సల్మాన్ ను వెంటాడుతున్న 'హిట్ అండ్ రన్'
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వీడని నీడలా వెంటాడుతోంది. సుప్రీంకోర్టులో సల్మాన్ కు వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ విదితమే.
13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో బొంబాయి హైకోర్టు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై ఉన్న అన్ని అభియోగాలనూ హైకోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు సెషన్ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.
హిట్ అండ్ రన్ మొదలైందిలా...
2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్‌లో మద్యం సేవించి, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సల్మాన్ బాంద్రా శివార్లలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై వాహనంతో దూసుకెళ్లాడని, ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారన్న ఆరోపణలతో ఈ బాలీవుడ్ నటుడిపై కేసు నమోదైంది.