టీమిండియా సీనియర్ బౌలర్ శ్రీశాంత్ ఈసారి ఐపీఎల్ మెగావేలంలో పాల్గొననున్నాడు. తన కనీసం ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించిన శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందో చూడాలి. అయితే శ్రీశాంత్ మాత్రం తన బౌలింగ్‌లో పదును తగ్గలేదని.. తనను పరిగణలోకి తీసుకోవాలంటూ ఫ్రాంచైజీలకు హెచ్చరికలు పంపాడు. కాగా ఏడేళ్ల నిషేధం తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్న శ్రీశాంత్ కేరళ రంజీ జట్టులోకి ఎంపికయ్యాడు. రెండేళ్ల తర్వాత జరగనున్న రంజీ ట్రోఫీలో శ్రీశాంత్ పాల్గొననుండడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వేలంలో ఎంపికైతే.. తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు రంజీ సీజన్ చక్కని అవకాశమే అని చెప్పొచ్చు. తాజాగా శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోనూ షేర్ చేశాడు. 2002లో శ్రీశాంత్ కేరళ తరపున తొలిసారి రంజీ ఆడిన మ్యాచ్ వీడియో అది. ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ''నా పదును ఇంకా తగ్గలేదు.. నన్ను పరిగణలోకి తీసుకోండి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఇక ఐపీఎల్ మెగావేలం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. కాగా ఈసారి వేలంలోకి 590 మంది క్రికెటర్లు రాగా.. అందులో 228 క్యాప్డ్, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఇక రిటెన్షన్‌లో భాగంగా 33 మందిని ఆయా జట్లు అట్టిపెట్టుకున్నాయి. ఇక వేలంలో 217 మందికి అవకాశం ఉండగా.. 590 మంది పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment