దుబాయ్: సినీ వినీలాకాశంలో అతిలోకసుందరిగా అందరి మన్ననలు అందుకున్న శ్రీదేవి ఊహించనివిధంగా శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. బోనికపూర్ మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం రస్ ఆల్ ఖైమాకు వెళ్లిన ఆమె శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
అకస్మాత్తుగా గుండెపోటు
పెళ్లిలో అప్పటివరకు సంతోషంగా గడిపిన శ్రీదేవికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బాత్రూమ్‌లో పడిపోయి అపస్మారస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను బంధువులు వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని భారత కాన్సులేట్ జనరల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
బోని పక్కనుండటం అదృష్టం..
శ్రీదేవి చివరిశ్వాస విడిచే సమయానికి భర్త బోనికపూర్, కుమార్తె ఖుషి.. ఆమె పక్కనే ఉండటం అదృష్టమని సన్నిహితులు వ్యాఖ్యానించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పెళ్లి వేడుకలు పూర్తైన తర్వాత కుమార్తెతో పాటు బోనికపూర్ ముంబై తిరిగి వెళ్లాల్సివుంది. శ్రీదేవి తన సోదరి శ్రీలతతో పాటు కొద్దిరోజులు దుబాయ్‌లో ఉండాలని అనుకున్నారు. బోనికపూర్ ముంబై వెళ్లిపోయివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయం వేస్తోందని సన్నిహితులు పేర్కొన్నారు.
దుబాయ్‌కు వెళ్లేముందు ముంబై విమానాశ్రయంలో బోనికపూర్, శ్రీదేవి, ఖుషి (యోగేన్ షా ఫొటో)
ముంబైలో ఒంటరిగా జాహ్నవి
శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ షూటింగ్ కారణంగా దుబాయ్‌కు వెళ్లలేదు. శశాంక్ ఖైతాన్ ‘దడక్’ సినిమాలో బిజీగా ఉండడంతో తల్లితో పాటు వెళ్లలేకపోయింది. తన తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన అంధేరీలోని తన నివాసానికి చేరుకుంది. ఒంటరిగా ఉన్న ఆమెను బంధువులు, సన్నిహితులు ఓదారుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకు తరలించే అవకాశముంది.
కేన్సర్ వదంతులు..
శ్రీదేవి ఆరోగ్యంపై గతంలో వదంతులు వచ్చాయి. శ్రీదేవికి కేన్సర్ ఉందని 2010-11 మధ్యకాలంలో సమాచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎనిమిదేళ్లుగా శ్రీదేవి.. హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment