Srirastu Subhamastu
-
భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మెగాహీరో!
కెరీర్ తొలినాళ్లలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ క్లబ్లో చేరడమంటే నటులకు మాటలు కాదు. కానీ కేవలం మూడో సినిమాలు మాత్రమే చేసిన మెగా హీరో అల్లు శిరీష్ తన తాజా సినిమా కోసం కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందించబోతున్న తన తాజా సినిమా కోసం అల్లు శిరీష్ రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. శిరీష్ తాజా సినిమా 'శ్రీరస్తు శుభమస్తు' మంచి విజయాన్ని సాధించింది. శాటిలైట్ హక్కుల సహా ఈ సినిమా రూ. 15 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతను తన రెమ్యూనరేషన్‌ను కోటికి పెంచినట్టు తెలుస్తోంది. నిజానికి అల్లు శిరీష్ మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో అతని తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగి 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాను తెరకెక్కించారు. 'శిరీష్‌కు పెద్ద కుటుంబ నేపథ్యం ఉంది. ఇది ఆయనకు మంచి పబ్లిసిటీ ఇచ్చే అవకాశముంది. అయితే, బాక్సాఫీస్ వద్ద అతని సినిమా విజయం మీద మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి' అని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్లు ఎంతో తెలుసా?
అల్లు కుటుంబం ట్యాగ్ పెట్టుకుని టాలీవుడ్లోకి వచ్చినా.. ఇప్పటివరకు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్‌కు మంచి హిట్ దొరికింది. తాజాగా శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి 9 రోజుల్లో మొత్తం రూ. 11 కోట్లు వసూలు చేసింది. ఇంతకుముందు శిరీష్, రెజీనా జంటగా నటించిన కొత్త జంట సినిమా వసూలుచేసిన మొత్తం కంటే ఈ మొదటి 9 రోజుల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని.. శిరీష్ కెరీర్లోనే ఇది అత్యంత పెద్ద హిట్‌గా చెప్పుకోవచ్చని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ అన్నారు. ఇటు ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఈ సినిమాకు గాను అల్లు శిరీష్ ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సినిమా సక్సెస్ మీట్లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అల్లు వారి చిన్నోడిపై ప్రశంసలు కురిపించారు. తాను శిరీష్‌ను, అల్లు అర్జున్ను, మహేశ్ బాబును బాలనటులుగా చాలాకాలం క్రితం పరిచయం చేశానని, ఇప్పుడు శిరీష్ మంచి నటుడిగా ఎదగడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. భారీ హీరోయిజం చూపించే సినిమాలు కాకుండా.. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకోవడం బాగుందని చెప్పారు. 2013లో గౌరవం సినిమాతో హీరోగా పరిచయమైన శిరీష్.. ఆ తర్వాత కొత్తజంట, తాజాగా శ్రీరస్తు శుభమస్తు చేశాడు. -
విజయం.. గౌరవం... రెండూ దక్కాయి
అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. యువతరం అభిరుచులకు తగ్గట్టు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన పరశురామ్ (బుజ్జి) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పరశురామ్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘శ్రీరస్తు శుభమస్తు’కి లభిస్తున్న స్పందనపై మీ అనుభూతి? ఓ మంచి కథ చెప్పారంటూ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. విజయంతో పాటు దర్శకుడిగా నాకు గౌరవం తీసుకొచ్చిన చిత్రమిది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కథలు ప్రేక్షకులకు చేరువైనప్పుడు ఎనర్జీ వస్తుంది. లేదంటే ఇంత కష్టపడ్డా ఫలితం రాలేదని మూస కథలు వైపు వెళ్లాలనిపిస్తుంది. కానీ, ప్రేక్షకులు తమకు మంచి అభిరుచి ఉందని నిరూపించారు. ఓ దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది? చెప్పండి. అల్లు శిరీష్ కోసమే ఈ కథ రాశారా? అవునండి. సిరి (అల్లు శిరీష్)తో ముందు మరో సినిమా తీయాలనుకున్నాను. ‘హిట్ సినిమా కాదు, నా కెరీర్లో గుర్తుండే ఓ మంచి సినిమా కావాలి’ అని సిరి అడిగాడు. తిరుపతిలో దేవుణ్ణి దగ్గర్నుంచి చూసే సన్నివేశం స్ఫూర్తితో అప్పుడీ కథ రాశా. నా కథను నమ్మి అల్లు అరవింద్, సిరిలు ఎంతో ప్రోత్సహించారు. ఓ టీచర్లా పరశురామ్ నాకు చాలా విషయాలు నేర్పారని అల్లు శిరీష్ అన్నారు.. శిరీష్ సంస్కారం అది. కథ రాసి, సినిమా తీయడానికి నేను పడిన కష్టం కంటే నటుడిగా అతను పడ్డ కష్టమే ఎక్కువ. పాత్రకు అనుగుణంగా తనను తాను మలచుకున్నాడు. ‘మీకెలా కావాలో చెప్పండి, నటిస్తా’ అన్నాడు. నేనెంత చెప్పినా తెరపై చేసింది అతనే కదా. క్లైమాక్స్ సీన్స్ తీసే టైమ్‌కి మా ఇద్దరికీ బాగా సింక్ అయ్యింది. చాలా సహజంగా నటించాడు. లావణ్యా త్రిపాఠి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. దర్శకుడిగా కంటే మాటల రచయితగానే ఈ చిత్రం మీకు ఎక్కువ పేరు తెచ్చినట్లుంది? కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ అంటూ విడదీసి చూడడం నాకు తెలియదు. కథతో పాటు సహజంగా ఉండేలా మాటలు రాస్తాను. ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోను. గతంలో రైటర్ కమ్ డెరైక్టర్స్ పూరి జగన్నాథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ వద్ద పనిచేయడంతో ఆ పద్దతి అలవాటయింది. ‘బొమ్మరిల్లు’తో మీ సినిమాను పోల్చడం గురించి? నేపథ్యం ఒక్కటే కావొచ్చు కానీ, భావోద్వేగాల్ని వ్యక్తం చేసిన విధానం వేరు. ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’తో చిరంజీవిగారు పోల్చినప్పుడు చాలా సంతోషమేసింది. నాపై పూరి, భాస్కర్ల ప్రభావం ఉంది. గురువుగారి హిట్ సినిమాతో పోలిస్తే గర్వంగానే ఉంటుంది కదా. తదుపరి సినిమా? లవ్ ఎంటర్టైనర్ చేస్తా. గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉంటుంది. నేను రాసుకున్న కథలన్నీ అల్లు అరవింద్‌గారు, బన్నీ వాసులకు తెలుసు. హీరో ఎవరనేది అల్లు అరవింద్‌గారే చెప్పాలి. -
'శ్రీరస్తు శుభమస్తు' మూవీ రివ్యూ
కొత్త సినిమా గురూ! చిత్రం: శ్రీరస్తు శుభమస్తు నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: పరశురామ్ సంగీతం: ఎస్.ఎస్.తమన్, నటీనటులు: అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి, అలీ, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, ప్రభాస్ శీను తదితరులు ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మెదడుకి పని చెప్పకుండా రెండున్నర గంటలు హాయిగా సాగిపోయే చిత్రాలకు ప్రేక్షకాదరణ చెప్పుకోదగ్గ రీతిలో ఉంటుంది. కథలో కొత్తదనం, లాజిక్కులకు ఆస్కారం లేదిక్కడ. కాసేపు నవ్వించి, మనసును కదిలిస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అటువంటి ఫార్ములాతో వచ్చిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ఇండియాలోని అత్యంత సంపన్నులైన వందమంది వ్యాపారవేత్తల్లో కృష్ణమోహన్ (ప్రకాశ్‌రాజ్) ఒకరు. పెద్ద కుమారుడు ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మిడిల్ క్లాస్ వాళ్లంటే అతని తండ్రికి చిన్న చూపు. ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులు అయిపోవాలనే కాంక్షతో పెద్దింటి అబ్బాయిలను ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకుంటారన్నది ఆయన అభిప్రాయం. పెళ్లయిన ఐదేళ్లకు కూడా కోడలి పేరు ఆయనకు తెలియదు. ఆమెకు విలువ ఇవ్వడు. ఈ నేపథ్యంలో రెండో కుమారుడు సిరి అలియాస్ శిరీష్ (అల్లు శిరీష్) కూడా ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి అను అలియాస్ అనన్య (లావణ్యా త్రిపాఠి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ‘నువ్వు ఆస్తిపరుడివి కాదు.. జస్ట్ మిడిల్ క్లాస్ అబ్బాయి అని తెలిస్తే ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు’ అని కొడుకుతో తండ్రి అంటాడు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగానే ఆ అమ్మాయి ప్రేమను గెల్చుకుంటానని కొడుకు చాలెంజ్ చేస్తాడు. ఈ చాలెంజ్‌లో సిరి గెలిచాడా? లేదా? సిరి ఆస్తిని చూసి అను ప్రేమించిందా? లేదా మనసునా? ఈ ప్రేమకథ ఏ కంచికి చేరిందనేది మిగతా సినిమా. హీరోయిన్‌కి దగ్గరవడం కోసం హీరో వేసే నాటకాలు, ఆమెను ఓ ఆట ఆడుకోవడం, ఆ తర్వాత హీరోయిన్ ప్రేమలో పడడం వంటి అంశాలతో ఫస్టాఫ్కి ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్‌లో ఇటు తండ్రి గౌరవానికి విలువ ఇస్తూనే ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయి మానసిక సంఘర్షణ.. అటు తాను ప్రేమించిన అమ్మాయి చేతే తమ ప్రేమను అందరికీ వ్యక్తం చేయించాలని అబ్బాయి చేసే ప్రయత్నాలతో కథ ముగింపుకి చేరుతుంది. కథగా చెప్పుకుంటే ‘శ్రీరస్తు శుభమస్తు’లో కొత్తదనం తక్కువ కానీ.. కామెడీ, ఎమోషన్స్ కరెక్ట్‌గా కుదిరాయి. అల్లు శిరీష్ నటనలో గత చిత్రాల కంటే పరిణితి కనిపించింది. స్టైలిష్‌గా కూడా ఉన్నాడు. అందంగా కనిపించడంతో పాటు నటిగానూ లావణ్యా త్రిపాఠి ఆకట్టుకుంది. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, సుమలత వంటి నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఫస్టాఫ్‌లో ప్రభాస్ శీను, సెకండాఫ్‌లో అలీ, సుబ్బరాజ్‌లు నవ్వించారు. తమన్ పాటలు, నేపథ్య సంగీతం కథకు తగ్గట్టున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను కానీ గమనించలేని గుడ్డిదాన్ని కాదు’, ‘ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసా? ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిన తర్వాత అర్ధరాత్రి కూతురు దగ్గర నుండి ఫోన్ వస్తుందేమో అని భయపడకుండా నిద్రపోయేవాడు’, ‘అమ్మ కదా, త్వరగా అర్థం చేసుకుంది’ వంటి డైలా గ్స్‌తో రచయితగా తనలోని దర్శకుడికి పరశురామ్ పెద్ద సహాయమే చేశారు. కథలో అంత కొత్తదనం లేకపోయినా మాటలతో సందర్భానికి అనుగుణంగా వినోదాన్ని, భావోద్వేగాలను ప్రేక్షకులను చేరువయ్యేలా చేయడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. -
ఆగస్టు 5న శ్రీరస్తు శుభమస్తు
గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్. తొలి సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో రెండో ప్రయత్నంగా చేసిన కొత్త జంట సినిమాతో పరవాలేదనిపించాడు. అయితే కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే స్టామినాను మాత్రం చూపించలేకపోయాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న శిరీష్ ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్లో ఫ్యామిలీ డ్రామాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో అదే జానర్ లో లవ్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తన సొంతం నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటిస్తున్నాడు శిరీష్. పూర్తి మేకోవర్‌తో న్యూ లుక్‌తో కనిపిస్తున్న శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. సోలో లాంటి ఫ్యామిలీ డ్రామాలను అందించిన పరుశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్లకు మంచి స్పందన రావటంతో సినిమాకు కూడా హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఆగస్ట్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
త్వరలోనే 'శ్రీరస్తు శుభమస్తు'
గత మార్చిలో తన నెక్ట్స్ సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసిన అల్లువారి చిన్నబ్బాయి శిరీష్ , ఆ తరువాత సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత వరకు వచ్చింది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో కూడా ఇన్నాళ్లు క్లారిటీ ఇవ్వలేదు. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తరువాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్తజంట సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మూడో సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో పరశురామ్ దర్శకత్వంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా చేస్తున్నాడు. మార్చిలో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తరువాత సైలెంట్ షూటింగ్ కార్యక్రమాలు కానిచ్చేశారు. ప్రస్తుతం కాశ్మీర్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా ప్రకటించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అల్లు వారబ్బాయి ఎప్పుడొస్తాడు?
గత మార్చిలో తన నెక్ట్స్ సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసిన అల్లువారి చిన్నబ్బాయి శిరీష్, ఆ తరువాత సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అన్న విషయాలపై కూడా క్లారిటీ లేదు. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తరువాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్తజంట సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మూడో సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో పరశురామ్ దర్శకత్వంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మార్చ్‌లోనే రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవటంతో కేవలం ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టేశారు. ఆ తరువాత సినిమాకు సంబందించిన ఎలాంటి వార్త బయటికి రాలేదు. అసలు షూటింగ్ పూర్తయ్యిందా..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అన్న విషయాలపై గీతా ఆర్ట్స్ కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే సినిమా అనుకున్న స్థాయిలో రాకపోవటంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇలా రీషూట్‌లో బిజీగా ఉన్న ఈ సినిమా ఎప్పటికీ రిలీజ్ అవుతుందో చూడాలి.