ప్రమాదం నుంచి జస్ట్ మిస్...
చల్ల చల్లని కూల్ కూల్ అంటూ ఏసీ వేసుకుని హాయిగా సేద తీరుతుంటాం. కానీ, టైమ్ బాగా లేకపోతే అదే ఏసీ ఒక్కోసారి వేడి పుట్టించేస్తుంది. అప్పుడు మాత్రం టెన్షన్ పడక తప్పదు. శనివారం శ్రీదేవి ఇంటిల్లిపాదినీ ఆమె పడకగదిలోని ఏసీ అలానే టెన్షన్‌లో పడేసింది. అందులోంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయట. ఆ సమయంలో ఇంట్లో తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషి, తన అత్తగారితో ఉన్నారట శ్రీదేవి.
సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందట. ఇంటికి కిలోమీటర్ దూరంలోనే బోనీకపూర్ ఆఫీసు ఉండటంతో, ఆయన అగ్నిప్రమాదం గురించి తెలుసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారట. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. దీనివల్ల శ్రీదేవి ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సమాచారం. దాంతో ఆ రాత్రి ఈ కుటుంబం ఓ హోటల్‌లో బస చేశారట.