ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా సరికొత్త రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత ఈ గట్టునుంటావా పాటపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. పాటకు ఆడియోలో శివ నాగులు గొంతు వినిపించగా.. సినిమాలో మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ గొంతు వినిపించింది. దీంతో అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శివ నాగులు ఈ పాటను అద్భుతంగా ఆలపించినట్టుగా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన చిత్రయూనిట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న చర్చ జరిగింది.
అయితే ఈ విషయాలపై దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించారు. షూటింగ్ సమయానికి శివ నాగులతో పాట రికార్డ్ కాలేదని దీంతో దేవీ పాడిన వర్షన్‌తో షూటింగ్ కానిచ్చేశారట. తరువాత శివ నాగులుతో పాట రికార్డ్ చేసినా.. రీ రికార్డింగ్ సమయంలో ఈ వర్షన్‌కు లిప్ సింక్ కాకపోవటంతో దేవీ శ్రీ ప్రసాద్ వర్షన్‌ను అలాగే ఉంచేశామని సుకుమార్ వెల్లడించారు. అంతేకాదు ఆల్బమ్‌లో ఎప్పటికీ శివ నాగులు పాడిన పాటే ఉంటుందని, పాటను ఉద్దేశ పూర్వకంగా మార్చలేదని కేవలం సాంకేతిక కారణాల వల్లే అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment