![Sridevi Death Probe Closed, Says Dubai Public Prosecutor - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/27/sridevi_4.jpg.webp?itok=_BpybYRQ)
దుబాయి : ఎట్టకేలకు ప్రముఖ నటి శ్రీదేవి కేసు ముగిసింది. ఓ పక్క ఆమె హఠాన్మరణమే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా ఆమె చనిపోవడానికి గల కారణాలపై వచ్చిన కథనాలు అనుక్షణం సంచలనాన్ని రేపాయి. ఎన్నోమలుపులు, ఎన్నో అనుమానాల చుట్టూ తిరిగి చివరకు ప్రమాదవశాత్తు జరిగినా మరణం తప్ప ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని దుబాయ్ ప్రాసీక్యూషన్ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. శనివారం రాత్రి 11 దాటిని తర్వాత శ్రీదేవి హఠాన్మరణం చెందారు. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయారని తొలుత అనుకున్నారు.
అయితే, ఆమెకు పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమె ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఊపిరి ఆడక చనిపోయారని తేల్చేశారు. ఆమె దేహంలో ఆల్కహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారీ టబ్‌లో పడిపోయి ఉంటారని, ఆ క్రమంలోనే ఊపిరి ఆడక చనిపోయారని అన్నారు. అయితే, ఈ క్రమంలో బోనీ కపూర్‌ను కొన్ని గంటలపాటు మూడుసార్లు విచారించడం, ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు తొలుత ప్రాసీక్యూషన్ అధికారులు అంగీకరించకపోవడంతో బహుశా ఏవో బలమైన కారణాలే ఆమె చావుకు కారణం అయి ఉంటాయని భిన్న కథనాలు మరోసారి వేగం పుంజుకున్నాయి.
ఆమె బాత్ టబ్‌లో అనుకోకుండా పడ్డారా? ఎవరైనా తోసేశారా? లేకుంటే ఏవైనా సమస్యలతో శ్రీదేవినే బలవన్మరణానికి పాల్పడ్డారా? బోనీ కపూర్ ఇండియాకు వచ్చి మళ్లీ సర్‌ప్రైజ్ పేరుతో దుబాయ్ వెళ్లడం ఏమిటి? ఆయన వెళ్లిన తర్వాత శ్రీదేవి చనిపోవడం ఏమిటి? పోలీసులు స్వాధీనం చేసుకున్న బోనీ కపూర్ కాల్ డేటాలో ఏమున్నాయి? ఆయన ఎవరితో మాట్లాడారు? శ్రీదేవి చివరి సారిగా ఎవరితో మాట్లాడారు? ఎక్కువగా ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేశారు? అంటూ దాదాపు దర్యాప్తు బృందం లేవనెత్తెన్ని అనుమానాలతో మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. అయితే, వాటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ దర్యాప్తు క్లియర్ అయిందని, ఇక ఎలాంటి అనుమానం లేదని, ఆమె అనుకోకుండా బాత్‌డబ్‌లో పడి ఊపిరి ఆడక చనిపోయారంటూ దుబాయ్ విచారణ అధికారులు తేల్చేయడంతో ఇక శ్రీదేవిని భారత్‌కు తీసుకురావడం, ఆమె అంత్యక్రియలకు సంబంధించిన అంశాలు మాత్రం మిగిలి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment