న్యూఢిల్లీ: మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. ఈ ఘటన జరిగినపుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెల్సుకున్న భారత నావికాదళాలు వెంటనే స్పందించి ఆ వైపుగా పయనమయ్యాయి. సముద్రపు దొంగలు ఆ నౌకను తమ అ«దీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధనౌక దానిని విజయవంతంగా అడ్డుకుంది.
అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాల్లో గురువారం ‘ఎంవీ రుయెన్’ నౌకను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరేట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్‌కు అత్యవసర సందేశం(మేడే)గా తెలియజేశారు.
హైజాక్ విషయం తెల్సిన వెంటనే భారత నావికా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత గస్తీ విమానం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నావికాదళ యాంటీ–పైరసీ పెట్రోల్ యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. హైజాక్‌కు గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అటుగా దూసుకెళ్లి ఆ నౌకను శనివారం ఉదయం విజయవంతంగా అడ్డుకున్నాయి. ‘ రవాణా నౌకల సురక్షిత ప్రయాణానికి భారత నావికాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడూ ముందుంటుంది’ అని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment