార్, నటి జ్యోతిక, మీనా, శ్రీప్రియ, లక్ష్మి, కుష్బూ, సందర్.సీ సత్యరాజ్, జయంరవి, ప్రభుదేవా, జీవీ.ప్రకాశ్‌కుమార్, విజయ్‌సేతుపతి, ఉదయనిధిస్టాలిన్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రోహిణి, రాధిక శరత్‌కుమార్, నిర్మాత ఆర్బీ.చౌదరి. ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, సంగీతదర్శకుడు హరీష్‌జయరాజ్, కే.భాగ్యరాజ్,శంకర్, సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేడిపల్లిలో వివాహిత అదృశ్యం
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం..కాచవానిసింగారం ముత్వేలిగూడకు చెందిన దశరథ్ కుమార్తె సాయి కీర్తన(24)నకు ఐదేళ్ల్ల క్రితం రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం అయ్యింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉంది. 10 రోజుల క్రితం భార్య భర్తలకు గొడవ జరగడంతో పుట్టిలైన ముత్వేలి గూడకు వచ్చింది. ఈక్రమంలో జూలై 29వతేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి పోయింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో సోమ వారం తండ్రి దశరథ్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మణి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా హీరో కూతురు
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, చిత్ర నిర్మాత ఆర్. పార్థిపాన్ కూతురు నటి కీర్తన ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కార్తీ సురేశ్, దుల్కర్ సల్మాన్ నటీనటులుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టులో సహాయ దర్శకురాలిగా పనిచేస్తూ ఆడిషన్లలో కీర్తన బిజీగా ఉన్నట్టు సినిమా యూనిట్ పేర్కొంది. మణిరత్నం దర్శకత్వంలో 2002లో వచ్చిన తమిళ సినిమా 'కన్నాథిల్ ముత్తాముట్టాల్' లో కీర్తన నటించింది. ఆ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్టులో హీరోయిన్ కోసం చూస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. నటి కీర్తీ సురేశ్ కథానాయకగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
దివ్యశ్రీ, కీర్తన..శభాష్
తల్లి, తండ్రి మృతి చెందిన దుఃఖంలో పరీక్ష రాసి మంచి మార్కులు సాధించిన విద్యార్థినులు కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యామని చెప్పుకోడానికి ఒకరికేమో తల్లిలేదు.. మరొకరికేమో తండ్రి లేడు. పరీక్షల సమయంలో ఈ ఇద్దరు విద్యార్థినిలు ఒకరు త ండ్రిని, మరొకరు తల్లిని కోల్పోయారు. పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసి నేడు మంచి ఫలితాలు సాధించారు. దివ్యశ్రీ జిపిఎ 10కి 10, కీర్తన 8.2 జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరం పోలీస్లైన్లోని పద్మావతి, సుబ్బనరసింహల పెద్ద కుమార్తె దివ్యశ్రీ. నగరంలోని సాయి క్రిష ్ణహైస్కూల్లో పదవ తరగతి చదివింది. ఈమె తల్లి పద్మావతి మార్చి 25న తమ బందువుల ఆమ్మాయికి ఆరోగ్యం బాగా లేకుంటే చెన్నైలోని అపోలో అసుపత్రిలో చూపించుకుని 26వ తేదీ రాత్రి చెన్నై నుంచి వస్తుండగా రాజంపేట సమీపంలో లారీని కారు ఢీకున్న సంఘనటలో మృతి చెందింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలిసిన దివ్యశ్రీ పుట్టెడు దుఖాన్ని దిగమింగుకుని 27న నాగార్జున మోడల్ స్కూల్లోని పరీక్షా కేంద్రానికి హాజరై తెలుగు పరీక్ష రాసింది. అన్ని సబ్జెక్టులలో పదికి పది (జీపీఏ)మార్కులను సాధించి సత్తా చాటుకుంది. తండ్రి ఇకరారని తెలిసి.. కడపలోని నెహ్రునగర్‌కు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి పెద్ద కుమార్తె కీర్తన. జయనగర్‌కాలనీకి చెందిన జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివింది. వెంకట రమణ అనారోగ్యంతో భాదపడుతూ మార్చి 27 తెల్లవారుజామున మృతి చెందాడు. బాగా చదువుకోవాలమ్మా అని తండ్రి తరచూ చెప్పే మాటలను గుర్తు తెచ్చుకుని గుండె నిబ్బరం చేసుకుని నాగార్జున మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రానికి హాజరై పరీక్ష రాసింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 8.2 జీపీఏ సాధించింది. అప్పట్లో పరీక్ష రాస్తున్న కీర్తనను డీఈఓ ప్రతాపరెడ్డి ఓదార్చారు. పై చదువుకు తన వంతు సాయం చేస్తానని కూడా చెప్పారు. అదే సెంటర్లో దివ్యశ్రీ అనే విద్యార్థిని తల్లి కూడా వృుతి చెందిందని తెలియక పోవటంతో అప్పట్లో డీఈఓ పరామర్శించలేకపోయారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థినులిద్దరూ మంచి మార్కులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
పీటలపై ఆగిన పెళ్లి
రెవెన్యూ, ఐసీడీఎస్, పోలీసుల రాకతో కళ్లెంలో బాల్య వివాహానికి బ్రేక్ కళ్లెం(లింగాలఘణపురం) : పెళ్లి పీటల వరకు వచ్చిన బాలిక వివాహం రెవెన్యూ, ఐసీడీఎస్, పోలీస్ అధికారుల రాకతో అర్ధాంతరంగా ఆగి పోరుున సంఘటన మండలంలోని కళ్లెం గ్రా మంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నా యి. మండలంలోని కళ్లెంకు చెందిన కీర్తన యాదగిరి, ఎల్లమ్మ దంపతుల కుమారుడు యాదగిరితో మోత్కూరుకు చెందిన చిటుకూరి రాము లు, రేణుకల కుమార్తి మౌనికకు వివాహం కుది రింది. ఆదివారం ఉదయం 11 గంటల కు వివాహం నిశ్చయం కావడంతో ఇరువురి బంధువులు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహం జరిగే సమయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఐసీడీఎస్ ఆర్జేడీ శైలజకుమారికి ఫోన్ చేసి మైనర్ బాలికకు వివాహం జరుగుతోందని, అడ్డుకోవాలని సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటీ న సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డికి విషయం సమాచారమిచ్చారు. ఆయన ఆదేశాలతో ఎస్సై వెంకటేశ్వర్రావు, ఆర్ఐ శ్రీనివాస్ గ్రామానికి చేరుకుని వివాహాన్ని ఆపివేయాలని ఆదేశిం చారు. పెళ్లి నిలిపివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో అధికారులు వెనుతిరిగారు. ఏసీడీపీఓ వినీత, సూపర్వైజర్ శ్రీలత సంఘటన స్థలానికి వచ్చి బాలికను వారి వెంట తీసుకెళ్లారు. లబోదిబోమన్న బాధితులు వివాహం నిలిచిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ల బోదిబోమంటున్నారు. పెళ్లి కోసం అన్ని సిద్ధం చేసుకున్నామని, భోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని తీరా లగ్నం సమయంలో మైలపోలు తీస్తున్న సందర్భంగా అధికారులు వచ్చి ఆపి వేయడంతో ఆవేదనకు గురయ్యారు. -
కెమేరా వెనక్కి అప్పటి అమృత
సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన మణిరత్నం ‘అమృత’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో బాలనటిగా చేసిన కీర్తన గుర్తురాక మానదు. చిన్న వయసులోనే తన అభినయంతో ఆకట్టుకుంది కీర్తన. ఆ చిత్రానికి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇంతకీ ఈ కీర్తన ఎవరో కాదు.. తమిళ నటుడు పార్తీబన్, నటి సీత దంపతుల కుమార్తె. ఒకే ఒక్క చిత్రంలో మెరిసిన కీర్తన ఆ తర్వాత చదువుకు అంకితమైంది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఎలాగూ చిన్నప్పుడు నటించింది కదా.. ఇక కథానాయికగా రంగప్రవేశం చేస్తుందని చాలామంది ఊహించారు. కానీ, కీర్తన కలలు వేరేలా ఉన్నాయి. దర్శకురాలు కావాలన్నది ఆమె ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చుకునే దిశలో తొలి అడుగు వేసేసింది. తమిళ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా త్వరలో దర్శకత్వం వహించనున్న ఓ చిత్రానికి ఆమె సహాయ దర్శకురాలిగా చేరింది. కొంత అనుభవం సాధించాక దర్శకురాలిగా రంగప్రవేశం చేయాలనుకుంటోంది. కీర్తన తండ్రి పార్తీబన్ మంచి నటుడే కాదు, దర్శకునిగా కూడా నిరూపించుకున్నారు. ఇప్పుడు కీర్తన కూడా తండ్రిలానే మంచి డెరైక్టర్ అనిపించుకోవాలనుకుంటోంది. -
దర్శకత్వమే లక్ష్యం
దర్శకత్వమే లక్ష్యం అంటుంది నటుడు, దర్శకుడు పార్తిపన్ వారసురాలు కీర్తన. ఈమె మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రం ద్వారా బాల నటిగా పరిచయమయ్యూరు. ఆ తరువాత ఈమె హీరోయిన్గా తెరంగేట్రం ఖాయం అని చాలా మంది భావించారు. అయితే కీర్తన నటనపై ఆసక్తి కనబరచడంలేదు. ప్రస్తుతం కీర్తన తండ్రి పార్తిపన్ కదై తిరైకథై వచనం ఇయక్కం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కీర్తన సహ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించకుండా నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. అయితే తన లక్ష్యం మాత్రం మెగా ఫోన్ పట్టడమేనంటోంది. అరణ్య కాండం చూసినప్పటి నుంచి ఆ చిత్ర దర్శకుడు త్యాగరాజ కుమార్ రాజా వద్ద శిష్యరికం చేయాలనే కోరిక కలిగిందట. ఈ విషయాన్ని తన తండ్రి పార్తిపన్కు విన్నవించుకోగా ఆయన వెంటనే త్యాగరాజా కుమార్‌రాజాతో మాట్లాడి ఆయన వద్ద సహాయ దర్శకురాలిగా చేర్చారట. అయితే హీరోయిన్గా రంగ ప్రవేశం చేసే ఆలోచన లేదా అంటే క్రియేటివ్ దర్శకురాలిగా పేరు తెచ్చుకుంటానంటోంది కీర్తన. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు సరైన సమయం రాగానే బాధ్యతలను చేపడతానని కీర్తన అంటోంది. -
ఐదు నిమిషాల్లో కథ చెప్పమన్నారు...:గీతాకృష్ణ
తొలియత్నం అతడు పదం. ఆమె పాదం. అతడు గానం. ఆమె ప్రాణం. అతడు పాటై ఎగిసినప్పుడు ఆ కెరటాలకు ఆమె అందెల. ఆమె నాట్యానికి అతని పదం ఆది తాళం. సముద్రం దిగంతమై, కళ అనంతమైనప్పుడు కళకు ఆమె చేసే నివేదన నాట్యం. ప్రకృతికి అతడి అభిషేకం కవిత్వం. ఇద్దరు కళాకారుల ఆధ్యాత్మిక ప్రేమకు దృశ్యకవి గీతాకృష్ణ వెండితెరపై చేసిన కళార్చన ఈ సంకీర్తన. అసిస్టెంట్‌గా అంటూ చేస్తే బాలచందర్, బాపు, విశ్వనాథ్ వీళ్ల దగ్గరే చేయాలి. లేకపోతే పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్. ఇదీ లెక్క. బాలచందర్‌గారిని కలిస్తే నేనిప్పుడే తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగు సినిమా చేసినప్పుడు తప్పక తీసుకుంటాను. నెక్స్ట్ బాపుగారు. నేనిప్పుడు హిందీ సినిమా చేస్తున్నాను, తెలుగు సినిమా చేసినప్పుడు కలువు. ఇక మిగిలింది విశ్వనాథ్‌గారు. నాకు బాగా తెలిసిన కె.వాసు (ప్రాణం ఖరీదు, కోతలరాయుడు వంటి హిట్ చిత్రాల దర్శకుడు)గారి ద్వారా విశ్వనాథ్‌గారిని కలిశాను. అప్పట్లో అది కాన్ఫిడెన్సో, యారగెన్సో తెలియదు. నేను మీ దగ్గర మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేస్తాను. ఆ తరువాత డెరైక్ట్‌గా సినిమా డెరైక్షన్ చేస్తానన్నాను. విశ్వనాథ్‌గారు సరేనన్నారు. ‘సాగరసంగమం’ ఆయనతో అసోసియేషన్ ప్రారంభమైంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు రష్యాలో ఒక ఫిలిం ఫెస్టివల్లో విశ్వనాథ్‌గారి రెట్రాస్పెక్టివ్ కోసం అక్కడి నుంచి ఒక టీమ్ వచ్చింది. వాళ్లకు విశ్వనాథ్‌గారి సినిమాలు చూపిస్తూ, వాటి థీమ్‌ను వివరించడం నా పని. చెన్నయ్‌లో ఆండాళ్ ప్రొడక్షన్స్ అధినేత రామ అరంగణళ్కు సంబంధించిన ఆండాళ్ థియేటర్ బుక్ చేశాం. వాళ్లకు ఒక్కో సినిమా చూపిస్తూ, ప్రతి రెండు రీళ్లకు ఒకసారి సినిమా ఆపి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇదంతా గమనించిన అక్కడి మేనేజర్ కృష్ణమూర్తి నా గురించి అరంగణళ్గారికి చెప్పారు. ఇది గడిచిన కొంతకాలానికి వాళ్ల నుంచి నాకు ఫోన్ వచ్చింది. సినిమా చేస్తావా అని అడిగారు. ఎందుకు చేయను, అందుకోసమే కదా వచ్చింది అన్నాను. రామ్ అరంగణళ్గారిని కలవగానే నా చేతిలో ఫైల్స్ చూసి ఏంటివన్నీ అని అడిగారు. నేను తయారుచేసుకున్న సబ్జెక్ట్స్ అన్నా. మొదట అవన్నీ పక్కన పెట్టు అన్నారు. మొదట నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాల్లో చెప్పడం నేర్చుకో. అందుకు కావాలంటే ఇంకో అయిదు నెలలు తీసుకో. ఎందుకంటే నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాలకు మించి చెపితే అవతలివాళ్లకు నిద్ర వచ్చే ప్రమాదముంది. అయిదు నిమిషాల కథను తెరమీద మూడు గంటల్లో చెప్పడం తరువాత పని అన్నారు. అయితే నాకు ఒక గంట టైమ్ కావాలని అడిగాను. సరేనని నాకో గది కేటాయించారు. గంట తరువాత కలిసి పది నిమిషాల్లో రెండు కథలు వినిపించాను. నీ వయసుకు మించిన కథలు చెప్పావని మెచ్చుకున్నారు. అందులో ఒక కథలో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ల మధ్యకు మరో చిన్న బాబు రావడమనే కథ ఆయనకు చాలా నచ్చింది. అయితే అది మ్యాన్ ఉమన్ అండ్ ఏ ఛైల్డ్ అనే నవల నుంచి తీసుకున్నానని, అది హాలీవుడ్లో క్రామర్ వర్సెస్ క్రామర్ అనే సినిమాగా వచ్చిందని చెప్పాను. దాని ఆధారంగా శేఖర్‌కపూర్ మాసూమ్, బాలూమహేంద్ర మలయాళంలో ఓలంగళ్ తీశారని చెప్పాను. అయినా మనం చేద్దామన్నారాయన. నేను విశ్వనాథ దగ్గర మూడు సినిమాలు చేస్తానని మా అన్నకు మాట ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు సినిమా చేయలేనన్నాను. కానీ నాకిదో గొప్ప అనుభవమని చెప్పి వచ్చేశాను. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ చేస్తున్నప్పుడు కమలహాసన్, నేను చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. ‘స్వాతిముత్యం’ మధ్యలో ఉన్నప్పుడు మా ఊరి పక్కన కడియానికి చెందిన గిరిజాల కృష్ణారావు, డాక్టర్ గంగయ్యను పరిచయం చేశారు. ఆయన సినిమా చేద్దాం కధ చెప్పమనగానే రెండు కథలు వినిపించాను. మన్మథ పూజారి, సంకీర్తన కథల్లో రెండవది ఆయనకు బాగా నచ్చింది. విశ్వనాథ్‌గారికి చెబితే సరే అన్నారు. తరువాత ‘స్వాతిముత్యం’ శత దినోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ వేదిక మీదే విశ్వనాథ్‌గారి శిష్యుడు, దర్శకుడు కాబోతున్నారని ప్రకటించారు. హీరో కాశీ పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా సచిత్ర వారపత్రికలో కవర్‌పేజీలో ఒక యువకుడి ఫొటో చూశాను. కింద అక్కినేని వారసుడు నాగార్జున హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నాడని వార్త. అది పట్టుకెళ్లి కమలహాసన్‌కు చూపించాను. ఎవరితను అని అడిగాడు. నాగేశ్వరరావుగారి అబ్బాయి అనగానే బావున్నాడన్నారు. తరువాత నాగేశ్వరరావుగారిని కలిసి కథ చెప్పాను. పొయెటిక్‌గా ఉంది, కొంచెం దృష్టి పెడితే చాలా బాగా వస్తుందన్నారాయన. అప్పటికే నాగేశ్వరరావుగారి నిర్మాతలు నాగార్జునతో సినిమాలు వరుసగా ప్రకటిస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో విక్రమ్ మొదలైంది. విక్రమ్ ఒక షెడ్యూల్ అయ్యాక, సంకీర్తన మొదలైంది. హీరోయిన్ కీర్తన పాత్ర కోసం చాలామందిని చూశాం. శోభన ,అమల ఇంకా చాలా మందిని అనుకున్నా రకరకాల కారణాల వల్ల కుదరలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి రామారావుగారి ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఫిల్మోత్సవ్ జరుగుతోంది. అందులో ప్రారంభోత్సవ నృత్యానికి నేను వెళ్లాను. స్టేజ్ మీద ఒక యాభై మంది డ్యాన్సర్స్ ఉన్నారు. అందులో ఒకమ్మాయి నన్ను ఆకర్షించింది. కార్యక్రమ నిర్వాహకురాలు రాజసులోచనగారిని కలిస్తే తన పేరు రమ్యకృష్ణ అని చెప్పింది. అడ్రెస్ తీసుకుని ఫొటో షూట్ చేసి తనను ఎంపిక చేసుకున్నాం. తను అంతకుముందు ఒక సినిమాలో ఏదో చిన్న పాత్ర చేసినా, పూర్తి స్థాయిలో హీరోయిన్గా తనకిదే మొదటి సినిమా. మిగతా ముఖ్యపాత్రల్లో గిరీష్ కర్నాడ్, సోమయాజులును తీసుకున్నాం. నిజానికి కథ రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూళ్లో జరుగుతుంది. కానీ రాజమండ్రి, పోలవరం, పట్టెసీమ, దేవీపట్నం ఇలా చాలా ప్రాంతాల్లో చిత్రించాం. గడప లోపల ఒక ఊరు, గడప దాటితే మరో ఊరు. ఇలా చాలా ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. ఇందులో హీరో, హీరోయిన్ మొదటిసారి కలిసినప్పుడు తీసిన సీన్ కోసం మాత్రం చాలా శ్రమపడ్డాం. ఉదయం పూట కీర్తన నదికి నీళ్లకోసం వచ్చినప్పుడు కాశీ పడవలో పడుకుని ఉంటాడు. అందెల శబ్దం విని లేచి మొదట ఆకాశంలో పక్షులను చూస్తాడు. తరువాత కీర్తనను చూస్తాడు. అలవోకగా ఒక కవిత చెబుతాడు. ఈ సీన్లో పక్షులు, నది, అవసరమైన క్లోజప్స్, ఇంటర్‌కట్స్ తీసిన తరువాత కీర్తన సజెషన్లో కాశీ, అతడి సజెషన్లో కీర్తన షాట్స్, వాళ్లిద్దరి వైడ్ షాట్స్ తీయాలి. అందుకు స్థానికంగా ఉన్న జాలరిని పిలిచి, బోట్ ఏ యాంగిల్లో ఉంచాలని చెబుతున్నప్పుడు అర్థం కాక, అతను కొంత అసహనం వ్యక్తం చేశాడు. దాంతో ఆర్టిస్టులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఆ సీన్ వాయిదా వేశాం. షూటింగ్ పూర్తయ్యేలోపు ఆ సీన్ తీయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక అవాంతరం వచ్చేది. చివరికి మద్రాస్ దగ్గర ఎన్నూర్ టూరిస్ట్ ప్లేస్‌లో బ్యాక్‌వాటర్‌లో ఈ సీన్ తీశాం. అది పూర్తయ్యేసరికి ఇంకో సినిమా తీసినంత పనయింది. ఇలా ఎన్నో చోట్ల షూటింగ్ చేసినా అంతా ఒకే దగ్గర తీసినట్టు అనిపించడానికి కారణం, స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్ మీద అవగాహన ఉండటం. ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇళయరాజా సంగీతం గురించి. తను ఒకరోజు పదిహేను ట్యూన్స్ ఇచ్చాడు. నాకు మరీ అంత సంప్రదాయకంగా కాదు, సెమీ క్లాసికల్ కావాలన్నాను. తరువాత తను ముప్ఫై తొమ్మిది ట్యూన్స్ ఇచ్చాడు. అందులోంచి తొమ్మిది సెలక్ట్ చేసుకుని, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, వేటూరితో పాటలు రాయించాను. తనికెళ్ల భరణి కథను అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా మాటలు రాశారు. సినిమా చూసిన నాగేశ్వరరావుగారు చాలా బాగా తీశావు కానీ, ఈ సినిమా ప్రేక్షకులు నచ్చకపోతే మళ్లీ భవిష్యత్తులో మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేయకు అన్నారు. సినిమా చూసిన సెన్సార్‌వాళ్లు టైటిల్స్ చూడకపోతే, ఇది విశ్వనాథ సినిమా అనుకోవచ్చు అన్నారు. నేనది కాంప్లిమెంట్‌లా ఫీలయ్యాను. కొన్ని రోజులు ఆ ఆనందంలో తేలియాడాను. ఒకరోజు ఇళయరాజాగారు నాతో నువ్వు, వంశీ విశ్వనాథ్‌లా తీస్తారన్న పేరు తెచ్చుకుంటే ఏం ఉపయోగం. నీదైన మార్క్ కోసం ప్రయత్నించు అన్నారు. ఆ మాట నాపై తీవ్ర ప్రభావం చూపించి, నా సినిమా శైలిని, ఆలోచనా విధానాన్నీ మార్చేసింది. సినిమాలో పాట అనేది సంభాషణలా ఉండాలనేది నా ఫీలింగ్. అదే పద్ధతిలో సంకీర్తన పాటల రూపకల్పన జరిగింది. ఈ సినిమాలో ప్రతి మాటా ఒక చిన్న పాటలా కవితాత్మకంగా ఉంటుంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి