అక్కినేని ఆవకాయ
‘కొత్త ఆవకాయ’... అసలు ఈ సౌండ్ వింటేనే ‘అద్భుతః’ అనిపిస్తుంది. చిత్రాన్నాల్లో పులిహోర, కూరల్లో వంకాయ, పచ్చళ్లలో కొత్త ఆవకాయ... వీటికి తిరుగేలేదు. ఆర్యుల మాట కూడా ఇదే. పైగా ఇది ఆవకాయ సీజన్. ఇతర రాష్ట్రాల సంగతి ఏమో కానీ... మన తెలుగు లోగిళ్లలో మాత్రం ప్రస్తుతం ఎక్కడ చూసినా కొత్త ఆవకాయ ఘుమ ఘుమలే. ఇక్కడున్న స్టిల్ చూడండి. గరిటెతో కలపాల్సిన ఆవకాయని చక్కగా చేతితో కలిపేస్తున్నాడు సుమంత్. పైగా ఇది సినిమా కోసం తీయించుకున్న స్టిల్ కాదు. ఇంట్లో స్వయంగా ఆవకాయ పెడుతూ తీయించుకున్న స్టిల్. సుమంత్‌కి ఆవకాయకి ఉన్న అనుబంధం మామూలుది కాదు. సుమంత్ చిన్నప్పట్నుంచీ తాతయ్య, నాయనమ్మ దగ్గరే పెరిగిన విషయం తెలిసిందే. అక్కినేని అన్నపూర్ణ ఆవకాయ పెట్టడంలో సిద్ధహస్తురాలట. స్వహస్తాలతో ఆమె ఆవకాయ పట్టి, చుట్టాలకు, పక్కాలకు పంపేవారట. ‘అన్నపూర్ణమ్మగారి ఆవకాయ’ అనగానే అందరూ లొట్టలేసుకొని మరీ తినేవారట. ఏఎన్నార్‌కి కూడా అన్నపూర్ణమ్మ ఆవకాయ అంటే మహా ప్రీతి. అందుకే... ఆమె ఆవకాయ పెడుతున్నప్పుడు పక్కనే ఉండి మామిడి ముక్కల సైజు నుంచి, ఆవపిండి, ఉప్పు, కారం, వెల్లుల్లి పాయలు, నూనె... ఇలా మోతాదులన్నీ దగ్గరుండి చూసేవారట. ఆమె పోయాక కూడా... ఆమె రుచి చూపించిన ఆవకాయని మాత్రం అక్కినేని వదల్లేదట. బతికున్నంతవరకూ ఈ సీజన్ రాగానే ఇంట్లో ఆవకాయ పెట్టాల్సిందే. అన్నపూర్ణమ్మ పంపినట్టే అక్కినేని కూడా తమ ఇంటి ఆవకాయని అందరికీ పంపేవారట. గత ఏడాది కూడా ఈ పద్ధతిని అనుసరించారట అక్కినేని. సుమంత్ షూటింగ్ పనిమీద విదేశాల్లో ఉంటే... ఆవకాయని అక్కడికి పంపారట. తాతయ్య దగ్గరే ఆవకాయ తయారీని నేర్చుకున్నారు సుమంత్. ఇప్పుడు ఆయనకి నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలు మాత్రం అలా ఉన్నాయి. అందుకే... నాన్నమ్మ, తాతయ్యల జ్ఞాపకమైన అక్కినేని ఆవకాయని స్వయంగా తయారు చేశారు సుమంత్. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఈ స్టిల్ పెట్టుకున్నారాయన.