నాకు ఇంకా సంతృప్తి లేదు
టాలీవుడ్ నంబర్‌వన్ హీరోయిన్ అనగానే... తడుముకోకుండా వచ్చే సమాధానం సమంత. వరుస విజయాలతో సాటిలేని హీరోయిన్‌లా దూసుకుపోతోందీ చెన్నయ్ చందమామ. అయితే... టాప్ పొజిషన్‌ని ఎంజాయ్ చేస్తున్నా, కెరీర్ పరంగా తృప్తి లేదంటూ ఇటీవల మీడియా సాక్షిగా వాపోయారు సమంత. ‘‘వరుసగా హిట్స్ వస్తున్నాయని ఆనంద పడాలో, మంచి నటిగా ఇంకా నిరూపించుకోలేకపోయానని బాధ పడాలో అర్థం కావడం లేదు. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ నాకు మంచి పేరునే తెచ్చాయి.
అయితే... ఆర్టిస్టుగా అంతటితో సతృప్తి పొందలేను. ఇంకా సాధించాలి. సమంత స్టార్ మాత్రమే కాదు, గొప్ప నటి కూడా అని అందరూ ప్రశంసించాలి. అలాంటి పేరు తెచ్చే పాత్ర కోసమే ఎదురు చూస్తున్నా. నటిగా ఎలాంటి పాత్రనైనా చేసే సత్తా నాకుంది. డీ గ్లామరైజ్డ్ క్యారెక్టరైనా ఫర్వాలేదు. పారితోషికం గురించి కూడా పెద్దగా పట్టించుకోను’’ అని తన ఆకాంక్షను వెలిబుచ్చారు సమంత.