సుబ్రమణ్యం ఫర్ సేల్
‘‘ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు’’ అని ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ నెల 27 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి మార్చి వరకూ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్ నుంచి అమెరికాలో షూటింగ్ ఉంటుంది. వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘‘మిరపకాయ్’ టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను.
అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. ‘గబ్బర్‌సింగ్’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది’’ అని హరీశ్‌శంకర్ తెలిపారు. మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సాయిధరమ్‌తేజ్ అన్నారు. ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళ్తామా అని ఎదురు చూస్తున్నానని రెజీనా చెప్పారు. చిత్రబృందం కూడా సమావేశంలో పాల్గొన్నారు.