మహానటి సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో పాటు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దర్శకుడు సుకుమార్ తనదైన స్టైల్‌లో మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ ‘ప్రియ’మైన అశ్విన్, మహానటి సినిమా చూసి బయటకి వచ్చి, నీతో మాట్లాడదామని నీ నంబరుకి ట్రై చేస్తున్నాను... ఈ లోగా ఒక ఆవిడ వచ్చి ‘నువ్వు డైరెక్టరా బాబు’ అని అడిగింది.
అవునన్నాను... అంతే నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ‘ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని’ అంటూ.. నాకళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను. మనసారా... ఆవిడ నన్ను దీవించి వెళ్లిపోయింది. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.’ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ లెటర్‌ను పోస్ట్ చేశారు సుకుమార్. అంతేకాదు గమనిక అంటూ ‘ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు కాదని తెలియకపోతే బావుండు’ అంటూ తనదైన స్టైల్‌లో నాగ్ అశ్విన్‌ను ప్రశంసించారు.
కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో నటించిన మహానటి సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంకాదత్ నిర్మించారు. జెమినీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్, ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు నటించారు. సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి టాక్ రావటంతో వసూళ్లు పరంగా కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది.
Comments
Please login to add a commentAdd a comment