సంగీత దర్శకుడిగా శ్రీశాంత్?
పైకి ఎదిగినంత వేగంగానే వివాదాలతో కెరీర్‌లో వెనుకపట్టు పట్టిన భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. ఐ.పి.ఎల్. పోటీలలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు గాను నిషేధానికి గురైన ఈ యువకుడు దాదాపుగా క్రికెట్‌కు దూరమైనట్లే. ఒకవైపు తాను అమాయకుడినంటున్న ఈ కులాసా కుర్రాడు ప్రస్తుతం ఇతర వ్యాపకాల వైపు ఆలోచన మళ్ళించినట్లు కనిపిస్తోంది. విందులు, వినోదాలు, ఇతర కార్యక్రమాల్లో ఇప్పటికే ఆటపాటల్లో ప్రతిభ చూపెట్టిన శ్రీశాంత్ తాజాగా పాటలకు బాణీలు కట్టడానికి సిద్ధమవుతున్నాడట! తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘అణ్బుళ్ళ అళగే’ చిత్రానికి ఈ కళంకిత క్రికెటర్ పాటలు రాస్తున్నారనీ, బాణీలు కడుతున్నారనీ కోడంబాకమ్ కబురు.
ఈ వినోదాత్మక ప్రేమకథా చిత్రంలో శ్రీశాంత్ బావ మధూ బాలకృష్ణన్ ఓ పాట పాడుతున్నారట. ఆ మాటకొస్తే, శ్రీశాంత్‌కు ఈ కళాపోషణ కాస్త ఎక్కువే. గతంలో ఓ కార్యక్రమంలో హిందీ తారలతో కలసి నర్తించిన అనుభవం అతనికి ఉంది. అలాగే, తాజాగా టీవీ రియాలిటీ షో ‘ఝలక్ దిఖ్లాజా’లో కూడా శ్రీశాంత్ పాల్గొంటున్నాడు. ఆ కార్యక్రమం కోసం తన డ్యాన్స్ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. అయితే, సినిమాకు శ్రీశాంత్ సంగీత దర్శకత్వం గురించి అధికారికంగా ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు. ‘‘శ్రీ ఇప్పుడు ముంబయ్‌లో ‘ఝలక్ దిఖ్లా జా’కు డ్యాన్స్ ప్రాక్టీస్‌లో ఉన్నాడు’’ అని అతని సోదరుడు దీపూ శాంత్ చెబుతున్నారు. పాటలు రాయడం, బాణీలు కట్టడమనేది నిజమైతే, శ్రీశాంత్ మరోసారి వార్తల్లో నిలిచినట్లే!