అర్జున్ , శ్రుతీ హరిహరన్
‘మీటూ’ ఉద్యమం సౌత్‌లోనూ ప్రకంపనలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ‘మీటూ’ ఉద్యమానికి చాలా మంది సౌత్ కథానాయికలు మద్దతు తెలిపారు. ఇటీవల కన్నడ నటి సంగీతా బాత్ తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. తాజాగా కన్నడ నటి శ్రుతీ హరిహరన్ కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం ‘నిబుణన్’ సెట్స్‌లో (కన్నడలో ‘విస్మయ’) నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ‘‘నా లైఫ్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాను.
ఎన్నో ఆశలతో నా సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. నా కలలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీ నాకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్పడానికి బాధగా ఉంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంకేతాలు నాకు కనిపించాయి. కొన్ని భయంకరమైన సంఘటల నుంచి తెలివిగా తప్పించుకోగలిగా. అయితే చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన కారణంగా చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. 2016లో అర్జున్‌తో వర్క్ చేసే చాన్స్ రాగానే ఎగై్జట్ అయ్యాను.
కానీ ‘విస్మయ’ సినిమా సెట్‌లో ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్స్‌లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారు. ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కాస్త పవర్‌ఫుల్‌గా తయారవుతోంది. అందుకే ఇప్పుడు పబ్లిక్‌గా చెబుతున్నాను’’ అంటూ సోషల్ మీడియా ద్వారా విషయాన్ని బయటపెట్టారు శ్రుతీ హరిహరన్.
కాల్స్, మేసేజ్‌లు చేయవద్దు
‘‘సినిమాలో ఏ సంఘటన గురించి అయితే ఇంత వివాదం జరగుతుందో ఆ సీన్‌ను నేను స్క్రిప్టింగ్ టైమ్‌లో చాలా రొమాంటిక్‌గా రాశాను. అది చదువుతున్నప్పుడే ‘నాకు టీనేజ్‌లో ఉన్న కూతురు ఉంది. ఇటువంటి సీన్స్‌లో నటించలేను’ అని అర్జున్ సార్ చెప్పారు. ఆయన కోరికే మేరకే ఆ సీన్‌లో రొమాంటిక్ ఫ్లేవర్‌ను తగ్గించాను. ఇప్పుడు అర్జున్‌పై శ్రుతీ హరిహరన్ చేసిన ఆరోపణలు విని షాక్ అయ్యాను. ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగింది. మినిట్ టు మినిట్ నాకు గుర్తులేదు.
ఈ సినిమా షూట్ టైమ్‌లో సెట్‌లో మేం చాలా బాగా ఎంజాయ్ చేశాం. అర్జున్, శ్రుతీ ఇద్దరూ నాకు మంచి స్నేహితులే’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ‘‘కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు మహిళలకు అన్ని చోట్లా సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిచ్యువేషన్స్‌ను కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని ‘మీటూ’ గురించి ఆయన చెప్పారు. ఇక ఈ వివాదం గురించి ఎవరూ నాకు ఫోన్ కానీ మేసేజ్ కానీ చేయవద్దు. ఎందుకంటే.. నేను చెప్పాల్సినదంతా ఈ పోస్ట్‌లోనే చెప్పాను’’ అని పేర్కొన్నారు అరుణ్.
చట్టపరమైన చర్యలు?
ఈ సంగతి ఇలా ఉంచితే... శ్రుతీ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు అర్జున్. ‘‘మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 150 సినిమాల్లో నటించా. దాదాపు 60 మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారందరితో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అప్పట్లో ఆ సీన్ కాస్త రొమాంటిక్‌గా ఉందని నేను డైరెక్టర్‌తో కూడా చెప్పాను. ఇప్పుడు శ్రుతీ ఎందుకు ఇలా నాపై ఆరోపణలు చేస్తుందో అర్థం కావడం లేదు’’ అని అర్జున్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. శ్రుతీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అర్జున్ ఆలోచిస్తున్నారని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment