ఇప్పట్లో ఒకడున్నాడు | Story about ranvir singh | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో ఒకడున్నాడు

Published Fri, Jan 6 2017 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఇప్పట్లో ఒకడున్నాడు - Sakshi

ఇప్పట్లో ఒకడున్నాడు

♦ రణ్‌వీర్‌ సింగ్‌
‘బావి తవ్వకుండా నీళ్లు వస్తాయా?’ ‘రావు’ ‘కష్టపడకుండా ఫలితం మాత్రం ఎలా వస్తుంది?’ ‘రబ్బిష్‌. ఇండస్ట్రీలో పైకి రావాలంటే సపోర్టు కావాలి’ ‘చిరంజీవి ఎవరి సపోర్ట్‌తో మెగాస్టార్‌ అయ్యాడు!’ ‘పాత ఎగ్జాంపుల్‌. కొత్తది చెప్పు’

‘రణ్‌వీర్‌ సింగ్‌... బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌’ ‘...’‘టాలీవుడ్, బాలీవుడ్‌ ఏదైనా ఒకటే. నీ దగ్గర టాలెంట్‌ ఉంటే స్టార్‌ అవుతావు. కష్టపడే గుణం ఉంటే సూపర్‌ స్టార్‌ అవుతావు’ ‘అంతేనా?’ ‘బాక్సాఫీస్‌ మీద ఒట్టు’.

నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నీ దగ్గర ఒకటి ఉండాలి. ఏంటది? నీపై నీకు ఆత్మవిశ్వాసమే!

కొందరు దుంపలు తవ్వుతారు. కొందరు పిందెలు వెతుకుతారు. కొందరు ఉడతలు, ఊరపిచుకలు అయినా తిని బతుకుదాం అనుకుంటారు.

కాని కొందరు మాత్రం ఇవన్నీ కళ్ల ముందు ఉన్నా వదిలిపెట్టి కేవలం ఏనుగు కుంభస్థలం మాత్రమే కొడతారు.
రణ్‌వీర్‌ సింగ్‌... రెండో టైపు.

‘బ్యాండ్‌ బాజా బారాత్‌’... కొత్త కుర్రాడు చేసిన మొదటి సినిమా. హిట్‌. ‘లేడీస్‌ వెర్సస్‌ రికీ భల్‌’. కొత్త కుర్రాడు చేసిన రెండో సినిమా యావరేజ్‌. ‘లుటేరా’. కొత్త కుర్రాడు చేసిన మూడో సినిమా. ఫ్లాప్‌. చాలు... అయిపోయినట్టే. వచ్చాడు. చేశాడు. పోబోతూ ఉన్నాడు.
నిజానికి రణ్‌వీర్‌ సింగ్‌ కథ ఇంతటితో ముగియాల్సిందే. కాని పట్టుదల ఉన్నవాడికి కష్టాన్ని నమ్ముకున్నవాడికి కాలం కరవాలం చేతికి అందిస్తూనే ఉంటుంది.

అందరూ రజనీకాంత్‌ ‘బాషా’ సినిమాను చెప్పుకుంటారు. దాన్ని చూసి పదహారు సినిమాలు తీస్తారు. కాని దానికి మూలం ఒకటి ఉంది– ‘హమ్‌’ (1991). అమితాబ్‌ బచ్చన్, రజనీ కాంత్, గోవిందా నటించిన ఆ సినిమా ‘జుమ్మా చుమ్మా దేదే...’ వంటి పాటలతో గొప్ప కథతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. అందులో అమితాబ్‌ మాజీ డాన్‌. తన పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి, ఒక సాదాసీదా మనిషిగా తన ఇద్దరు తమ్ముళ్లతో బతుకుతూ ఉంటాడు. కాని సెకండ్‌హాఫ్‌లో విలన్‌ డిస్ట్రబ్‌ చేసే సరికి తిరిగి నరసింహావతారం ఎత్తు తాడు. అందులో ఒక సీన్‌ ఉంది. అమితాబ్‌ తమ్ముడైన గోవిందాకు కాలేజీలో సీట్‌ రాదు.

అప్పుడు అమితాబ్‌ ఆ కాలేజీకి వెళ్లి ‘అయ్యా! నా పేరు ఫలానా... కాని నాకు ఇంకో పేరు ఉంది’ అని చెప్పేసరికి కాలేజీ యజమాని హడలిపోయి సీటు ఇచ్చేస్తాడు. ఈ సీన్‌ను కాలక్షేపంగా దర్శకుడు ముకుల్‌ ఎస్‌. ఆనంద్‌ రజనీ కాంత్‌తో చర్చించాడు. ఆ సీన్‌ రజనీ కాంత్‌కు చాలా నచ్చింది. కాని సినిమాలో ఆ సీన్‌ లేదు. అసలు ఈ సీన్‌ను తీయలేదు కూడా! ఈ సీన్‌ నుంచి ఒక సినిమా తీయొచ్చు అని రజనీ కాంత్‌ ఆ తర్వాత ‘బాషా’ (1995) తీసి తన కెరీర్‌లోనే పెద్ద హిట్‌ సాధించాడు. ‘హమ్‌’ నుంచి ‘బాషా’ పుట్టింది నిజమే. ‘హమ్‌’ నుంచే రణ్‌వీర్‌ సింగ్‌ కూడా పుట్టాడు. ఇదీ నిజమే.

‘హమ్‌’ వచ్చిన నాటికి రణ్‌వీర్‌ సింగ్‌ వయసు ఆరేడేళ్లు. అతడి నానమ్మ అమితాబ్‌ బచ్చన్‌కి ఇఎన్‌టి ఫ్యాన్‌. అంటే చెవి, ముక్కు, గొంతు కూడా కోసుకునేంత ఫ్యాన్‌ అన్నమాట. వీడియో క్యాసెట్ల జమానాలో చీటికి మాటికి అమితాబ్‌ సినిమాలు వేసుకొని చూస్తూ ఉండేది. మనవడికి అర్థమైనా కాకపోయినా చూపించి డాన్సులు చేయించేది. ‘జుమ్మా చుమ్మా దేదే’... రణ్‌వీర్‌ రక్తంలోకి మొదట సినిమాను ఎక్కించిన పాట. ‘అరే కన్నా! నువ్వు పెద్దయ్యి సినిమా స్టార్‌వి కావాలిరా’ అనేది నానమ్మ.

ఆ సంగతి తనకు తెలియదు. తనకు తెలిసిందల్లా చిన్నప్పటి నుంచి అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకోవడమే. ఎందుకో ఇష్టం. ఆ అద్దంలో ముఖాలు మార్చి చూసుకునేవాడు. అల్లరి చేసి చూసుకునేవాడు. తల అటూ ఇటూ దువ్వి చూసుకునేవాడు. వెర్రి మొర్రి వేషాలు వేసేవాడు.ఒక యాక్టర్‌ కావాలనుకునేవాడికి కావలసిన మొదటి అర్హత అదే. అద్దంతో మోహం!

రణ్‌వీర్‌ సింగ్‌ తండ్రి జగ్‌జీత్‌ సింగ్‌ ఒక మోస్తరు ఆటోమొబైల్‌ వ్యాపారి. కొడుకును బాగా చదివించగలిగే స్తోమత ఉన్నవాడే తప్ప అనిశ్చితి నిండిన సినిమా రంగంలో ప్రయత్నిస్తానంటే భరించేంత శక్తి ఉన్నవాడు కాదు. కాని ఏమిటి చేయడం? ఒక కూతురు. ఒక కొడుకు. కూతురికి ఇలాంటి ఆకాంక్షలు పెద్దగా లేనప్పుడు ఉన్నవాణ్ణే ఎంకరేజ్‌ చేయాలని అనుకున్నాడు. రణ్‌వీర్‌ సింగ్‌ను అమెరికా వెళ్లి చదువుకొని రమ్మంటే అతడక్కడ యాక్టింగ్‌ క్లాసులు చేసొచ్చి, 2007లో ఉత్త చేతులతో నిలబడ్డాడు. ఒకరు పైకి రావాలంటే కుటుంబమే అండగా నిలవాలని అంటారు. రణ్‌వీర్‌కు కుటుంబం అండగా నిలబడింది. పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి పెద్ద కారు నుంచి చిన్న కారుకి మారింది. ఒక దశలో పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోవడానికి కూడా రణ్‌వీర్‌ దగ్గర డబ్బులు లేవు.

అయినా సరే అప్పో సప్పో చేసి దానిని తయారు చేసుకున్నాడు. ప్రతి స్టూడియో తిరిగాడు. ప్రతి కాస్టింగ్‌ ఇన్‌చార్జ్‌నీ బతిమాలి భంగపడ్డాడు. ఎవరో ఉండి... ‘ఈ విదేశీ చదువు పనికి రాదు యాక్టింగ్‌ స్కూల్‌లో చేరు’ అనంటే – ‘తల్లి చనిపోతే ఎలా ఏడ్వాలో’ నేర్పించే దిగువ శ్రేణి యాక్టింగ్‌ స్కూల్‌లో చేరి ఆ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత వేరెవరో ఉండి.. ‘థియేటర్‌ చెయ్‌. ఆ అనుభవం మంచిది’ అన్నప్పుడు ప్రఖ్యాత పృథ్వి థియేటర్‌లో ఉదయం 8 నుంచి రాత్రి 11 దాకా నాటకాల మధ్య గడిపాడు. ఒక పని నాకు అన్నివిధాలా వచ్చి తీరాలి అని సంకల్పించుకున్నవాడు అది వచ్చే వరకూ ఏ పనినీ తక్కువ పని అనుకోడు. నటులకు ఛాయ్‌లు మోయడం, స్టేజ్‌ మీద బ్యానర్లు కట్టడం, సెట్‌లో అట్టలకు మేకులు కొట్టడం... ఇలా అన్ని పనులూ చేశాడు.అన్నింటి లక్ష్యం ఒక్కటే – తను హీరో కావాలి!
దానికి తన దగ్గర ఉన్న ఒక అర్హత – గొడ్డుచాకిరీ!!

చిన్న చిన్నగా వేషాలు రావడం మొదలయ్యాయి. కాని అవేవీ రణ్‌వీర్‌ తీసుకోలేదు. అలా చేయడం నిజంగా సాహసమే. పెద్ద అవకాశం కోసం ఎదురుచూస్తూ కూచుంటే ఈ అవకాశాలు కూడా పోతాయి. అయినా సరే. కొడితే పెద్ద దెబ్బ కొట్టాలి అని వెయిట్‌ చేస్తున్నాడు. ఈ లోపు ఒక కాస్టింగ్‌ డైరెక్టర్‌ ఒకరోజు తన ఇంటికి పిలిచి ‘మరేంటి సంగతి’ అని మోకాలి మీద నిమరడం మొదలుపెట్టాడు. ఇలాంటి మనుషులు ఇలా‘గే’ బిహేవ్‌ చేస్తారని తెలుసుకొని, అక్కడి నుంచి తెలివిగా బయటపడ్డాడు. మొత్తానికి ఒకరోజు అదృష్టం భళ్లున తెరుచుకుంది. అవకాశం తలుపు తట్టింది. అలాంటి ఇలాంటి అవకాశం కాదు– యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అవకాశం. నేరుగా ఆదిత్యా చోప్రా నుంచే పిలుపు. ‘రబ్‌ నే బనాదీ జోడీ’లో నటించిన అనుష్క శర్మ పక్కన కొత్త కుర్రాణ్ణి పెట్టి ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ తీయాలని ఆ సంస్థ అనుకుంటోంది. పెద్ద సంస్థ మొదటిసారి చిన్న సినిమాల్లోకి దిగుతోంది. దానికి హీరో కావాలి. రణ్‌వీర్‌ సింగ్‌ వెళ్లి ఆడిషన్‌ ఇచ్చాడు. సెలెక్ట్‌ అయ్యాడు. అయితే ఆ తర్వాత హఠాత్తుగా కన్‌ఫ్యూజ్‌ అయిపోయాడు.

‘ఇంత పెద్ద సంస్థ నుంచి నన్ను సెలెక్ట్‌ చేశారు. సరిగ్గా చేయగలనా లేదా’ అనే ఆందోళనలో చిన్న చిన్న టెస్ట్‌ సీన్లు కూడా తప్పు తప్పుగా చేస్తున్నాడు. ఇతన్ని నమ్ముకుని సినిమా మొదలెట్టొచ్చా అనే డౌట్‌ వరకూ తీసుకెళ్లాడు. చూడండి... సమస్యలు ఎలా వస్తాయో! దీన్ని ఆదిత్యా చోప్రా గమనించాడు. ఒకరోజు పిలిచి ‘చూడూ! నువ్వు ఆడిషన్‌లో బాగా చేశావ్‌. ఆ తర్వాత చేయలేకపోతున్నావు. నీకు లాస్ట్‌ చాన్స్‌ ఇస్తున్నాను. రేపు కెమెరా టెస్ట్‌ పెడతాను. వరల్డ్‌ కప్‌లో పెనాల్టీ గోల్‌ లాంటి చాన్స్‌ ఇది. బాగా చేశావా ఉంటావ్‌. లేదంటే... అంతే’ అన్నాడు. దైవం రణ్‌వీర్‌ పక్షాన ఉంది. ఆ టెస్ట్‌ పాసయ్యాడు. ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ కూడా ప్రేక్షకుల టెస్ట్‌ పాసయ్యింది. హిందీ సినిమాల్లో ఒక తారక పుట్టింది. ఆ తారక పేరు రణ్‌వీర్‌ అని అందరూ తెలుసుకున్నారు.

‘బ్యాండ్‌ బాజా బారాత్‌’, ‘లేడీస్‌ వర్సస్‌ విక్కి భల్‌’, ‘లుటేరా’... ఈ మూడు సినిమాల తర్వాత ముఖ్యంగా ‘లుటేరా’ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ మీటర్‌ కిందకు దిగాల్సింది. కాని ఆ సమయంలోనే అతడి కెరీర్‌ సంజయ్‌ లీలా బన్సాలీ చేతిలో పడింది. ఈ కొత్త కుర్రాణ్ణి ముందు నుంచీ గమనిస్తూ వస్తున్న బన్సాలీ వెంటనే అతణ్ణి, దీపికా పదుకొనె పక్కన తను తీయబోతున్న ‘రామ్‌లీలా’లో బుక్‌ చేసుకున్నాడు. ఇది పెద్ద మలుపు. ఆ సినిమా షారుఖ్‌ నటించిన ‘దిల్‌ వాలే’తో పాటుగా విడుదలైంది. రణ్‌వీర్‌ ఊపుకు అంత పెద్ద హీరో కూడా కొంచెం తొట్రు పడాల్సి వచ్చింది. ‘రామ్‌లీలా’ కలెక్షన్లు కాసులు కురిపించడంతో పాటు రణ్‌వీర్‌కు అవకాశాలు కూడా కురిపించాయి. ‘గూండే’, ‘కిల్‌ దిల్‌’, ‘దిల్‌ ధడక్‌నే దో’ – ఈ సినిమాలన్నీ రణ్‌వీర్‌ను నిలబెట్టాయి. ముఖ్యంగా ‘దిల్‌ ధడక్‌నే దో’లో దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న శ్రీమంతుడు (అనిల్‌ కపూర్‌)కి చేతగాని కొడుకుగా రణ్‌వీర్‌ చాలా ప్రతిభావంతమైన నటన ప్రదర్శించాడు. మొత్తానికి అన్నీ సెట్‌ అయ్యాయి. ఇక కావలసిందల్లా ఒక బ్లాక్‌ బస్టరే.ఆ పుణ్యం కూడా బన్సాలీయే చేసిపెట్టాడు. సినిమా– ‘బాజీరావ్‌ మస్తానీ’.

‘బాజీరావ్‌ మస్తానీ’ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ మరో 20 ఏళ్లు... కనీసం పదేళ్లు ఎటువంటి ఒడుదొడుకులు వచ్చినా నటుడుగా కొనసాగే స్థిరత్వాన్ని బాలీవుడ్‌లో పొందాడు. ఎవరిని చూస్తే తన జన్మ ధన్యం అనుకుంటూ వచ్చాడో... అలాంటి పెద్ద పెద్ద స్టార్ల పక్కన తను అవార్డ్‌ ఫంక్షన్స్‌లో పాల్గొంటున్నాడు. యాడ్స్‌ చేస్తున్నాడు. పెద్ద పెద్ద పార్టీల్లో ఆడపిల్లలకు భారీ ఆకర్షణగా నిలుస్తున్నాడు. తాజాగా బన్సాలీ తీస్తున్న ‘పద్మావతి’ సినిమాలో ‘అల్లావుద్దీన్‌ ఖిల్జీ’ పాత్రను పోషించే అదృష్టవంతుడయ్యాడు.అదృష్టాన్ని హార్డ్‌వర్క్‌ ఫాలో కాకపోవచ్చు.
కాని హార్డ్‌వర్క్‌ను అదృష్టం ఫాలో అయ్యే తీరాలి.

సినిమా పెద్దల ఆశీస్సులు, డబ్బు, గాడ్‌ఫాదర్లు ఇవేవీ లేకపోయినా ఒక సాదాసీదా కుర్రాడు తనను తాను నమ్ముకుని పైకి రాగలడు అనడానికి ఇటీవలి ఒక ఉదాహరణ – ఇప్పట్లోనూ ఒకడున్నాడు అని చెప్పడానికి నిలిచిన తార్కాణం రణ్‌వీర్‌. సో... కలలు కనండి. నిజం చేసుకోండి. డీలా పడినప్పుడల్లా సెల్‌ఫోన్‌ స్క్రీన్‌ మీద ఇతడి ఫోటోను లాక్‌ చేసుకోండి. ఆల్‌ ది బెస్ట్‌!
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement