
సక్సెస్ అంటే నక్షత్రంలాంటి సినిమా తీయడమే!
దర్శకుడు కృష్ణవంశీ
‘‘ నా సినిమాలు ప్రేక్షకుల్లో చెడు ఆలోచనలను ప్రేరేపించకూడదు. ఒకవేళ అలాంటి సినిమాలు సక్సెస్ అయినా.. ఆ తరహా కాన్సెప్ట్ సినిమాలను నేను తీయను. నా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒకణ్ణి కొట్టాలనిగానీ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనగానీ రాకూడదు. మంచి ఆలోచన కలగాలి’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా సాయిధరమ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్, ప్రకాశ్‌రాజ్ ముఖ్యపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నక్షత్రం’. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పై ఎస్.వేణుగోపాల్, కె.శ్రీనివాసులు, సజ్జు నిర్మించారు.
ఆదివారం హీరో సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ నెల చివర్లో సినిమా విడుదల కానుంది. కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘రిలీజియన్ వల్ల క్రియేట్ అయ్యే ఒక సమస్యపై ఓ సామాన్యుని పోరాటమే ‘నక్షత్రం’. సినిమా విడుదలలో జాప్యం జరగడానికి కారణం ప్రధాని మోదీ. నోట్ల రద్దు ప్రభావంతో మా సినిమాను అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. నేను నాలాగే సినిమాలు తీసి హిట్ సాధించాలనుకుంటాను. రిస్క్ లేకుండా సినిమాలు తీయడం అంటే ఏంటో నాకు తెలీదు. నాకు సినిమాలు ఇలాగే తీయడం తెలుసు. విజయాల కోసం, అవార్డుల కోసం సినిమాలు తీయను. అసలు ఆ ఆలోచనే నాకు ఉండదు. సక్సెస్‌కు విభిన్న రకాల నిర్వచనాలు ఉన్నాయి.
నా దృష్టిలో సక్సెస్ అంటే డబ్బు కాదు. ‘నక్షత్రం’ లాంటి సినిమాను తీయగలగడం సక్సెస్ అనుకుంటున్నా’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారితో సినిమా తీయాలనేది ఓ పదేళ్ళ క్రితం నాటి కల’’ అనారు నిర్మాత వేణు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ– ‘‘నేను హీరో అవ్వడం ఒకటి. కృష్ణవంశీగారి సినిమాలో హీరో అవ్వడం ఒకటి’’ అన్నారు. ‘‘ఒక స్టూడెంట్‌లా ఈ చిత్రం సెట్స్‌కి వచ్చి ఒక టీచర్ దగ్గర ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకున్నాను’’ అని సాయిధరమ్ అన్నారు. రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ఛాయాగ్రాహకుడు శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.