భీమవరంలో ఈ బుల్లోడి అడుగు పడితే దద్దరిల్లాల్సిందే!
‘‘ఒకప్పుడు ఇదే ప్రాంగణంలో నేను డ్యాన్స్ చేశాను. ‘వర్షం’ సినిమా వేడుక జరిగినప్పుడు ఇక్కడికి వచ్చాను. మళ్లీ ఇదే రావడం. పది సినిమాల్లో చేసే కామెడీని ఈ ఒక్క సినిమాలోనే చేశాను’’ అని సునీల్ చెప్పారు. సునీల్, ఎస్తర్ జంటగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ పాటల సీడీ ఆవిష్కరణ భీమవరంలో జరిగింది. ఈ సందర్భంగా సునీల్ ఉద్వేగంగా మాట్లాడారు.
‘వర్షంలో పిడుగు, భీమవరంలో ఈ బుల్లోడి అడుగు పడితే దద్దరిల్లాల్సిందే’ అంటూ డైలాగ్ చెప్పి, ఆహూతులను ఉత్సాహపరిచారు. అశోక్‌కుమార్ మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారు ఎవరి సహాయం లేకుండా పైకి వచ్చిన వ్యక్తి. సునీల్ కూడా అంతే. చిరంజీవిగారు ఎలాగైతే డ్యాన్సులు చేస్తారో, సునీల్ కూడా అలాగే చేస్తాడు. సో... తనలో చిరంజీవిగారిని చూసుకోవచ్చు’’ అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో ఈ చిత్రం రూపొందడం విశేషమని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ వేడుకలో మాగంటి బాబు, జయప్రకాష్‌రెడ్డి, అంబికా కృష్ణ, రఘురామరాజు, అనూప్, నాగేశ్వరరావు, చంద్రబోస్, రాజారవీంద్ర, ఎస్తర్ తదితరులు మాట్లాడారు.