బాలిక ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామానికి చెందిన బత్తల మల్లికార్జున, మునిలక్ష్మి దంపతులు నిరుపేదలు. మల్లికార్జున కూలీ పనికి వెళ్తుంటాడు. వారికి ముగ్గురు కుమార్తెలు. కీర్తన చివరి సంతానం. స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 10 ఏళ్ల కీర్తనకు పెద్ద కష్టం వచ్చింది. కొన్ని నెలల క్రితం ముఖంలో గడ్డలు ఏర్పడి వాపు వచ్చింది. తగ్గుతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ వాపు కాస్త ముఖమంతా ఎక్కువగా వ్యాపించింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ వచ్చారు. చాలా ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు.
ఆదుకున్న ఎమ్మెల్యే
ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాలిక తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నెల్లూరులోని మెడికోవర్ ఆస్పత్రికి పంపించారు. అన్ని రకాల పరీక్షలు చేసి దవడ ఎముక లోపలి భాగంలో క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆపరేషన్ చేయిస్తే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.10 లక్షలు మేర ఖర్చు అవుతుందని తెలపడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంత డబ్బు భరాయించే స్థోమత తమకు లేదని రోదించసాగారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.
రెండు రోజుల్లో ఆపరేషన్
చిన్నారి కీర్తన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మీడియాకు వెల్లడించారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పారన్నారు. ముగ్గురు వైద్యులు కలిసి ఆపరేషన్ చేయనున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం చేయాలని తాను కోరిన మేరకు వైద్యులు రూ.6 లక్షలకు అంగీకరించారన్నారు.
కొంత డబ్బు కుటుంబ సభ్యులు పెట్టుకుంటామని చెప్పారని, మిగతా రూ.5 లక్షలు లేదా అంతకు ఎక్కువైనా తానే భరాయిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ నిమిత్తం బుధవారం కీర్తనను ఎమ్మెల్యే నెల్లూరుకు పంపించారు. అడ్మిట్ అయిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారన్నారు. పేదరికంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుకు కీర్తన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: (ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు)
Comments
Please login to add a commentAdd a comment