సాక్షి, చెన్నై : స్టన్నింగ్ వార్త ఏంటో తెలుసా? శృంగార తారగా గుర్తింపు పొందిన సన్నిలియోన్ తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం, అదీ చారిత్రక ఇతివృత్తంతో రూపొందనున్న చిత్రం కావడమే. ఇదంతా ప్రచారంలో ఉన్న విషయమే. అయితే కొత్త విషయం ఏమిటంటే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అమ్రేశ్ సంగీత బాణీలు అందించనున్నారంట.
ఆయన తొలి చిత్రం నానే ఇన్నుళ్ ఇల్‌లై తోనే కథానాయకుడు, సంగీత దర్శకుడు అంటూ జోడెద్దుల సవారీ చేశారు. ఆ తరువాత సంగీతంపైనే దృష్టి సారించిన అమ్రేశ్ మొట్టశివ కెట్టశివ చిత్రానికి సంగీత బాణీలు కట్టి శభాష్ అనిపించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే అమ్రేశ్ సంగీతం అందించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకు పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
త్రిష ప్రధాన పాత్ర పోషించిన గర్జన, ప్రభుదేవా హీరోగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, ప్రభు, ప్రభుదేవా కలిసి నటిస్తున్న చార్లి చాప్లిన్–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా సన్నిలియోన్ నటించనున్న చిత్రానికి సంగీతం అందించే అవకాశం అమ్రేశ్‌ను వెతుక్కుంటూ వచ్చింది. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్సీ స్టీఫెన్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చారిత్రాత్మక కథా చిత్రానికి వీసీ.వడివుడయాన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఈ అవకాశంపై అమ్రేశ్ స్పందిస్తూ.. ‘చిత్ర కథ అద్భుతంగా ఉంది. ఇందులో సన్నిలియోన్‌కు భారీ పోరాట దృశ్యాలు ఉంటాయి. ఈ చిత్రానికి సంగీతం రూపొందించడానికి విదేశాలకు వెళుతున్నాం. చాలా కొత్త బాణీలను రూపొందించనున్నాను. ఆ తరుణం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment