అప్పుడూ.. ఇప్పుడూ.. నా మాట ఒకటే!
‘‘స్టార్ కిడ్స్ ప్రభావంతో బాలీవుడ్‌లో కొత్తవారికి అవకాశాలు రావడం లేదు’’ అంటూ బంధుప్రీతిపై (నెపోటిజమ్) కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ప్రముఖ హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఆమెను కొంతమంది నిందించారు.
స్టార్ కిడ్స్ అయితే కంగనా మీద విరుచుకుపడ్డారు. ఓ నాలుగైదు రోజులు ఈ వివాదం సాగింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. అయితే, మళ్లీ కంగనా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇటీవల అనుపమ్ ఖేర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ‘‘బంధుప్రీతిపై నా మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉంటా. ఎప్పటికీ నా అభిప్రాయం మారదు’’ అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ కిడ్స్‌పై పెట్టిన శ్రద్ధ బయట వాళ్లపై చూపించడంలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి.