విజయం.. గౌరవం... రెండూ దక్కాయి
విజయం.. గౌరవం... రెండూ దక్కాయి
Published Mon, Aug 8 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. యువతరం అభిరుచులకు తగ్గట్టు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన పరశురామ్ (బుజ్జి) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పరశురామ్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘శ్రీరస్తు శుభమస్తు’కి లభిస్తున్న స్పందనపై మీ అనుభూతి?
ఓ మంచి కథ చెప్పారంటూ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. విజయంతో పాటు దర్శకుడిగా నాకు గౌరవం తీసుకొచ్చిన చిత్రమిది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కథలు ప్రేక్షకులకు చేరువైనప్పుడు ఎనర్జీ వస్తుంది. లేదంటే ఇంత కష్టపడ్డా ఫలితం రాలేదని మూస కథలు వైపు వెళ్లాలనిపిస్తుంది. కానీ, ప్రేక్షకులు తమకు మంచి అభిరుచి ఉందని నిరూపించారు. ఓ దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది? చెప్పండి.
అల్లు శిరీష్ కోసమే ఈ కథ రాశారా?
అవునండి. సిరి (అల్లు శిరీష్)తో ముందు మరో సినిమా తీయాలనుకున్నాను. ‘హిట్ సినిమా కాదు, నా కెరీర్‌లో గుర్తుండే ఓ మంచి సినిమా కావాలి’ అని సిరి అడిగాడు. తిరుపతిలో దేవుణ్ణి దగ్గర్నుంచి చూసే సన్నివేశం స్ఫూర్తితో అప్పుడీ కథ రాశా. నా కథను నమ్మి అల్లు అరవింద్, సిరిలు ఎంతో ప్రోత్సహించారు.
ఓ టీచర్‌లా పరశురామ్ నాకు చాలా విషయాలు నేర్పారని అల్లు శిరీష్ అన్నారు..
శిరీష్ సంస్కారం అది. కథ రాసి, సినిమా తీయడానికి నేను పడిన కష్టం కంటే నటుడిగా అతను పడ్డ కష్టమే ఎక్కువ. పాత్రకు అనుగుణంగా తనను తాను మలచుకున్నాడు. ‘మీకెలా కావాలో చెప్పండి, నటిస్తా’ అన్నాడు. నేనెంత చెప్పినా తెరపై చేసింది అతనే కదా. క్లైమాక్స్ సీన్స్ తీసే టైమ్‌కి మా ఇద్దరికీ బాగా సింక్ అయ్యింది. చాలా సహజంగా నటించాడు. లావణ్యా త్రిపాఠి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు.
దర్శకుడిగా కంటే మాటల రచయితగానే ఈ చిత్రం మీకు ఎక్కువ పేరు తెచ్చినట్లుంది?
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ అంటూ విడదీసి చూడడం నాకు తెలియదు. కథతో పాటు సహజంగా ఉండేలా మాటలు రాస్తాను. ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోను. గతంలో రైటర్ కమ్ డెరైక్టర్స్ పూరి జగన్నాథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ వద్ద పనిచేయడంతో ఆ పద్దతి అలవాటయింది.
‘బొమ్మరిల్లు’తో మీ సినిమాను పోల్చడం గురించి?
నేపథ్యం ఒక్కటే కావొచ్చు కానీ, భావోద్వేగాల్ని వ్యక్తం చేసిన విధానం వేరు. ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’తో చిరంజీవిగారు పోల్చినప్పుడు చాలా సంతోషమేసింది. నాపై పూరి, భాస్కర్‌ల ప్రభావం ఉంది. గురువుగారి హిట్ సినిమాతో పోలిస్తే గర్వంగానే ఉంటుంది కదా.
తదుపరి సినిమా?
లవ్ ఎంటర్‌టైనర్ చేస్తా. గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉంటుంది. నేను రాసుకున్న కథలన్నీ అల్లు అరవింద్‌గారు, బన్నీ వాసులకు తెలుసు. హీరో ఎవరనేది అల్లు అరవింద్‌గారే చెప్పాలి.
Advertisement
Advertisement