'స్టార్‌వార్స్' రోబో క్రియేటర్ విషాదాంతం!
'స్టార్‌వార్స్' సినిమా కోసం ఆర్2-డీ2 రోబోలను రూపొందించిన స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు టోనీ డైసన్ విషాదకర పరిస్థితుల్లో మృతిచెందారు. గోజోకు చెందిన మాల్టా దీవిలోని తన నివాసంలో ఆయన విగతజీవిగా పోలీసులకు కనిపించారు.
బ్రిటన్‌కు చెందిన 68 ఏళ్ల టోనీ డైసన్ సహజ కారణాలతోనే కొన్ని రోజుల కిందట చనిపోయినట్టు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా స్నేహితులకు ఆయన కనిపించకపోవడం, ఆయన ఆచూకీ లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటికి వెళ్లి చూడగా.. ఆయన ఒక్కడే నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆయన మృతి వెనుక ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు కలుగడం లేదని పోలీసులు తెలిపినట్టు స్థానిక మీడియా తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించిన 'స్టార్‌వార్స్' సినిమాకు స్పెషల్ ఎఫ్టెక్స్ అందించడమే కాదు.. ఆ సిరీస్ సినిమాల కోసం ఎనిమిది ఆర్2-డీ2 రోబోలను రూపొందించారు. ఈ రోబోలు ఎంతగానో ఆయనకు పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. ఎన్నో ఇతర సంస్థలకు కూడా ఆయన రోబోలను రూపొందించి ఇచ్చారు. ఆయన రోబోలు ఎంతగా ఫేమస్ అయ్యాయంటే ఈ రోబోల పేరిట ఆయన క్లబ్ కూడా ఏర్పాటుచేశారు.