
‘రెండేళ్ల క్రితం... నా ప్రియమైన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో భాగంగా స్మోకింగ్ మానేశా. టర్కీకి వెళ్లాను. నికోటిన్, పొగ లేనేలేదు. అప్పటి నుంచి మళ్లీ దాని జోలికే వెళ్లలేదు. అయితే అది చాలా కష్టమైన పని. నిజానికి నరకం. కానీ ఇప్పుడు నా శరీరం పొగను తిరస్కరిస్తోంది. పొగ తాగేవాళ్లు ఉన్నచోట ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. జాన్ గ్రీన్ అన్నట్లుగా.. వదిలేంత వరకు కష్టమే కానీ ఒక్కసారి ఆ అలవాటు వదిలేస్తే ప్రపంచంలో అంతకన్నా తేలికైన విషయం మరోటి ఉండదు. ఇదంతా ఇప్పుడెందుకు అనే కదా మీ అనుమానం. కాస్త ఆగండి. ఒక నటిగా నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇష్టపడేవాళ్లతో పాటు విమర్శించే వాళ్లు, తిట్టుకునే వాళ్లూ ఉన్నారు. వారందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పోస్టు’ అంటూ నటి సుమోనా చక్రవర్తి తాను పొగత్రాగడం మానేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.
ఈ మేరకు సిగరెట్ కాలిపోతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సుమోనా... ‘నేను వదిలేశా... మరి మీరు?’ అంటూ ధూమపానం మానుకోవాలని సూచించారు. కాగా పలు హిందీ సీరియళ్లలో నటించిన సుమోనా కపిల్ శర్మ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందారు. ఇక పొగ తాగొద్దంటూ ప్రచారం నిర్వహించిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా... తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి, భర్తతో కలిసి ధూమపానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొగ తాగడాన్ని నిషేధించాలంటూ సుమోనా సోషల్ మీడియా వేదికగా పిలుపునివ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment