సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం 68వ వసంతంలోకి అడుగు పెట్టారు. తలైవాకు శుభాకాంక్షలు తెలుపుకునేందుకు పోయెస్ గార్డెన్ వైపుగా అభిమాన లోకం పోటెత్తింది. అక్కడ ఆయన లేకపోవడం నిరాశను మిగిల్చినా, అభిమానం ఏమాత్రం తగ్గలేదు. తమకు కథానాయకుడు దూరంగా ఉన్నా, సంబరాల్లో అభిమాన లోకం తగ్గలేదు.
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి లాగేందుకు ఆయన అభిమాన లోకం తీవ్రంగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బర్త్‌డే సందర్భంగా ఏదేని ప్రకటన చేస్తారా అన్న ఆశతో ప్రతి ఏటా బర్త్‌డే వేళ అభిమానులు ఎదురు చూడడం పరిపాటే. అయితే, ఈ ఏడాది బర్త్‌డేకు రాజకీయ ప్రాధాన్యతను అభిమాన లోకం పెంచింది. ఇందుకు కారణం అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలే.
దీంతో తలై‘వా’ అన్న పిలుపు మిన్నంటుతోంది. కథానాయకుడు రాజకీయాల్లో వచ్చేసినట్టే అన్న ప్రచారాలు సైతం ఈ సమయంలో ఊపందుకున్నాయి. అయితే, ఎక్కడా రజనీ చిక్కలేదు. ఈ నేపథ్యంలో బర్త్‌డే వేళ తమ హీరో, రాజకీయ నేతగా అవతరించేనా అన్న ఆత్రుతతో అభిమాన లోకం మంగళవారం చెన్నైకు పోటెత్తింది.
అభిమానులకు దూరంగా : ప్రతి ఏటా రజనీ బర్త్‌డే సందర్భంగా అభిమానులు పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసం వద్దకు తరలి రావడం జరుగుతూ వస్తున్నది. ఈ సమయంలో అభిమానుల్ని పలకరించే వారు. అయితే, గత ఏడాది అమ్మ జయలలిత మరణంతో బర్త్‌డేకు రజనీ దూరంగానే ఉన్నారు. ఈ సారి మాత్రం ఆయన్ను రాజకీయాల్లోకి లాగడం లక్ష్యం అన్న నినాదంతో అభిమానులు తరలి వచ్చేందుకు సిద్ధ పడ్డారు. దీనిని పసిగట్టినట్టుంది...అందుకే కాబోలు ఈ సారి పోయెస్ గార్డెన్‌లో అభిమానులకు రజనీ దర్శనం ఇవ్వలేదు. అçసలు ఆయన ఇంట్లోనే లేదన్న సమాచారం అభిమానులకు నిరాశే.
తగ్గని అభిమానం : రజనీకాంత్‌ను చూడడానికి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు రాష్ట్రం నలు మూలల నుంచి తండోప తండాలుగా పోయెస్ గార్డెన్‌కు ఉదయాన్నే పోటెత్తారు. గతంలో జయలలిత బతికి ఉన్నప్పుడు పోయెస్ గార్డెన్‌లోని రోడ్లన్నీ పోలీసు నిఘా వలయంలో ఉండేది. ఈ దృష్ట్యా, అటు వైపుగా ఎవ్వరు వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం అమ్మ లేని దృష్ట్యా, భద్రత కూడా లేదు. దీంతో తండోప తండాలుగా తరలి వచ్చిన వారితో ఆ పరిసరాలు కిటకిట లాడాయి.
ఎక్కడికక్కడ అభిమానులు రజనీ ఫొటోలను, నీలం, తెలుపు, ఎరుపు రంగుతో కూడిన జెండాల్ని చేత బట్టి తలైవా నినాదాన్ని మిన్నంటేలా చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానుల్ని అడ్డుకున్నారు. రజనీ ఇక్కడ లేదని, ప్రజలకు ఇబ్బంది కల్గించ వద్దని హెచ్చరించారు. దీంతో కొందరు అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరి కొందరు తాము తీసుకొచ్చిన కేక్‌లను అక్కడే కత్తిరించి సంబరాలు చేసుకుని ముందుకు సాగారు. ఆ తదుపరి అభిమానులు మళ్లీ తరలి రాకుండా పోయెస్‌గార్డెన్‌లోని అన్ని మార్గాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక, రజనీకాంత్ ఎక్కడ అన్న ప్రశ్న బయలు దేరింది. ఆయన బెంగళూరులో ఉన్నట్టు కొందరు, కాదు..కాదు చెన్నై శివార్లలోని కేలంబాక్కంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు మరికొందరు వ్యాఖ్యానించారు.
పోస్టర్ల హోరు...సేవల జోరు :
రజనీ అభిమాన సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు జరిగాయి. రక్తదానం, అన్నదానం , వైద్య శిబిరాలతో ముందుకు సాగారు. రజనీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తమ తమ ప్రాంతాల్లో హోరెత్తించారు. అలాగే, దివంగత సీఎంలు కామరాజర్, అన్నాదురై చిత్ర పటాల మధ్యలో రజనీ ఫొటోతో పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇందులో మూడో కరుప్పు తమిళన్(నలుపు తమిళుడు), ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, నీతోనే ఈ తమిళనాడుకు న్యాయం అన్న నినాదాల్సి అభిమాన లోకం పొందుపరిచారు. ఇక, రజనీ కాంత్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తిన అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఎక్కువే. ఇందులో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఉన్నారు.
ఆశ ఉంది...ఓపిక పట్టాల్సిందే : రజనీ రాజకీయాల్లోకి రావాలన్న ఆశ అందరిలోనూ ఉందని, అయితే, ఇందుకు మరింతగా ఓపిక పట్టాల్సి ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కృష్ణగిరిలో జరిగిన రజని బర్త్‌డే వేడుకలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సహాయకాలను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలనే ఆశ రజనీకి ఉందన్నారు. అయితే, ఆ సమయం ఇంకా రాలేదన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావడం సంతోషకరమని, అది ఎప్పుడు అనేది ఆయనే ప్రకటిస్తారన్నారు. అంత వరకు ఓపికగా ఉండాలని అభిమానులకు సూచించారు. తమ తల్లిదండ్రుల పూర్వికం కృష్ణగిరిలోని నాచ్చికుప్పం గ్రామం అని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపం వద్దకు సైతం రజనీ కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన అక్కడ కూడా లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అయితే టీనగర్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయాన్ని దర్శించి రజనీ ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పళని స్వామి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment