ఫిఫ్టీ..ఫిఫ్టీ | Sunday special chit chat with hero krishna and his wife vijaya nirmala | Sakshi
Sakshi News home page

ఫిఫ్టీ..ఫిఫ్టీ

Published Sun, Aug 5 2018 12:16 AM | Last Updated on Sun, Aug 5 2018 9:51 AM

Sunday special chit chat with hero krishna and his wife vijaya nirmala - Sakshi

సగం సగం పంచుకుంటే సంపూర్ణం చెందేది ఏంటి?ప్రేమా? కాదు.. కాదు. బాంధవ్యమా? కాదు.. కాదు.సంతోషమా? ఊహూ.. కాదు.మరి సగం సగం చేసుకుంటే పరిపూర్ణం అయ్యేదేంటి?స్నేహం.కృష్ణ, విజయనిర్మలను చూస్తే సంపూర్ణమైన స్నేహం కనబడుతుంది.ఏదైనా పంచుకునే స్నేహంలా అనిపిస్తుంది.ఇది హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రెండ్‌షిప్‌. 50 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ‘సాక్షి’తో నెమరువేసుకుంటున్న కృష్ణ, విజయనిర్మల.

మే 31 కృష్ణగారి బర్త్‌డే. ఫిబ్రవరి 20 మీ బర్త్‌డే. అసలు మీ మ్యారేజ్‌ డే ఎప్పుడో తెలుసుకోవాలనిపించింది. దాంతో పాటు మీ లవ్‌స్టోరీ కూడా. అందుకే ఈ ఇంటర్వ్యూ.
విజయనిర్మల: (నవ్వుతూ). డేట్‌ సరిగ్గా గుర్తులేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. కానీ ఇది 50వ సంవత్సరం. 
కృష్ణ: 1969 మార్చి 24. మా పుట్టిన రోజులకు అభిమానులు ఫోన్‌ చేసి విషెస్‌ చెబుతారు. మ్యారేజ్‌ డేకి అయితే ఒకరోజు ముందే ఫోన్‌ చేసి, ‘రేపు మీ మ్యారేజ్‌ డే’ అని గుర్తు చేస్తుంటారు (నవ్వుతూ).
విజయనిర్మల: ఆయనకి జ్ఞాపక శక్తి ఎక్కువ. అందుకే డేట్‌ చెప్పేశారు. 
     
కృష్ణగారిని మీరు ఫస్ట్‌ టైమ్‌ ఎక్కడ చూశారు? ఏమను కున్నారు?
విజయనిర్మల: సినిమా ఆఫీస్‌లో చూశాను. అది కూడా ఆయన అలా వెళ్తుంటే అద్దంలో నుంచి కనిపించారు. ఇంత అందగాడు ఎవరబ్బా? అనుకున్నాను. సినిమాలో హీరో అని తెలియగానే చాలా సంతోషమేసింది. మేమిద్దరం కలసి చేసిన ఫస్ట్‌ మూవీ ‘సాక్షి’లో మీసాల కృష్ణుడు టెంపుల్‌ సీన్‌ ఉంది. ఆ టెంపుల్‌లో ఊరికే పెళ్లి చేసుకున్నా అది నిజమైపోతుందట. నాకు, కృష్ణగారికి ‘అమ్మ కడుపు చల్లగా. అత్త  కడుపు చల్లగా. కట్టగా కట్టగా తాళిబొట్టు కట్టగా.’ అని పాట ఉంటుంది. ఆ పాట పాడుతూ తాళిబొట్టు కట్టించుకుంటాను.  ‘ఇక మీ ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు’ అని రాజబాబు ఏడిపించేవారు. ‘ఊరుకో.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు’ అనేదాన్ని. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో కలిసి యాక్ట్‌ చేసే అవకాశం వచ్చింది. అబ్బాయిగారి దగ్గర అమ్మాయికి, అమ్మాయిగారి దగ్గర అబ్బాయిగారికి చనువు ఎక్కువ అయిపోయింది (నవ్వుతూ). నలుగురూ చెప్పుకునే ముందే మంచి రోజు చూసి పెళ్లి చేసేసుకుంటే బెటర్‌ అని, తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. 
     
భార్యాభర్తలుగా ఫస్ట్‌ వెళ్లిన షూటింగ్‌ ఏది?
విజయనిర్మల: ‘అమ్మ కోసం’ సినిమా షూటింగ్‌ కోసం వెళ్లాం. మా పెళ్లి తర్వాత అదే ఫస్ట్‌ సినిమా. మేం పెళ్లి చేసుకుంటామని ఎవరూ ఊహించలేదు. చిత్తూరు నాగయ్యగారైతే. ‘ఇద్దరూ ముచ్చుల్లా ఉంటారు. సెట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎవరి దారిన వాళ్లు కూర్చుంటారు. ఇంత పెద్ద పని చేసుకొచ్చారా? ఎంత ధైర్యం వచ్చింది మీకు?’ అని ఆశ్చర్యపోయారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద టాక్‌. నేను సెట్లో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాను. ఆయనేమో ఎక్కువగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటారు. అలాంటిది మేం పెళ్లి చేసుకున్నామంటే.. రాసి పెట్టి ఉందనిపిస్తోంది.
     
సో.. ‘సాక్షి’ సినిమా మీ లైఫ్‌లో స్వీట్‌ మెమరీ అన్నమాట..
విజయనిర్మల: బాపుగారి ‘సాక్షి’లో యాక్ట్‌ చేయడం వల్ల నాకు రెండు జాక్‌పాట్‌లు తగిలాయి. ఒకటి కృష్ణగారు, రెండోది డైరెక్షన్‌. బాపూగారి వల్లే నేను డైరెక్టర్‌ని అయ్యాను. ఆయన సాయంత్రాలు షాట్‌ డివిజన్‌ చేసుకునేవారు. బొమ్మలు వేసేవారు. ఇవన్నీ ఏంటీ? అని అడిగితే బ్యాక్‌ షాట్, క్లోజప్‌ అంటూ అన్ని విషయాలూ క్షుణ్ణంగా వివరించేవారు. నేను ఏ డైరెక్టర్‌ దగ్గరా పని చేయలేదు. బాపూగారి డైరెక్షన్‌లో సినిమా చేయడమే నా డైరెక్షన్‌కి ఓ రూట్‌ అయింది. ఆ విధంగా ‘సాక్షి’ వల్ల రెండు జాక్‌పాట్స్‌ తగిలాయని అనుకుంటాను.
     
కృష్ణగారు బిడియస్తులు, రిజర్డ్వ్‌గా ఉంటారు. అసలాయన మీకు ఎలా ప్రపోజ్‌ చేసి ఉంటారో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందికి ఉంది.
విజయనిర్మల: నేనున్న గదికి చంద్రమోహన్‌ వచ్చి ‘కృష్ణగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగారు. ‘ఆయన ఇక్కడికి వచ్చి చెబితే చేసుకుంటాను, ఇలా పంపితే చేసుకోను’ అని చెప్పాను. అప్పుడు ఆయనే వచ్చి ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని అడిగారు. 
     
విజయ నిర్మలగారిలో ఉన్న స్పెషల్‌ క్వాలిటీ ఏంటి? ఆమెను ఎందుకు ఇష్టపడ్డారు? 
కృష్ణ: తను చాలా కామ్‌ పర్సన్‌. దానికి తగ్గట్టు ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్‌. ఆర్టిస్ట్‌గా కానీ డైరెక్టర్‌గా కానీ తనకు వర్క్‌ మీద చాలా కమాండ్‌ ఉంది. మనిషి కూడా ఫ్రాంక్‌గా ఉంటుంది. ఆ ముక్కుసూటితనం ఇష్టం.
విజయనిర్మల: అవి కూడా కాకుండా నేను చేసే వంటలంటే చాలా ఇష్టం.  ఏ స్టూడియోలో షూటింగ్‌ ఉన్నా కూడా వంట చేసి తీసుకువెళ్లేదాన్ని. బాగా తినేవారు. చేపల పులుసు చాలా ఇష్టం. భువనకల్లు దగ్గర మంచి చేపలు దొరుకుతాయి. ఆ చేపల పులుసు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేవారు. ఇంట్లో వంటమనిషి ఉన్నా మొన్నటి వరకూ కూడా నేనే చేసిపెట్టేదాన్ని. ఈ మధ్య చేయడం మానేశాను. కానీ చెప్పి చేయిస్తాను. 
   
కృష్ణగారు దొరకడం జాక్‌పాట్‌ అన్నారు. ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్‌ ఏంటి ? 
విజయనిర్మల: ఆయన అందానికి ఎవరైనా పడిపోతారు. చాలా హుందాగా ఉంటారు. ఆడపిల్లలతో  తల దించుకునే మాట్లాడేవారు. అది నాకు చాలా చాలా ఇష్టం. సేమ్‌ అదే మహేశ్‌బాబుకి వచ్చింది. తను కూడా ఆడవాళ్లు ఇబ్బందిపడేలా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడటం వంటివి చేయడు. అప్పట్లో దాదాపు ప్రతి హీరోయిన్‌కీ కృష్ణగారంటే లవ్‌ ఉండేది. అయినా నాకు ఈర్ష్య అనిపించేది కాదు. ప్రేమిస్తే ప్రేమించుకోండి.. ఆయన మిమ్మల్ని చూస్తేనే కదా అనుకునేదాన్ని. ఒక హీరోయిన్‌ అయితే కృష్ణగారు అన్నం ముద్దలు కలిపి పెడితేనే తింటానని ఒకటే గోల. అలా చేస్తేనే షూటింగ్‌కు వస్తాను లేకపోతే రానని కండీషన్‌ పెట్టిందట. పెడితే పెట్టింది. తినకపోతే తినకపోనీ షూటింగ్‌కి రాకపోతే ఏం.. అని నేను పంపించేదాన్ని కాదు. అంతక్రేజ్‌ ఉండేది ఆయనకు. 

అప్పుడు కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్‌ అంటే క్రేజ్‌. మీ ఇద్దరూ కలసి ఎక్కువ సినిమాలే చేశారు కదా?
కృష్ణ: మా పెళ్లి కాకముందే వరుసగా ఓ 20 సినిమాలు కలసి యాక్ట్‌ చేశాం. ఒక సంవత్సరానికి పది సినిమాలు వస్తే 8 సినిమాల్లో నాతో తనే ఉండేది. మా కాంబినేషన్‌ బాగుండేది. అందుకని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా మమ్మల్ని తీసుకునేవారు.
     
ఎక్కువ సినిమాలు (48) చేసిన లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారు గిన్నిస్‌ రికార్డ్‌ సాధించారు. ఆమె కెరీర్‌ విషయంలో మీ ప్రోత్సాహం గురించి? 
కృష్ణ: అంతా తన కష్టమే. ‘ఈ సినిమా చేయబోతున్నాను’ అంటే ‘సరే’ అనేవాణ్ణి. ప్రతి సినిమా డీటైల్‌గా బాగా తీసేది. ఒకటీ రెండు సినిమాలు ఆడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్‌ అన్ని సినిమాలు విజయం సాధించాయి. తన నరేషన్‌ కూడా చాలా బావుంటుంది. షాట్స్‌ కూడా బావుంటాయి. 
విజయనిర్మల: నేను ప్రొడ్యూసర్స్‌ డైరెక్టర్‌ని. నిర్మాత బావుంటే మనం బావుంటాం అనే సిద్ధాంతాన్ని నమ్మినదాన్ని. అందుకని పది పేజీల సీన్‌ని కూడా వెంటనే ఫినిష్‌ చేయడానికి ప్రయత్నించేదాన్ని. ఓ
సినిమాకి శివాజీ గణేశన్‌గారివి 30 రోజులు డేట్స్‌ తీసుకున్నాం. కానీ 20 రోజుల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేసేశాం. ఆయన గొడవ. మిగతా పది రోజులు నేనేం చేయాలి అని. నాగేశ్వరరావుగారు కూడా అదే అనేవారు. ‘ఏం కెమెరాలో ఫిల్మ్‌ ఉందా.. అన్నీ తీసేస్తున్నావు’ అని నాగేశ్వరరావుగారు సరదాగా అనేవారు. 
     
విజయ నిర్మలగారి డైరెక్షన్‌లో యాక్ట్‌ చేసినప్పుడు మీకెలా అనిపించేది?  
కృష్ణ: అందరి డైరెక్టర్స్‌తో ఎలా పని చేశానో తన సినిమాకీ అలానే చేశాను. డైరెక్ట్‌ చేస్తున్నది మా ఆవిడ అని సలహాలివ్వడానికి ట్రై చేయలేదు. 
విజయనిర్మల: ఇద్దరం కలసి సీన్‌ డిస్కస్‌ చేసుకునేవాళ్లం. సెట్‌కి వచ్చిన తర్వాత మాత్రం ఏమీ అడగరు. 
   
ఏదైనా సినిమా అప్పుడు గొడవలు పడ్డ సందర్భం ఏదైనా? 

విజయనిర్మల: అస్సలు లేదు. ‘దేవదాసు’ సినిమా తీశామని ఏయన్నార్‌గారికి కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే అది ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్‌ సినిమా కదా. కానీ మా సినిమా చూసిన తర్వాత ‘చాలా బావుంది, చాలా బాగా తీశారు’ అని మెచ్చుకున్నారు. దర్శక–నిర్మాత పి.పుల్లయ్య గారు ఏడుసార్లు చూశారు. నా ఫ్యాన్‌ అయిపోయారు ఆయన. 
కృష్ణ: ఆ పిక్చర్‌ నాలుగు గంటలు ఉంటుంది. అన్ని గంటలు ఎవరూ చూడరు.. కట్‌ చేయండని  డిస్ట్రిబ్యూటర్స్‌ అడిగితే మాకు ఎక్కడ కట్‌ చేయాలో తోచలేదు. ఆదుర్తి సుబ్బారావు, ఎల్వీ ప్రసాద్‌ వంటి దర్శకులకు షో వేసి చూపిద్దాం అన్నాను. ఎల్వీ ప్రసాద్‌గారేమో ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. పుల్లయ్యగారు మాత్రం ఎవడాడు? కట్‌ చేయమంది? అని అన్నారు. బ్రహ్మాండంగా ఉంది. సినిమా చూసి ఏడవడం నాకిదే ఫస్ట్‌ టైమ్‌ అని ఆదుర్తి సుబ్బారావుగారు అన్నారు. ఎల్వీ ప్రసాద్‌గారు నేను ‘నీ ఫ్యాన్‌ అయిపోయాను అమ్మా’ అని విజయకు కాల్‌ చేశారు. 
     
కృష్ణగారు ఎమోషనల్‌ సీన్స్, యాక్షన్‌ అన్నీ బాగా చేస్తారు. కానీ డ్యాన్స్‌ చేయలేరు. నేర్చుకోమని మీరెప్పుడూ చెప్పలేదా? 

విజయనిర్మల: ఆయన ఎలా చేసినా బావుంటుంది. డ్యాన్స్‌ చేయక్కర్లేదు. ఇలా స్టిల్‌ ఇచ్చినా చాలు. ‘నంబర్‌ వన్‌’ సినిమాలో బ్రేక్‌ డ్యాన్స్‌ చేసేసరికి ఫ్యాన్స్‌కి పిచ్చిపట్టినంత ఆనందం కలిగింది.
     
కృష్ణగారు, మీరు చాలా  టూర్స్‌ వెళ్లి ఉంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయిన ట్రిప్‌? 
విజయనిర్మల: కాశ్మీర్‌. షూటింగ్‌ కోసం వెళ్లాం. రెండు రోజులు బ్రేక్‌ వస్తే బోట్‌లో అలా ట్రావెల్‌ చేశాం. 
     
బోట్‌ ట్రావెల్‌ అప్పుడు ఏదైనా మరచిపోలేని సంఘటన? 
విజయనిర్మల: మేం జాలీగా వెళ్లినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కృష్ణగారికి ఈత రాదు. నాకూ ఈత రాదు. ఓ సినిమాలో నేను బోట్‌ వెనక దాక్కునే సన్నివేశం ఉంది. గోదావరి ఫ్లో. నాకు చాలా భయంగా అనిపించింది. దూకగానే వెంటనే సేవ్‌ చేయండని యూనిట్‌తో అన్నాను. దూకాను. ఎవరో పైకి లాగారు. చూస్తే షూటింగ్‌ చూస్తున్న కుర్రాడు. నేను ప్రమాదవశాత్తు జారిపడ్డాననుకున్నాడు. ఇక చూడండి. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. మళ్లీ ఆ సీన్‌ చేయాలి కదా. ఇంట్లో స్విమ్మింగ్‌ ఫూల్‌ ఉన్నా ఎప్పుడూ ఈత కొట్టలేదు. నేర్చుకుందాం అనుకున్నా. నాకు రాలేదు. 
కృష్ణ: ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ సినిమాలో నేను పులితో ఫైట్‌ చేసే సీన్‌ ఉంటుంది. పులి తెప్పించాం. దానికి మత్తు మందు ఇచ్చారు. నరేశ్‌ ఏమో ఆ పులితో ఫొటో దిగుతానని గొడవ. ఎంత మత్తు మందు ఇచ్చినా.. సడెన్‌గా మత్తు వదులుతుంది. వద్దన్నాం. దగ్గరికెళ్లి ఫొటో దిగాడు. దానికి కొంచెం మత్తు వదిలింది. ఫట్‌మని తోకతో నరేశ్‌ తలమీద ఒక్కటిచ్చింది. పెద్ద దెబ్బే తగిలింది.

50 ఏళ్ల వైవాహిక జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్‌కు ఏం చెబుతారు? 
విజయనిర్మల: ఒకరిని ఒకరం ఫుల్‌గా అర్థం చేసుకున్నాం. ఆయనకు ఎందుకు కోపం వస్తుందో నాకు తెలుసు. నాకెందుకు కోపం వస్తుందో ఆయన అర్థం చేసుకోగలడు. అర్థం అయిపోయినప్పుడు గొడవలు రావు. గొడవలు వస్తాయి. రావు అని కాదు. కానీ అవే సర్దుకుంటాయి. 
     
అసలు కృష్ణగారికి కోపం వస్తుందా?
 
రాదు. చాలా తక్కువ. కానీ వస్తే మాత్రం భయంకరుడు. వచ్చిందంటే ఆయన అరచేయి చూడండి.. ఇటుక రాయిలా ఉంటుంది. ఫట్‌ అని వేసేస్తారు. నా మీద ఎప్పుడూ చేయి లేపలేదు. 

ఎప్పుడైనా సరే మీ ఇద్దరూ పిల్లలు కావాలని కోరుకున్నారా? వద్దనుకున్నందుకు బాధపడ్డారా? 
విజయనిర్మల: మేమే వద్దనుకున్నాం. ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ మేం పిల్లల్ని కంటే ఆల్రెడీ ఉన్న పిల్లలు ‘మీవాళ్లు.. మావాళ్లు’ అనే విభేదాలు వస్తాయి. అసలు బిడ్డలే లేకుంటే అందర్నీ మన బిడ్డలు అనుకోగలం కదా. అందుకే ఆనందంగానే వద్దని డిసైడ్‌ అయ్యాం. ఎప్పుడూ బాధ అనిపించలేదు.

కృష్ణ: మహేశ్‌బాబు ఎప్పుడూ మా నాన్న అని చాలా బాగా మాట్లాడతాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ఒక యంగ్‌ హీరోకు ఉన్న ఫాలోయింగ్‌ వచ్చేసింది. కనబడగానే క్లాప్స్‌ కొట్టేవారు. విజిల్స్‌ వేసేవారు. ఫస్ట్‌ సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో ‘రాజకుమారుడు’ చేశాడు. స్టార్‌ హీరోకు ఉన్నంత ఓపెనింగ్స్, స్టార్‌ హీరోల సినిమాలు ఆడే రేంజ్‌లో వంద రోజులు ఆడింది ఆ సినిమా (కళ్లల్లో మెరుపుతో).

విజయనిర్మల: చాలా మంది హీరోలున్నారు కానీ అందగాళ్లు లేరు. మహేశ్‌ మంచి అందగాడు. మొన్న వచ్చిన ‘భరత్‌ అనే నేను’లో మీసాలు పెట్టిన సీన్‌లో సేమ్‌ కృష్ణగారిలానే ఉన్నాడు. 
కృష్ణ: ముందు ‘భరత్‌ ప్రమాణ స్వీకారం’ అంటూ ఓ వాయిస్‌ క్లిప్‌ రిలీజ్‌ చేశారు. అప్పుడు చాలామంది కృష్ణగారు డబ్బింగ్‌ చెప్పారు అని అన్నారు. మా ఫ్యాన్స్‌లో చాలామంది మహేశ్‌కి ఫోన్‌ చేసి మీరు చెప్పారా? నాన్నగారు చెప్పారా? అని అడిగారట. చాలా బావుంది, నా వాయిస్‌లానే ఉంది అని మెచ్చుకున్నాను.
విజయనిర్మల: మహేశ్‌ మంచి బిడ్డ. ఎప్పుడూ ఒకర్ని కసురుకోవడం, కోప్పడటం ఉండదు. 

నరేశ్‌గారి కెరీర్‌ గ్రాఫ్‌ తీసుకున్నా ‘శతమానం భవతి, రంగస్థలం, సమ్మోహనం’.. ఇలా కంటిన్యూస్‌గా మంచి క్యారెక్టర్స్‌ చేస్తున్నారు..
విజయనిర్మల: ‘రంగస్థలం’ సినిమాలో చాలా బాగా చేశాడు. నరేశ్‌ హీరోగా చేసినన్ని రోజులు చేసి ఆ తర్వాత ఖాళీగా కూర్చోలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ బాగా రాణిస్తున్నాడు. ఏ క్యారెక్టర్‌ అయినా చేయాలనుకునే మనస్తత్వం. అందంగా కనిపించే పాత్రలే చేయాలనుకోడు. పాత్రకు తగ్గట్టు ఉంటాడు. 
కృష్ణ: నరేశ్‌ మంచి ఆర్టిస్ట్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆల్మోస్ట్‌ నంబర్‌ 1 పొజిషన్‌కు వచ్చారు. 
     
మీరు రిలీజవుతున్న ప్రతి సినిమా చూస్తారా?
కృష్ణ: ఇంట్లోనే ఓ హోమ్‌ థియేటర్‌ ఏర్పాటు చేసుకున్నాం. రీసెంట్‌ సినిమాలు చూస్తాం. అన్ని సినిమాలు చూస్తే బోర్‌ కొట్టేస్తుంది. అందుకే సక్సెస్‌ అయిన సినిమాలు చూస్తాం.
     
సినిమాలు చూడటం ఓకే. చేయాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు?
కృష్ణ: కొంచెం బ్యాక్‌పెయిన్‌ ఉంది. ఇప్పటివరకూ మంచి మంచి సినిమాలు చేసి చిన్న చిన్న వేషాలు వేయడం ఎందుకు అని? అలాగే ‘కృష్ణగారి నడక మారింది’ అని ఆ మధ్య ‘మల్లన్న, బలాదూర్‌’ సినిమాలప్పుడు కంప్లైంట్‌ వచ్చింది. ఎన్నో గొప్ప సినిమాల్లో యాక్ట్‌ చేసి మళ్లీ ఆ పేరు పోగొట్టుకోవడం ఎందుకు? అనిపించింది. ఆర్టిస్ట్‌ అన్న తర్వాత పర్ఫెక్ట్‌గా ఉండాలనుకున్నా. అందుకే ఆ చిన్న కంప్లైంట్‌
నాకు పెద్దదిగా అనిపించింది. మానేశా. ఏ చానల్‌ పెట్టినా రోజూ నాది ఏదో ఒక  సినిమా అయినా ప్లే అవుతూనే ఉంటుంది. 

మంజుల, సుధీర్‌బాబు.. ఇలా మీ ఫ్యామిలీలో ఎవరికి వాళ్లు ప్రూవ్‌ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తోంది?
కృష్ణ: మంజుల చిన్నప్పటి నుంచి మా సినిమా సెట్స్‌కు వస్తుండేది. అలాగే సినిమా మేకింగ్‌ టెక్నిక్‌ తెలిసింది. సినిమాలో కూడా యాక్ట్‌ చేయాలనుకుంది. కానీ ఫ్యాన్స్‌ వద్దన్నారు. మంజుల హీరోయిన్‌గా కృష్ణారెడ్డి ఒక సినిమా అనౌన్స్‌ చేశాడు. అయితే బెజవాడలో తన కటౌట్‌ని కూల్చేశారు. 
   
ఇలాంటి అభిమానులు ఉండటం ఎలా అనిపిస్తుంటుంది? కూతురి ఆశ నెరవేరలేదని బాధపడ్డారా? 
కృష్ణ: మంజులను నా అభిమానులు తమ సొంత చెల్లెల్లా భావించారు. ‘షో’కు నేషనల్‌ అవార్డ్‌ వచ్చాక ఆ సినిమా రిలీజ్‌ చేసింది. అలాంటి పాత్రలైతే బావుంటుంది. రెగ్యులర్‌ హీరోయిన్‌గా అయితే వద్దని ఫ్యాన్స్‌ అన్నారు. వాళ్లు అంతగా సొంతం చేసుకోవడం హ్యాపీగా అనిపిస్తుంటుంది. 
     
ఫైనల్లీ ఇప్పుడు మీ లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంది? 
మార్నింగ్‌ త్వరగానే నిద్ర లేస్తాం. లేచిన వెంటనే ఆయన వాకింగ్‌ చేస్తారు.  నేను స్నానం చేసి పూజ చేసుకుంటాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌. లంచ్, డిన్నర్‌ కరెక్ట్‌ టైమ్‌కి తీసుకుంటాం. 

 కృష్ణగారి బయోపిక్‌ తీస్తే ఒప్పుకుంటారా? 
విజయనిర్మల: అలాంటి మనిషి దొరకాలి కదా. ఇమిటేట్‌ చేయొచ్చు. కానీ కృష్ణగారిని ఇమిటేట్‌ చేయడం కష్టం. ఆ అందం ఎవరికీ రాదు. ఆయన సాఫ్ట్‌నెస్‌ ఎవరికీ రాదు. చేస్తే మహేశ్‌ చేయాలి. మహేశ్‌ కూడా చాలా ఫాస్ట్‌. సెట్లో చాలా జోక్స్‌ వేస్తుంటాడు. కృష్ణగారు అవేం చేయరు. అలా దూరంగా ఉండిపోతారు. జోక్‌ వేయడం కూడా రాదు. 

కృష్ణగారు మీ చీరలు సెలెక్ట్‌ చేస్తారా?
విజయనిర్మల: చేయరు. కానీ బాగా డ్రెస్‌ చేసుకుంటే బావుంది అని మాత్రం కాంప్లిమెంట్‌ ఇస్తారు. లేదంటే అప్పలమ్మలా ఉన్నావు అంటారు. జడ వేసుకోకుండా ముడి వేసుకుంటే పిచ్చుకగూడు, కాకి గూడు అని సరదాగా అనేవారు.

విజయనిర్మల గారిని పెళ్లి చేసుకున్నాక ‘తప్పు చేశాను’ అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? 
కృష్ణ: ఎప్పుడూ అనిపించలేదు. అలాంటి సందర్భాలు తను క్రియేట్‌ చేయలేదు.
విజయనిర్మల: లేదు. మా పిల్లలకు కూడా అనిపించలేదు. వాళ్లు చిన్నప్పటి నుంచి పిన్నీ పిన్నీ అని నాతో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. మంజుల నీళ్లలో పడవ వేసే ఆట నాతో ఆడుకునేది.  నేనూ చిన్నపిల్లలా వాళ్లతో ఆడుకునేదాన్ని. ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టపడతారు. 
– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement