
సూపర్ స్టార్ ఆరోగ్యంగానే ఉన్నారు!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారని వస్తున్న కథనాలలో వాస్తవం లేదని ఆయన సెక్రటరీ తెలిపాడు. అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారని అందువల్లే బ్రహ్మాండంగా నిర్వహించాల్సిన కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడిందని మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. రజనీకాంత్ లేకుండానే కబాలీ ఆడియో లాంచ్ జరగడంతో ఈ వార్తలకు ఊతమిచ్చినట్లు కనిపించింది. రజనీ అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అభిమానులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితుడు చెప్పాడు.
జూలై మొదటి వారంలో రజనీ సార్ చెన్నైకి తిరిగొస్తారని ఆయన సెక్రటరీ తెలిపాడు. బిజీ బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఆయన అలసి పోయారని, కాస్త విరామం అవసరమని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు రజనీ కాస్త బ్రేక్ తీసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. చెన్నైలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత విశ్రాంతి కోసం అమెరికా ట్రిప్ కు వెళ్లారని, అయితే కాలిఫోర్నియాలో కిడ్నీ సంబంధిత సర్జరీ చేయించుకున్నారని కథనాలు వచ్చాయని పేర్కొన్నాడు. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న 'రోబో 2.0' షూటింగ్ లో జూలై రెండో వారంలో పాల్గొంటారని వివరించారు.