28 ఏళ్ల తరువాత తెరపైకి అతిలోకసుందరి | Sridevi to play a princess in a Tamil period drama co-starring superstar Vijay | Sakshi
Sakshi News home page

28 ఏళ్ల తరువాత తెరపైకి అతిలోకసుందరి

Published Sun, Jun 8 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

28 ఏళ్ల తరువాత తెరపైకి అతిలోకసుందరి

28 ఏళ్ల తరువాత తెరపైకి అతిలోకసుందరి

 అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అనేదొక కాలం. బహుశా నటి శ్రీదేవి లాంటి అందాల రాశిని చూసే ఆ కవి హృదయం అలా స్పందించి ఉంటుంది.  ఇప్పటికీ శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రకాశిస్తున్నారు. బాలనటిగా తమిళ, తెలుగు సినిమాల్లో అడుగులు వేసిన ఈ బ్యూటీ తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. అయినా తన కీర్తి దాహం తీరక ఉత్తరాది చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. అక్కడా హీరోయిన్‌గా తన హవా కొనసాగించారు. అప్పటికీ నటిగా కాస్త సంతృప్తి చెందిన శ్రీదేవి 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. 1997లో నటనను దూరంగా పెట్టి మాతృమూర్తి దశకు చేరారు.
 
 కుమార్లె జాహ్నవి, ఖుషి సంరక్షణ బాధ్యతలతో తల్లిగా పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన శ్రీదేవి మళ్లీ నటనపై దృష్టి సారించారు. 2012లో హిందీలో ఇంగ్లీషు వింగ్లీష్ చిత్రం కోసం ముఖానికి రంగేసుకున్నారు. ఈ చిత్రం మంచి ప్రజాదరణ పొందింది. శ్రీదేవిలోని చెక్కు చెదరని అందాలకు ఆమె అభిమానులు ముగ్ధులయ్యారు. దీంతో శ్రీదేవి ఎవర్‌గ్రీన్ హీరోయిన్ అనేది మరోసారి రుజువయ్యింది. ఆ చిత్రం తెరపైకి వచ్చి రెండేళ్లయింది. ఈ లోపు ఆమెను నటింప చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అలాంటి వారందరికీ చిరునవ్వే జవాబుగా చెప్పుకుంటూ వచ్చిన శ్రీదేవి తాజాగా తమిళ తెరపై మరోసారి మెరవడానికి సిద్ధం అవుతున్నారు.
 
 అంటే 28 ఏళ్ల తరువాత ఈ అందాల రాశి తమిళ చిత్రంలో నటించనున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో శ్రీదేవి యువరాణిగా ముఖ్య భూమికను పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ ధృవపరచారు. విజయ్ హీరోగా నటించనున్న చిత్రంలో శ్రీదేవి నటిస్తున్నారు. ఇంతకంటే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను అని బోనీకపూర్ పేర్కొన్నారు. శ్రీదేవి తమిళంలో చివరిగా రజనీకాంత్ సరసన నాన్ అడిమై ఇల్లై చిత్రంలో నటించారన్నది గమనార్హం. మలయాళంలో ఈ సుందరి నటించిన చివరి చిత్రం దేవరాగం. శ్రీదేవి ఆ మధ్య నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ తమిళం, తెలుగు భాషల్లోనూ అనువాదం అయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement