భారతీయ సినీ చరిత్రలో అతిలోకసుందరిగా ఓ వెలుగువెలిగిన అందాల తార శ్రీదేవి (54) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. దుబాయ్ లో ఓ పెళ్లి వేడుకకు కుటుంబసభ్యులతో కలిసి హాజరైన ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు. శ్రీదేవి మరణ వార్తతో సినీ ప్రపంచం మూగబోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
అతిలోక సుందరిగా వెండితెరను ఏలిన శ్రీదేవి.. 1963, ఆగస్టు 13న శివకాశిలో జన్మించారు. నాలుగేళ్ల పసి ప్రాయంలో తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన శ్రీదేవి, 1969లో తునైవన్ సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగానే పలు చిత్రాల్లో మురుగన్‌గా, కృష్ణుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ బాలనటిగా కనిపించారు శ్రీదేవి.
అనురాగాలు, మూండ్రు ముడిచ్చు సినిమాలలో హీరోయిన్‌గా నటించినా.. భారతీరాజ దర్శకత్వంలో తెరకెక్కిన పదునారు వయదినిలే సినిమాతోనే శ్రీదేవికి హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు రీమేక్ కె.రాఘవేంద్రరావు తెలుగులో రూపొందించిన పదహారేళ్ల వయసు సినిమాతో టాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. పదహారేళ్ళ వయసులో అందాలతారగా అలరించిన శ్రీదేవిని స్టార్ హీరోయిన్ గా నిలిపిన చిత్రం వేటగాడు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి తరువాత ఏడేళ్లకు ఆయన సరసనే హీరోయిన్‌గా నటించి మెప్పించారు.
వేటగాడుతో విజయం సాధించిన యన్టీఆర్, శ్రీదేవి జంట తరువాత వరుసగా నాలుగేళ్ల పాటు వెండితెరపై వరుస విజయాలను నమోదు చేసింది. అక్కినేని నాగేశ్వరరావుతో ఆమె నటించిన ప్రేమాభిషేకం, బంగారు కానుక, శ్రీరంగనీతులు లాంటి సినిమాలు అభిమానుల మదిలో నిలిచిపోయాయి. ఆ తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలందరితోనూ సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి తరువాతి తరం హీరోలయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తోనూ విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
చిరంజీవికి జోడిగా రాణీకాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్‌పీ పరుశురాం లాంటి తెలుగు సినిమాలతో పాటు చిరు హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా లాంటి సినిమాల్లో నాగార్జునతో.. క్షణ క్షణం సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించి మెప్పించారు. అదే సమయంలో బాలీవుడ్ లో అడుగు పెట్టిన శ్రీదేవి అక్కడ కూడా తన హవాను కొనసాగించారు.
1975లో జూలీ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీదేవికి హిమ్మత్ వాలా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ దక్కింది. హిమ్మత్ వాలా తరువాత బాలీవుడ్ స్టార్ హీరోలకు హాట్ ఫేవరెట్‌గా మారిన శ్రీదేవి వరుస విజయాలతో ఇండియన్ టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. నెమ్మదిగా దక్షిణాదికి దూరమై పూర్తిగా బాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యారు. 250కి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. భారతీయ అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగు 85, తమిళం 72, మళయాలం 26, హిందీ 71 సినిమాల్లో నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2013లో శ్రీదేవిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
పెళ్లయ్యాక సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చారు శ్రీదేవి. లాంగ్ గ్యాప్ తరువాత పూర్తి స్థాయి పాత్రలో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం తరువాత వెండితెర మీద కనిపించినా తన నటనలో గ్రేస్ తో పాటు తన ఫాలోయింగ్ కూడా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. రీ ఎంట్రీలో నటిగా ఆకట్టుకున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయారు. చివరగా మామ్ సినిమాలో కనిపించిన శ్రీదేవి విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం జీరో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న శ్రీదేవి మరణం సినీ జగత్తుకు తీరని శోకాన్ని మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment