'శ్రీరస్తు శుభమస్తు' మూవీ రివ్యూ | Srirastu subhamastu Movie Review | Sakshi
Sakshi News home page

'శ్రీరస్తు శుభమస్తు' మూవీ రివ్యూ

Published Fri, Aug 5 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

'శ్రీరస్తు శుభమస్తు' మూవీ రివ్యూ

'శ్రీరస్తు శుభమస్తు' మూవీ రివ్యూ

కొత్త సినిమా గురూ!
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు
నిర్మాత: అల్లు అరవింద్
దర్శకత్వం: పరశురామ్
సంగీతం: ఎస్.ఎస్.తమన్,
నటీనటులు: అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి, అలీ, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, ప్రభాస్ శీను తదితరులు
 
ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మెదడుకి పని చెప్పకుండా రెండున్నర గంటలు హాయిగా సాగిపోయే చిత్రాలకు ప్రేక్షకాదరణ చెప్పుకోదగ్గ రీతిలో ఉంటుంది. కథలో కొత్తదనం, లాజిక్కులకు ఆస్కారం లేదిక్కడ. కాసేపు నవ్వించి, మనసును కదిలిస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అటువంటి ఫార్ములాతో వచ్చిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’.
 
ఇండియాలోని అత్యంత సంపన్నులైన వందమంది వ్యాపారవేత్తల్లో కృష్ణమోహన్ (ప్రకాశ్‌రాజ్) ఒకరు. పెద్ద కుమారుడు ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మిడిల్ క్లాస్ వాళ్లంటే అతని తండ్రికి చిన్న చూపు. ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులు అయిపోవాలనే కాంక్షతో పెద్దింటి అబ్బాయిలను ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకుంటారన్నది ఆయన అభిప్రాయం. పెళ్లయిన ఐదేళ్లకు కూడా కోడలి పేరు ఆయనకు తెలియదు. ఆమెకు విలువ ఇవ్వడు. ఈ నేపథ్యంలో రెండో కుమారుడు సిరి అలియాస్ శిరీష్ (అల్లు శిరీష్) కూడా ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి అను అలియాస్ అనన్య (లావణ్యా త్రిపాఠి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ‘నువ్వు ఆస్తిపరుడివి కాదు.. జస్ట్ మిడిల్ క్లాస్ అబ్బాయి అని తెలిస్తే ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు’ అని కొడుకుతో తండ్రి అంటాడు.

ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగానే ఆ అమ్మాయి ప్రేమను గెల్చుకుంటానని కొడుకు చాలెంజ్ చేస్తాడు. ఈ చాలెంజ్‌లో సిరి గెలిచాడా? లేదా? సిరి ఆస్తిని చూసి అను ప్రేమించిందా? లేదా మనసునా? ఈ ప్రేమకథ ఏ కంచికి చేరిందనేది మిగతా సినిమా. హీరోయిన్‌కి దగ్గరవడం కోసం హీరో వేసే నాటకాలు, ఆమెను ఓ ఆట ఆడుకోవడం, ఆ తర్వాత హీరోయిన్ ప్రేమలో పడడం వంటి అంశాలతో ఫస్టాఫ్‌కి ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్‌లో ఇటు తండ్రి గౌరవానికి విలువ ఇస్తూనే ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయి మానసిక సంఘర్షణ.. అటు తాను ప్రేమించిన అమ్మాయి చేతే తమ ప్రేమను అందరికీ వ్యక్తం చేయించాలని అబ్బాయి చేసే ప్రయత్నాలతో కథ ముగింపుకి చేరుతుంది.
 
కథగా చెప్పుకుంటే ‘శ్రీరస్తు శుభమస్తు’లో కొత్తదనం తక్కువ కానీ.. కామెడీ, ఎమోషన్స్ కరెక్ట్‌గా కుదిరాయి. అల్లు శిరీష్ నటనలో గత చిత్రాల కంటే పరిణితి కనిపించింది. స్టైలిష్‌గా కూడా ఉన్నాడు. అందంగా కనిపించడంతో పాటు నటిగానూ లావణ్యా త్రిపాఠి ఆకట్టుకుంది. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, సుమలత వంటి నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఫస్టాఫ్‌లో ప్రభాస్ శీను, సెకండాఫ్‌లో అలీ, సుబ్బరాజ్‌లు నవ్వించారు. తమన్ పాటలు, నేపథ్య సంగీతం కథకు తగ్గట్టున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

‘ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను కానీ గమనించలేని గుడ్డిదాన్ని కాదు’, ‘ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసా? ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిన తర్వాత అర్ధరాత్రి కూతురు దగ్గర నుండి ఫోన్ వస్తుందేమో అని భయపడకుండా నిద్రపోయేవాడు’, ‘అమ్మ కదా, త్వరగా అర్థం చేసుకుంది’ వంటి డైలా గ్స్‌తో రచయితగా తనలోని  దర్శకుడికి పరశురామ్ పెద్ద సహాయమే చేశారు. కథలో అంత కొత్తదనం లేకపోయినా మాటలతో సందర్భానికి అనుగుణంగా వినోదాన్ని, భావోద్వేగాలను ప్రేక్షకులను చేరువయ్యేలా చేయడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement