ఎవరినీ మెచ్చుకోని ఆయన...నన్ను మెచ్చుకున్నారు!
దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో కథానాయకునిగా, సహాయ నటునిగా, ప్రతినాయకునిగా సుమన్ ఎన్నో పాత్రలు చేశారు. దేవుడి పాత్రల్లో కూడా ఆయన మెప్పించిన వైనాన్ని మర్చిపోలేం. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తమిళ చిత్రం ‘రమణ’ ఆధారంగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, శ్రుతీహాసన్ జంటగా రూపొందిన ఈ చిత్రంలో సుమన్ ప్రతినాయకునిగా నటించారు.
శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సుమన్ మాట్లాడుతూ -‘‘రజనీకాంత్‌గారి ‘శివాజీ’లో నేను విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం హిందీలోనూ విడుదలైంది. అప్పుడు అక్కణ్ణుంచి చాలా అవకాశాలు వచ్చాయి కానీ, ఓ మంచి చిత్రం ద్వారా పరిచయం అయితే బాగుంటుందనుకున్నా. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సరైన సినిమా అనిపించి, అంగీకరించాను. అక్షయ్‌కుమార్‌కీ మార్షల్ ఆర్ట్స్ తెలుసు.
నాకూ వచ్చు. దాంతో ఫైట్ సీన్స్‌ని చాలా సహజంగా చేశాం. నాకు తెలిసి భారతీయ సినిమాలో రిస్క్ తీసుకుని ఫైట్స్ చేసేది అక్షయ్‌కుమారే. ఆయన అంత సులువుగా ఎవర్నీ అభినందించరట. ఆయనే స్వయంగా ‘ఈ వయసులో మీరు బాగా ఫైట్స్ చేస్తున్నారు’ అని నన్ను ప్రశంసించడం మరిచిపోలేను. ఈ ఏడాది హిందీ రంగానికి పరిచయం కావడం ఓ విశేషం అయితే, ఏకకాలంలో నాలుగు దక్షిణాది భాషల్లో రూపొందిన ‘రెడ్ అలర్ట్’లో నటించడం మరో విశేషం’’ అన్నారు.